jockey Politics: తోపుదుర్తి, పరిటాల ఫ్యామిలీ మధ్య రంజుగా రా'జాకీ'యం
జాకీ ప్రకంపనలు రాప్తాడు రాజకీయాల్లో తీవ్రస్థాయిలో ఉన్నాయి. జాకీ పరిశ్రమ వెళ్లిపోవడానికి మీరంటే మీరంటూ ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకొంటున్నారు.
జాకీ పరిశ్రమ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో నానుతున్న పేరు. అసలు జాకీ వెనుక ఉన్న వివాదం ఏంటి? ఎప్పుడు ఆ పరిశ్రమకు అనుమతులు వచ్చాయి. ఇప్పుడు ఆ కంపెనీ ఎందుకు ఆ కంపెనీ వెనక్కి వెళ్లింది. ఆ సంస్థ రెండు రాజకీయా ఫ్యామిలీల మధ్య వివాదం రాజేసింది.
రాప్తాడు నియోజకవర్గంలో జాకీ ప్రకంపనలు సృష్టిస్తోంది. మీ వల్లే జాకీ పరిశ్రమ వెనక్కి వెళ్లిందంటే కాదు మీరే కారణం అంటూ ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు నేతలు. నిరుద్యోగులతో కలిసి జాకీ పరిశ్రమకు కేటాయించిన భూమి వద్ద నుంచి రాప్తాడు వరకు పరిటాల సునీత, పరిటాల శ్రీరాం ఇద్దరు కలిసి పాదయాత్ర చేయడం రాజకీయ దుమారం రేపుతోంది. తాము కష్టపడి తెచ్చిన కంపెనీని వెనక్కి పంపారంటూ ప్రస్తుత ఎంఎల్ఏ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డిపై మండి పడ్డారు సునీత, శ్రీరాం.
అనంతపురం రాజకీయాల్లో తీవ్ర అలజడి రేపుతున్న జాకీ పరిశ్రమకు అనుమతులు ఎప్పుడు వచ్చాయి.. ఎందుకు పరిశ్రమకు అన్ని సబ్సిడీలు ఇచ్చినప్పటికీ స్టార్ట్ కాకుండానే వెనుదిరిగింది అనేదానికి అనేక కారణాలు ఉన్నాయి. ఇరువురు నేతలు తప్పు తమది కాదంటే తమది కాదంటూ ఒకరిపై ఒకరు అరోపణలు చేసుకొంటున్నారు.
అసలు జాకీ పరిశ్రమ గత ప్రభుత్వ హయాంలో 2018లో అనంతపురం సమీపంలో 26 ఎకరాలలో 200 కోట్లతో పరిశ్రమ ఏర్పాటుకు భూమిని కేటాయించింది నాటి తెలుగుదేశం ప్రభుత్వం. ఈ పరిశ్రమ ఏర్పాటు అయితే దాదాపు పదివేల మందికి మూడు షిఫ్టుల్లో ఉద్యోగాలు కల్పిస్తామంది జాకీ పరిశ్రమ. ఈ హామీతో నాటి ప్రభుత్వం అత్యంత విలువైన భూమిని జాకీ పరిశ్రమకు కేటాయించింది.
కానీ పరిశ్రమ పనులు ప్రారంభించే సమయానికే రాజకీయ జోక్యం పెరిగిపోయిందన్న విమర్శలు ఎక్కువయ్యాయి. అనంతపురం సమీపంలో జాకీ పరిశ్రమకు కేటాయించిన భూములు అత్యంత విలువైనవి కావడంతో, ఒకరిపై ఒకరు పరిశ్రమ పెద్దలను కమీషన్ల కోసం బెదరించడం వల్లే పరిశ్రమ వెళ్లిపోయేందుకు కారణం అయ్యారంటూ విమర్శించుకుంటున్నారు.
ప్రకాశ్ రెడ్డి మాత్రం నాటి ప్రభుత్వ హయాంలోనే కమీషన్ల కోసం పరిటాల కుటుంబం వేధించడం వల్లే పరిశ్రమ వెళ్లిపోయిందన్న ఆరోపణలు చేస్తున్నారు. అయితే తాము తెచ్చామని.. దానిని జీర్ణించుకోలేకే అధికారంలోకి వచ్చిన వెంటనే ఎంఎల్ఏ తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి కుటుంబం సభ్యులు 15 కోట్లు కమీషన్ కావాలంటూ ఒత్తిడి తెచ్చారని పరిటాల ఫ్యామిలీ ఆరోపిస్తోంది. దాన‌్ని ఇవ్వడానికి ఇష్టపడని జాకీ పరిశ్రమ ఈ ప్రాంతం వద్దని పారిపోయేలా చేశారంటూ విమర్శిస్తున్నారు.
ఈ పరిశ్రమ స్టార్ట్ అయ్యుంటే దాదాపు పదివేల మంది మహిళలకు ఉపాది లభించేది. కానీ ఏం జరిగిందో తెలియదు కానీ జాకీ పరిశ్రమ రాప్తాడు నుంచి తమిళనాడులోని సేలం ప్రాంతానికి వెళ్లిపోయింది. ఇద్దరు బలమైన రాజకీయ కుటుంబాల ఆధిపత్య ప్రాంతం వద్దనుకొన్నారో ఏమో తెలియదు కానీ అత్యంత కీలకమైన జాకీ పరిశ్రమ వెళ్లిపోయింది. జాకీ ప్రకంపనలు మాత్రం ఇరుపార్టీల్లోను తీవ్రస్థాయిలోనే ఉన్నాయన్నది మాత్రం అందరికి అర్థం అవుతుంది.