Janasena: పవన్ కళ్యాణ్‌ను అడ్డుకోవాలని చూస్తే వారాహి కింద నలిగిపోతారు: కిరణ్ రాయల్
ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు రైతు కుటుంబాలకు సాయం చేస్తున్న పవన్ ను విమర్శించే విషయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన నేత కిరణ్ రాయల్ నిప్పులు చెరిగారు.
- వైసీపీ మంత్రులకు కిరణ్ రాయల్ సవాల్
- నగిరిలో మంత్రి రోజా గెలిస్తే గుండు కొట్టించుకుంటా
- మీ ప్రభుత్వం రాకపోతే మీరు అదే పని చేస్తారా
- అడ్డుకోవాలని చూస్తే వారాహి కింద నలిగిపోతారు
- సజ్జల నోరు అదుపులో పెట్టుకో రానున్నది జనసేన ప్రభుత్వమే
- తిరుపతి జనసేన ఇంఛార్జ్ కిరణ్ రాయల్
వారాహి వాహనంతో ప్రజా సమస్యలను తెలుసుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించడానికి సిద్ధమైతే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మంత్రులు సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మెప్పు పొందడం కోసం తమ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేస్తున్నారని తిరుపతి జనసేన పార్టి అసెంబ్లీ ఇంఛార్జ్ కిరణ్ రాయల్ మండిపడ్డారు. తమ జనసేనాని నిస్వార్ధంగా ప్రజాసేవ చేయడానికి అడుగులు వేస్తున్నారని, అది చూసి వైసీపీ నేతలు ఓర్చుకోలేక పోతున్నారని ఎద్దేవా చేశారు.
తిరుపతి ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకుడు కిరణ్ రాయల్ మాట్లాడుతూ.. వైసీపీ మంత్రి రోజా జబర్దస్త్ స్క్రిప్ట్ లాగ, జనసేనపై ఛాలెంజ్ విసరడం పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024లో నగరిలో రోజా మరోసారి గెలిస్తే, తాను రోజా ఇంటి ముందే గుండు గీయించు కోవడానికి సిద్ధం అన్నారు. ఒకవేళ వచ్చే ఎన్నికల్లో మంత్రి రోజా ఓడిపోయినా, వైసీపీ ప్రభుత్వం రాకపోయినా గుండు కొట్టుకోవడానికి ఆమె సిద్ధమా అని కిరణ్ రాయల్ సవాల్ విసిరారు.
మేకప్ తీసి రోజా బయటకు వస్తే అసలు స్వరూపం బయటపడి రోజా సొంత కారు డ్రైవరే ఆమెను గుర్తుపట్టరన్నారు. అదే విధంగా రోజా అవినీతి నిజ స్వరూపం ప్రజలకు త్వరలోనే తెలుస్తుందన్నారు. భవిష్యత్తులో ఎమ్మెల్యే పదవి ఉండదని, జబర్దస్త్ జడ్జి పాత్ర కూడా ఉండదని, ఎందుకంటే రానున్నది జనసేన ప్రభుత్వం అన్నారు. కౌలు రైతులు 3000 మంది ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఒక్కరికి లక్ష రూపాయల చొప్పున జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సాయం అందిస్తున్నారు. కానీ మంత్రి అంబటి రాంబాబు, ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలు రైతు కుటుంబాలకు సాయం చేస్తున్న పవన్ ను విమర్శించే విషయంలో నోరు అదుపులో పెట్టుకోవాలని వారిపై నిప్పులు చెరిగారు. నిస్వార్ధమైన మా జనసేనానిని విమర్శిస్తే చూస్తూ ఊరుకోమని, ఇది మరోసారి రిపీట్ అయితే రాష్ట్రంలో ఎక్కడ వైసీపీ నేతలను తిరగనివ్వమని మంత్రులకు జనసేన నాయకుడు కిరణ్ రాయల్ హెచ్చరించారు.
పవన్ ఎందుకు అలా అన్నారు?
భవిష్యత్‌లో వైసీపీ చేసే రాజకీయాలన్నీ హింసాత్మకంగానే ఉంటాయన్నారు పవన్ కల్యాణ్. అందుకు ఉదాహరణగా మాచర్లలో జరిగిన ఇన్సిడెంట్‌ను ప్రస్తావించారు. అందుకు పార్టీ లీడర్లు సిద్ధంగా ఉండాలని చెప్పుకొచ్చారు. మళ్లీ వైసీపీని గెలిపిస్తే రాష్ట్రం మరింత అంధకారంలోకి వెళ్లిపోతుందని అభిప్రాయపడ్డారు పవన్. రాష్ట్రంలో స్థిరత్వం కలిగిన అభివృద్ధి ఆకాంక్షించే ప్రభుత్వం రావాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగానే 2014 కూటమి అంశాన్ని ప్రస్తావించారు. 2014లో గెలిచిన కూటమి కొన్ని కారణాల వల్ల 2019లో పోటీ చేయలేదని, అందుకే వైసీపీ అధికారంలోకి వచ్చిందన్నారు పవన్ కల్యాణ్.