Cyclone Mandous Effect: శ్రీవారి భక్తులకు అలర్ట్ - మండూస్ తుఫాన్ ప్రభావంతో శ్రీవారి మెట్టు మార్గం మూసివేత
మాండూస్ తుఫాన్ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శ్రీవారి నడక మార్గం తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
శ్రీవారి భక్తులకు అలెర్ట్.. మాండూస్ తుఫాన్ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షంతో శ్రీనివాసుడి భక్తులకు అవస్ధలు తప్పడం లేదు. పలు రాష్ట్రాల నుండి అనేక రూపాల్లో తిరుమలకు చేరుకుంటు ఉంటారు భక్తులు. అందులో ప్రధానంగా చెప్పుకోదగ్గింది అలిపిరి నడక మార్గం, శ్రీవారి నడక మార్గం. స్వామి వారిపై అపారమైన భక్తి భావంతో భక్తులు ఒక్కోక్కో మొట్టుకు పసుపు, కుంకుమ అద్దుతూ కర్పూరంను వెలిస్తూ గోవింద నామ స్మరణ చేస్తూ ఏడకొండలకు చేరుకుంటారు భక్తులు. ప్రతి నిత్యం స్వామి వారి సన్నిధిలో దాదాపుగా డెభై వేల నుండి ఎనభై వేల మంది వరకూ భక్తులు దర్శించుకుంటారు. ఇందులో దాదాపు నలభై శాతం మంది భక్తులు నడక మార్గం గుండానే చేరుకుంటారు.
మాండూస్ తుఫాన్ ప్రభావం కారణంగా గత రెండు రోజులుగా చిత్తూరు, తిరుపతి జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో తిరుమలలో ఎడ తెరపి లేకుండా వర్షం కురవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారు. మరోవైపు శ్రీవారి మొట్టు మార్గంలో అధికంగా వర్షపు నీరు వస్తుండడంతో అప్రమత్తంమైన టిటిడి ఈ రోజు ఉదయం ఎనిమిది గంటల నుండి శ్రీవారి నడక మార్గం తాత్కాలికంగా మూసి వేస్తున్నట్లు ప్రకటించింది. వర్షం పూర్తిగా తగ్గే వరకూ భక్తులకు శ్రీవారి నడక మార్గం గుండా తిరుమలకు అనుమతి లేదని వెల్లడించింది. భక్తులను అలిపిరి నడక మార్గం, తిరుమల ఘాట్ రోడ్డు గుండా మాత్రమే అనుమతిస్తుంది టిటిడి. వర్షపు నీరు మెట్ల మార్గం గుండా ప్రవహించే సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టిటిడిహెచ్చరించింది.
ఆ తేదీన ప్రత్యేక దర్శనం కోటా విడుదల..
డిసెంబర్ 16 నుండి 31వ తేదీల్లో ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఆన్‌లైన్‌లో టిటిడి విడుదల చేయనుంది. డిసెంబర్ 16 నుండి 31వ తేదీల్లో రూ.300/- ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కెట్ల ఆన్‌లైన్ కోటాను డిసెంబర్ 13న ఉదయం 9 గంటలకు టీటీడీ వెబ్‌సైట్‌లో విడుదల చేయనుంది. భక్తులు ఈ విషయాన్ని గమనించి తదనుగుణంగా టిక్కెట్లను బుక్ చేసుకోవాలని టిటిడి విజ్ఞప్తి చేస్తుంది.శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా డిసెంబరు 17వ తేదీ నుండి జనవరి 14వ తేదీ వరకు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది టిటిడి.
డిసెంబరు 16వ తేదీ సాయంత్రం 6.12 గంటలకు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సందర్భంగా ఆలయంలో ఆరోజు సాయంత్రం ధనుర్మాస కైంకర్యం నిర్వహిస్తారు. ధనుర్మాసం సందర్భంగా ప్రతిరోజు ఉదయం 5.30 నుండి 6 గంటల వరకు భక్తులకు ధనుర్మాస దర్శనం కల్పిస్తారు. ఉదయం 11 నుండి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిత్య కల్యాణోత్సవం జరుగుతుంది. ధనుర్మాస శుక్రవారాల్లో తెల్లవారు జామున ధనుర్మాస కైంకర్యం, మూలవర్లకు అభిషేకం, ఉదయం 9.15 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా జనవరి 2వ తేదీ తెల్లవారుజాము నుండి భక్తులకు వైకుంఠ ద్వారా సర్వదర్శనం కల్పిస్తారు.