Punganur Politics: కానిస్టేబుల్ కుమారుడు పవన్ కళ్యాణ్ పోలీసులపై దాడిని ఖండించాలి: మంత్రి కారుమూరి
AP Minister Karumuri: కానిస్టేబుల్ కొడుకుగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ పుంగపూరులో పోలీసులపై టీడీపీ దాడిని ఖండించాలని ఏపీ మంత్రి కారుమురి నాగేశ్వరరావు డిమాండ్ చేశారు.
AP Minister Karumuri: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తూరు పుంగనూరు పర్యటనలో జరిగిన విధ్వంసంపై ఏపీ మంత్రి కారుమురి నాగేశ్వరరావు ఘాటుగా స్పందించారు. కానిస్టేబుల్ కొడుకుగా చెప్పుకునే పవన్ కళ్యాణ్ పుంగపూరులో పోలీసులపై టీడీపీ దాడిని ఖండించాలని డిమాండ్ చేశారు. పుంగనూరులో శుక్రవారం జరిగిన ఘటన ఒక బ్లాక్ డే అని వ్యాఖ్యానించారు. 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న నేత, మాజీ సీఎం అయిన చంద్రబాబు ఒక డాన్ లాగా... గుండాలకు అధిపతిలా వ్యవరించారంటూ మండిపడ్డారు. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నాయకత్వంలో కుప్పంలో చంద్రబాబును కుప్పకూల్చారని, అందుకే రాజకీయ దురుద్దేశంతో ఆ ప్రాంతంలో ప్రజలను భయభ్రాంతులకు గురి చేసే కుట్ర జరిగిందన్నారు.
ముందుగా చెప్పినట్లు బైపాస్ లో వెళ్లకుండా పుంగనూరు లోపలికి వచ్చి ప్లాన్ ప్రకారం విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. బందిపోటు ముఠాలు ఒక ఉరి మీద దాడి చేసినట్లుగా పుంగనూరులో చంద్రబాబు వ్యవహారం ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇతర జిల్లాల నుండి తెచ్చిన గూండాలతో పుంగనూరులో విధ్వంసం సృష్టించారని, లా అండ్ ఆర్డర్ లేదని చెప్పడానికి కుట్రకు తెరతీసి టీడీపీ శ్రేణులను చంద్రబాబు రెచ్చగొట్టారని మంత్రి కారుమురి ఆరోపించారు.
వచ్చే ఎన్నికల తరువాత చంద్రబాబు పార్టీ ఆఫీసుకి తాళం వేసుకోవటమే అని సెటైర్లు వేశారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మరోసారి ఘన విజయం సాధిస్తుందని దీమా వ్యక్తం చేశారు. పోలీసు కానిస్టేబుల్ కొడుకుని అని చెప్పుకునే పవన్ కళ్యాణ్, పుంగనూరు లో పోలీసులపై దాడి జరిగితే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. పోలీసులపై జరిగిన దాడిని జనసేనాని ఖండించాలన్నారు. కేవలం దత్త తండ్రి కోసం పవన్ ఆరాటం సరికాదని హితవు పలికారు.
ఎన్ని కేసులు ఉంటే అంత పెద్ద పదవులు ఇస్తామని లోకేష్ మాట్లాడటం అరచాలకు పరాకాష్ట అని వ్యాఖ్యానించారు. గత కొంతకాలం నుంచి ఏపీలో చంద్రబాబు, లోకేష్, పవన్ చేస్తున్న పనులు, వారి సభలు, చేస్తున్న విధ్వంసక ఘటనలపై విచారణ జరగాలని పోలీసులను కోరారు. ఈ ముగ్గురు చెప్పినట్లు చేసి టీడీపీ, జనసేనకు చెందిన యువత గొడవలకు దిగి కేసుల్లో ఇరుక్కుంటే వీరిని ఎవరు కాపాడతారని ప్రశ్నించారు.
పుంగనూరు ఘటనకు మంత్రి పెద్దిరెడ్డే కారణం, బర్త్‌రఫ్ చేయండి- గవర్నర్‌కు టీడీపీ వినతి
పుంగనూరు ఘటనలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోయిందని తెలుగు దేశం పార్టీ నాయకులు మండిపడ్డారు. ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. పుంగనూరు కేంద్రంగా తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు నిర్వహించిన యాత్రలో జరిగిన ఘటనపై టీడీపీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నాయకుల పర్యటనకు కనీసం పోలీసులు భద్రతను కల్పంచటం లేదని గవర్నర్‌ను కలసి ఫిర్యాదు చేశారు. విజయవాడలో రాజ్‌భవన్‌కు వెళ్లిన నాయకులు, గవర్నర్ అబ్దుల్ నజీర్‌కు ఫిర్యాదు చేశారు. ఘటనకు సంబంధించిన ఆధారాలు, ఫోటోలు, వీడియోలను కూడా సమర్పించారు. పులివెందుల్లోనే గొడవ పెట్టుకోవాలనే కుట్ర చేశారని తెలుగు దేశం పాలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య గవర్నర్‌కు వివరించారు.