Cobra at Alipiri: అలిపిరి నడక మార్గంలో నాగుపాము ప్రత్యక్షం - వెంటనే భక్తులు ఏం చేశారో తెలుసా !
Cobra at Alipiri Metla Margam: తిరుమల అలిపిరి నడక మార్గంలో నాగుపాము కనిపించడం కలకలం రేపింది. స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు రావడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Snake Catcher Bhaskar Naidu Rescue a Snake in Tirumala: తిరుపతి : తిరుమల అలిపిరి నడక మార్గంలో నాగుపాము కనిపించడం కలకలం రేపింది. ప్రతి నిత్యం గోవింద నామస్మరణలతో మార్మోగే అలిపిరి నడక మార్గంలో రోజులాగే వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు తిరుమలకు నడుచుకుంటూ వెళ్తున్నారు. ఇంతలో ఎక్కడి నుండి వచ్చిందో ఏమో గానీ దాదాపు ఆరు అడుగుల పొడవైన నాగుపాము మెట్ల మార్గంలోని 3500 ఫుట్ పాత్ వద్ద గల ఓ షాపులో దర్శనం ఇచ్చింది. ఏ సమయంలో షాపులో నాగుపాము దూరిందో ఏమో గానీ ఓ మూల పాము కదులుతూ ఉంటే ఏ ఎలుకో ఏదో అనుకుని షాపు యజమాని భక్తులు అడిగిన వస్తువులు దిస్తూ ఉన్నాడు.
ఎంతకీ ఆ మూల నుండి అలికిడి వస్తూనే ఉండడంతో ఆ మూలన ఒక్కసారి పరిశీలనగా చూశాక గుండె ఆగినంత పనైంది. ఒక్కసారిగా నాగుపాము కనిపించడంతో ఉలిక్కి పడిన షాపు యజమాని, పాము పాము అంటూ గట్టిగా కేకలు వేస్తూ దుకాణం నుండి బయటకు పరుగులు తీశాడు. ఇంతలో ఆ కేకలను విన్న భక్తులు కూడా దుకాణం నుండి భయంతో పరుగులు తీశారు. అయితే దుకాణ యజమానికి టక్కున ఆలోచన తట్టడంతో తిరుమలలో పాములు పట్టే భాస్కర్ నాయుడు (Snake Catcher Bhaskar Naidu)కి ఫోన్ చేశాడు. పాము ఉందని సమాచారం అందడంతో నిమిషాల వ్యవధిలో అక్కడికి చేరుకున్నాడు. భాస్కర్ నాయుడు. ఆ షాపులో మూలన దాక్కున్న నాగుపాము తోకను పట్టుకుని చాకచక్యంగా బయటకు లాగి.. కొంతసేపు నాగుపాముతో ఆటలాడి భక్తులకు కనువిందు చేశాడు.
పాములు చూసి భక్తులు ఎవరూ ఆందోళన చేందాల్సిన అవసరం లేదని వారికి ధైర్యం చెప్పాడు భాస్కర్ నాయుడు. నాగుపామును తనతో పాటుగా తెచ్చుకున్న సంచిలో జాగ్రత్తగా వేసుకుని అవ్వచారి కోనలో వదిలి పెట్టినట్లు సమాచారం. దీంతో అలిపరి నడక మార్గంలో వేళ్ళే భక్తులు, స్ధానిక దుకాణదారులు ఊపిరి పీల్చుకున్నారు.
సర్వదర్శనం టికెట్లు అందుబాటులో
సర్వదర్శనం టికెట్లను రోజుకు 30 వేల చొప్పున ఆఫ్‌లైన్‌లో, తిరుమలలోని భూదేవి కంప్లెక్స్, శ్రీనివాస కంప్లెక్స్, శ్రీ గోవిందరాజస్వామి సత్రాల్లో ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఇప్పటికే భక్తులకు అందించనుంది టీటీడీ. శ్రీవారి దర్శనానికి వచ్చే సామాన్య భక్తులను దృష్టిలో ఉంచుకొని టీటీడీ టైం స్లాట్ విధానంపై ప్రత్యేక కసరత్తు ప్రారంభించింది. తిరుమలకు వచ్చే ప్రతి భక్తుడు ఎలాంటి ఇబ్బందులకు గురికాకుండా సాఫీగా కలియుగ దైవాన్ని దర్శించుకునే విధంగా ఏర్పాట్లు చేస్తోంది. గతంలో మాదిరిగా కంపార్ట్ మెంట్లలో వేచియుండే పనిలేకుండా సర్వదర్శనం టిక్కెట్లు పొంది వచ్చిన టైం ప్రకారం క్యూలైన్ లోకి వెళితే గంట నుంచి ఒకటిన్నర్ర గంటలో స్వామి వారి దర్శన భాగ్యం కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.