తిరుమలలో చిక్కిన చిరుత- చిన్నారిని చంపిన మ్యాన్ ఈటర్ ఇదేనా!
రెండు రోజులుగా టెన్షన్ పెడుతున్న చిరుత బోనులో పడింది. టీటీడీ, అటవీ శాఖాధికారులకు ముప్పు తిప్పలు పెట్టిందీ చిరుత.
ఓ చిన్నారి ప్రాణం తీసి... భక్తులను భయభ్రాంతులకు గురిచేసి.... అధికారులను పరుగులు పెట్టించిన మ్యాన్ ఈటర్ చిరుత ఎట్టకేలకు బోనుకు చిక్కింది. మూడు రోజులు ముప్పుతిప్పలు పెడుతూ వచ్చిన చిరుతను తిరుమల తిరుపతి దేవస్థాన అటవీ అధికారులు రాత్రి బంధించారు.
రెండు రోజులుగా తిరుమలకు కాలి నడకన వెళ్లాలంటే టెన్షన్ టెన్షన్. మనిషి రక్తం రుచిమరిగిన చిరుత ఎటు నుంచి వచ్చి దాడి చేస్తుందో అన్న ఆందోళన ఉండేది. దీంతో భక్తులకు హాని లేకుండా తగిన జాగ్రత్తలు టీటీడీ తీసుకున్నప్పటికీ భయం మాత్రం వదల్లేదు. అందుకే రెండు రోజుల పాటు శ్రమించిన అధికారులు చిరుతను బంధించారు.
మనిషి రక్తం రుచిమరిగిన చిరుత తిరిగే ప్రాంతాలను గుర్తించిన అటవీ శాఖాధికారులు వేర్వేరు ప్రాంతాల్లో బోనులు ఏర్పుటు చేశారు. అదే మాదిరిగా చిన్నారిపై దాడి జరిగిన ప్రదేశంలో కూడా ఓ బోను ఉంచారు. ఒకరోజు గ్యాప్ ఇచ్చిన చిరుత ఆదివారం అర్థరాత్రి మళ్లీ వేటకు వచ్చింది. బోనులో చిక్కింది.
రెండు రోజుల క్రితం ఆరేళ్ల చిన్నారి చిరుత బలి తీసుకుంది. ఇది దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లక్షల మంది వచ్చే తిరుమల కొండపై చిన్నారిని చిరుత చంపేయడంతో అధికారులు హై అలర్ట్ అయ్యారు. చిరుత సంచరించే నాలుగు ప్రాంతాలను అధికారులు గుర్తించారు. ఆ ప్రదేశాల్లో బోనులను ఏర్పాటు చేశారు. చిన్నారిని చంపినప్పటి నుంచి ఆరు ప్రాంతాల్లో చిరుత సంచరించినట్టు అధికారులు చెబుతున్నారు.
అనుకున్నట్టుగానే చిరుత చిన్నారి ప్రాణం తీసిన ప్రాంతానికే వచ్చి చిక్కింది. అర్థరాత్రి టైంలో బోనులో పడిన విషయాన్ని క్షేత్రస్థాయి సిబ్బంది ఉన్నతాధికారులకు తెలియజేశారు. చిరుత చిక్కడంతో అటు టీటీడీ అధికారులు, వెంకటేశ్వరుడి భక్తులు ఊపిరి పీల్చుకున్నారు.
తిరుమలకు వెళ్లే నడకదారిలో రాత్రి వేళలో వన్యమృగాల సంచారం ఎక్కువ కావడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయంత్ర ఐదు గంటల తర్వాత టూవీలర్స్‌ను అనుమతించడం లేదు. చిన్నారులకు ప్రత్యేక ట్యాగ్స్ వేస్తున్నారు. సాయంత్రం రెండు గంటల తర్వాత వారిని కూడా నడక మార్గంలో అనుమతించడం లేదు. సోమవారం టీటీడీ కొత్త ఛైర్మన్ భూమన కరుణాకర్‌రెడ్డి హైలెవల్ కమిటీతో సమావేశం కానున్నారు. తిరుమల భక్తుల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించనున్నారు.
శనివారం ఒక్క రోజే అలిపిరి నడక మార్గం, ఘాట్ రోడ్డులో ఐదు ప్రాంతాల్లో చిరుత సంచారం జరిగింది. అలిపిరి నుంచి గాలిగోపురం వరకు మూడు ప్రాంతాలలో, గాలిగోపురం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత సంచరిస్తున్నట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. ఆదివారం ఉదయం 6:30 గంటల ప్రాంతంలో రెండోవ ఘాట్ రోడ్డులోని 38వ మలుపు వద్ద చిరుత వాహనదారులను తారాస పడింది. వాహనదారులు సమాచారం మేరకూ ఘటన స్ధలం వద్దకు చేరుకున్న అటవీ శాఖా అధికారులు ఆ ప్రాంతంను జల్లెడ పట్టారు.. అదే విధంగా ఆదివారం సాయంత్రం 2450వ మెట్టు వద్ద భక్తులకు చిరుత కనిపించడంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన భక్తులు వేంటనే సమీపంలో ఉన్న సిబ్బందికి సమాచారం ఇచ్చారు.. దీంతో ఘటన స్థలంకు చేరుకున్న అటవీ శాఖ సిబ్బంది చిరుత పులి మళ్లీ నడక మార్గంలోకి రాకుండా భారీ శబ్దాలు చేస్తూ చిరుతను అటవీ ప్రాంతంలోకి తరిమే ప్రయత్నం చేశారు. చివరకు అర్థరాత్రి మళ్లీ వచ్చిన చిరుత బోనులో చిక్కింది. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.