TTD Ghee Case: ఐదేళ్ల పాటు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి నకిలీ నెయ్యి - సీబీఐ సిట్ దర్యాప్తులో సంచలన విషయాలు
CBI: తిరుమల శ్రీవారి ప్రసాద తయారీకి ఉపయోగించిన నెయ్యి కల్తీదేనని సీబీఐ సిట్ గుర్తించింది. ఐదు ఏళ్ల పాటు ఈ నెయ్యి సరఫరా సాగిందని తేల్చినట్లుగా తెలుస్తోంది.

TTD received adulterated ghee for over five years: తిరుమల తిరుపతి దేవస్థానాలకు (TTD) 5 సంవత్సరాలుగా అక్రమంగా నకిలీ నెయ్యి సరఫరా చేశారని సీబీఐ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) షాకింగ్ వెల్లడి చేసింది. ఉత్తరాఖండ్‌లోని భోల్ బాబా డైరీలోంచి 2019-2024 మధ్య రూ.250 కోట్ల విలువైన 68 లక్ష కేజీల కల్తీ నెయ్యి సరఫరా చేశారని తేల్చింది. ఈ నెయ్యి తయారు చేయడానికి బోలేబాబా డెయిరీ ఒక్క చుక్క కూడా పాలు కొనుగోలు చేయకుండా పూర్తిగా కెమికల్స్‌తో చేసిన కల్తీ నెయ్యిని తయారు చేశారు. ఈ కేసులో A-16 ఆరోపితుడు అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు తర్వాత ఈ వివరాలు వెలుగులోకి వచ్చాయి. ACB కోర్టులో సమర్పించిన రిమాండ్ రిపోర్టులో, భోలే బాబా డైరీ మోనోడిగ్లిసరైడ్స్, యాసిటిక్ యాసిడ్ ఎస్టర్ వంటి కెమికల్స్‌తో నెయ్యి తయారు చేసి, TTD క్వాలిటీ కంట్రోల్ టెస్టులను మానిప్యులేట్ చేసిందని వివరించారు.
సీబీఐ SIT దర్యాప్తులో, భోలే బాబా డైరీ భగవాన్‌పూర్, ఉత్తరాఖండ్ ప్రమోటర్లు ..పాలు లేదా బట్టర్ కొనుగోలు చేయకుండా, షెల్ యూనిట్‌ను ఏర్పాటు చేసి TTDకు మాత్రమే కల్తీ నెయ్యి సరఫరా చేశారని తేల్చారు. ఆ డెయిరీ ఉన్న చోట్ల స్థానిక పశువులు పెంచేవారు "ఎప్పుడూ పాలు సరఫరా చేయలేదు" అని సీబీఐ సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. దీనికి బదులుగా, ఢిల్లీలోని మలేషియా పామ్ ఆయిల్ ఇంపోర్టర్ నుంచి 'హర్ష్ ఫ్రెష్ డైరీ' పేరుతో పామ్ ఆయిల్, కెర్నల్ ఆయిల్ కొనుగోలు చేసి, కెమికల్స్‌తో నెయ్యి తయారు చేశారు. 2022-2024 మధ్య అజయ్ సుగంధ్ నుంచి రూ.7 కోట్ల విలువైన యాసిటిక్ యాసిడ్ ఎస్టర్ కొనుగోలు చేశారు.
2022లో TTD బ్లాక్‌లిస్ట్ చేసినా, భోలే బాబా డైరీ అక్రమ సరఫరాను ఆపలేదు. తిరుపతి వైష్ణవి డైరీ, ఉత్తరప్రదేశ్ మాల్ గంగా డైరీ, తమిళనాడు AR డైరీ ఫుడ్స్ వంటి ఇతర డైరీల ద్వారా బిడ్‌లు రూట్ చేసి నకిలీ నెయ్యి సరఫరా కొనసాగించారు. ఈ డైరీలు భోలే బాబా ప్రమోటర్ల చేతుల్లోనే ఉన్నాయని, బినామీ కంపెనీలుగా ఉపయోగించారని SIT రిపోర్టు స్పష్టం చేసింది. మొత్తం 68 లక్ష కేజీల కల్తీ నెయ్యి విలువ రూ. రూ. 250 కోట్ల విలువ ఉందని, ఇది TTD ప్రసాదాలు, పూజా సామగ్రి తయారీలో విస్తృతంగా ఉపయోగించారని దర్యాప్తులో తేలింది.
ఈ కేసులో A-16 అజయ్ కుమార్ సుగంధ్ అరెస్టు కీలకమైంది. అతను కెమికల్స్ సరఫరాదారు. యాసిటిక్ యాసిడ్ ఎస్టర్‌లను రూ. 7 కోట్ల విలువతో సరఫరా చేశాడు. భోల బాబా డైరీ ప్రమోటర్లు మిల్క్ ప్రొక్యూర్‌మెంట్, పేమెంట్ రికార్డులను ఫేక్‌గా తయారు చేసి సమర్పించారు. డైరీలో డిఫంక్ట్ యూనిట్‌ను కొనుగోలు చేసి, పామ్ ఆయిల్‌తో నెయ్యి తయారు చేశారు. SIT, సీబీఐ పర్యవేక్షణలో ఈ దర్యాప్తు జరుగుతోంది. నాలుగేళ్ల పాటు టీటీడీ చైర్మన్ గా పని చేసిన సుబ్బారెడ్డి పీఏను కూడా అరెస్టు చేశారు. త్వరలో మరిన్ని కీలక అరెస్టులు చోటు చేసుకునే అవకాశం ఉంది.





















