Tirumala News: రీల్స్ చేశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు
Divvala Madhuri: తిరుమల పవిత్రతకు భంగం కలిగించారన్న ఆరోపణలతో దివ్వల మాధురిపై టీటీడీ కేసులు పెట్టింది. తిరుమలలో వ్యక్తిగత విషయాలు మాట్లాడటమే కాకుండా... రీల్స్ చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
Tirumala News: తిరుమలలో రీల్స్ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారని వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ప్రియురాలు దివ్వల మాధురిపై కేసు నమోదు అయింది. ఈ మధ్య తిరుమల వెళ్లిన దివ్వల మాధురి, దువ్వాడ శ్రీనివాస్ తిరుమలలో హడావిడి చేశారు.
ఈనెల 7న వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి తిరుమల శ్రీనివాసుడిని దర్శించుకున్నారు. అనంతరం అక్కడే మాఢవీధుల్లో తిరుగుతూ ఫొటోలకు ఫోజులు ఇచ్చారు. రీల్స్ కూడా చేశారు. ఈ వీడియోలు అప్పుడే చాలా వైరల్‌గా మారాయి. అక్కడే మీడియాతో కూడా మాట్లాడి తమ వ్యక్తిగత వివరాలు వెల్లడించారు.
ఇలా గుడిలో వ్యక్తిగత విషయాలు మాట్లాడటం, గుడి పవిత్ర దెబ్బతినేలా రీల్స్ చేయడంపై భక్తులు టీటీడీ దృష్టికి తీసుకెళ్లారు. దీన్ని పరిశీలించిన అధికారులు గురువారం ఫిర్యాదు చేశారు. టీటీడీ ఏవీఎస్‌వో ఎం.మనోహర్ ఫిర్యాదు మేరకు తిరుమలలోని వన్‌టౌన్ పోలీసులు కేసు నమోదు అయింది. టీటీడీ రూల్స్ అతిక్రమించి, సంస్కృతి సంప్రదాయాలను ఉల్లంఘన కిందికి వస్తుందని అన్నారు. అందుకే కేసు నమోదు అయినట్టు తెలిపారు. తాము రీల్స్ చేయలేదని చెబుతున్నారు దివ్వల మాధురి. తాము తిరుగుతున్నప్పుడు కొందరు ఫొటోలు తీశారని తెలియజేశారు. వాటితో తమకు సంబందం లేదని చెబుతున్నారు.
ఈ మధ్యకాలంలో తీవ్ర చర్చనీయాంశమైన దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి మరోసారి వారం రోజులుగా వార్తల్లో ఉంటున్నారు. తిరుమల శ్రీనివాసుడి దర్శనానికి వెళ్లిన ఈ జంట తాము పెళ్లి చేసుకోబోతున్నామని తెలియజేశారు. ప్రస్తుతానికి సహజీవనం చేస్తున్నామని అన్నారు. త్వరలోనే పెళ్లి విషయంపై క్లారిటీ వస్తుందని అన్నారు.
దివ్వల మాధురి మాయపడిన దువ్వాడ శ్రీనివాస్ తమకు అన్యాయం చేస్తున్నారని ఆయన భార్య దువ్వాడ వాణి కొంత కాలంగా టెక్కలిలో దీక్ష చేశారు. తర్వాత మధ్యవర్తుల జోక్యంతో ఆమె తన నిరసన విరమించుకున్నారు. కొన్ని ఆస్తుల విషయంలో ఇద్దరి మధ్య రాజీ కుదిరిందని అంటున్నారు. అయితే విడాకులపై ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ఇలా పెళ్లి ప్రకటన చేయడంపై టెక్కలి ప్రజలు ఆశ్చర్యపోతున్నారు.
ఒకే ఇంట్లో ఉంటున్న దువ్వాడ శ్రీనివాస్, దివ్వల మాధురి... ఫుడ్ వీడియోలు చేస్తూ వైరల్ అయ్యారు. ఆ తర్వాత రెండు రోజులకే తిరుమలలో ఇలా దర్శనం ఇచ్చి మరోసారి వివాదాల్లో చిక్కుకున్నారు.
వివాదాలు సద్దుమణిగిన తర్వాత ఈ జంట బహిరంగంగానే తిరగడం ప్రారంభించారు. తన భార్య మొదటి నుంచి తను మోసం చేస్తోంది... ఆమెకు ఆస్తులపై, రాజకీయాలపై ఉన్న మక్కువ తనపై లేదని దువ్వాడ ఆరోపిస్తున్నారు. ఎప్పుడో విడాకులు తీసుకోవాల్సిందని కానీ పెద్దల జోక్యంతో ఇన్ని రోజులు కలిసి ఉన్నామని అన్నారు. బయట సమాజానికి కలిసి ఉన్నట్టు నాటకమాడుతున్నామని తెలిపారు. ఇంతలో దివ్వల మాధురిని రోడ్డుపైకి లాగి ఆమె కుటుంబంలో కూడా చిచ్చు పెట్టిందని ఆరోపించారు. ఇంత జరిగిన తర్వాత వాళ్లిద్దరు సఖ్యతగా ఉండలేరని... ఉన్నా సమాజం రకరకాలుగా సూటిపోటి మాటలతో హింసిస్తుందని అందుకే పెళ్లి చేసుకోవాలని నిర్ణయానికి వచ్చినట్టు తెలియజేశారు.
Also Read: క్యాడర్‌లో కదలిక కోసం జగన్ ప్రయత్నాలు - గుడ్ బుక్ తాయిలం వర్కవుట్ అవుతుందా ?