Roja On Chandra Babu: నాడు నేడు ఎన్టీఆర్ పేరు చెబితేనే వణుకు- చంద్రబాబుపై మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్
వైఎస్‌ఆర్‌సీపీని, మంత్రులను తిట్టించడానికే మహానాడు పెట్టుకున్నారని మండిపడ్డారు మంత్రి రోజా. ఎన్ని ప్రయత్నాలు చేసినా చంద్రబాబును ప్రజలు నమ్మే పరిస్థితి లేదని విమర్శించారు.
తిరుమల: ఎప్పుడూ సీనియర్ ఎన్టీఆర్‌ని చూసి భయపడిన చంద్రబాబు, నేడు జూనియర్ ఎన్టీఆర్‌ని చూసి భయపడుతున్నారని ఏపి పర్యాటక శాఖా మంత్రి ఆర్.కే.రోజా(Roja) విమర్శించారు. నగిరి నియోజకవర్గంలోని వడమాలపేట నాయకులతో కలిసి తిరుమలేశుడిని సందర్శించుకున్న రోజా... వి.ఐ.పి విరామ సమయంలో పాల్గోని మొక్కులు చెల్లించుకున్నారు.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, జగన్ లాంటి మంచి సీఎంను ఎన్నడూ చూడలేదని ప్రజలు చెప్తున్నారని రోజా అన్నారు. ప్రజాధారణ చూసి టీడీపీ అవాకులు-చవాకులు పేలుతున్నారని, మహానాడు నాడు అని పెట్టి మహిళలతో నీచాతినీచంగా తిట్టిస్తున్నారని ఆమె మండిపడ్డారు. రాష్ట్రానికి, తెలుగుదేశం పార్టీకి పట్టిన శని చంద్రబాబే అని ఎన్టీఆర్ ఆనాడే అన్నారని ఆమె విమర్శించారు. మామ ప్రాణాలు తీసిన చేత్తోనే దండం పెడుతున్న చంద్రబాబు ఎంత ఘనుడో ప్రజలకే తెలుసు అని, 14 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో ప్రజలకు చంద్రబాబు ఏమి చేయలేదని విమర్శించారు.
సీఎం జగన్, మంత్రులైన తమను తిట్టడానికే మహానాడు పెట్టుకున్నారని, ప్రజలకు నమ్మకం తెప్పించి, వారికి మంచి పనులు చేస్తామన్న హామీ మహానాడులో చంద్రబాబు ఇవ్వలేదన్నారు రోజా. ఎన్టీఆర్ చనిపోయిన ఆయన విగ్రహాలు ఎక్కడ పెట్టలేదని, ఎన్టీఆర్ పేరు ఒక జిల్లాకు పెడితే సీఎం జగన్‌కు ధన్యవాదాలు తెలుపుతూ ఒక తీర్మానం చేయకపోవడం శోచనీయని దుయ్యబట్టారు.
చంద్రబాబుకు ఎన్టీఆర్ పేరు అంటే నచ్చదని, ఆ పేరు అంటేనే భయమని, జూనియర్ ఎన్టీఆర్‌ను చూసిన భయపడి అతనిని పార్టీ నుంచి బయటకు పంపిన ఘటనలు చూసామని విమర్శించారు రోజా. చంద్రబాబు రాష్ట్రాన్ని రావణ కాష్టంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారని, తన పుత్రుడు ముద్దపప్పు ఎందుకు పనికి రాడని, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్‌ను పక్కన పెట్టుకున్నారన్నారు. అంబేద్కర్ పేరు పెట్టాలని వాళ్లే అడుగుతారు... పేరు పెడితే.. మళ్ళీ టీడీపీ, జనసేన నాయకులే విధ్వంసం చేస్తున్నారని ఆమె ఆరోపించారు. దళిత మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లను కాల్చి వేశారని, పోలీసులు దెబ్బలు తిన్న కూడా ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పారని అభిప్రాయపడ్డారు. ఈ కుట్ర వెనుకాల ఎవరు ఉన్నా కచ్చితంగా ఎవరిని వదిలి పెట్టేదే లేదన్నారు రోజా.
14 ఏళ్లలో చంద్రబాబు చేయలేనిది, సీఎం జగన్ చేసి చూపించారని ఆమె కొనియాడారు..ఎన్ని అబద్దాలు చెప్పినా, మహిళలతో తిట్టించినా ప్రజలు టిడిపీని నమ్మే పరిస్థితిలో లేరని ఆర్.కే.రోజా అన్నారు. మంచి పనులు చేస్తున్న జగన్‌ను ప్రజలు వదులుకోరని అభిప్రాయపడ్డారు రోజా.