Cheetah In Tirumala: తిరుమలలో మరోసారి చిరుతపులుల కలకలం, మెట్ల మార్గంలో సంచారంతో టెన్షన్ టెన్షన్!
Tirumala Cheetah News: తిరుమలలో మరోసారి చిరుతపులుల సంచారం కలకలం రేపుతోంది. అలిపిరి మెట్ల మార్గంలో రెండు చిరుతలు కనిపించడంతో భక్తులు గట్టిగా కేకలు వేశారు. టీటీడీ సిబ్బంది సైతం అప్రమత్తమైంది.
Cheetah in tirumala | తిరుమల: శ్రీవారిని దర్శించుకునేందుకు వెళ్తున్న భక్తులకు చిరుతపలి కనిపించడం కలకలం రేపుతోంది. తిరుమలలో మరోసారి చిరుతలు సంచరిస్తున్నట్లు గుర్తించారు. అలిపిరి నడకదారిలో సోమవారం నాడు (మే 20న) మెట్ల వద్ద రెండు చిరుతలు సంచరిస్తున్నాయి. భక్తులు గట్టిగా కేకలు వేయడంతో చిరుతలు అడవిలోకి పారిపోయినట్లు సమాచారం. భక్తుల నుంచి సమచారం అందుకున్న టీటీడీ విజిలెన్స్ సిబ్బంది అక్కడికి చేరుకుని పరిశీలిస్తున్నారు. అటవీశాఖ సిబ్బంది చిరుతల జాడను గుర్తించేందుకు రంగంలోకి దిగింది. చిరుత సంచారం విషయం తెలియగానే భక్తులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నారు. టీటీడీ సిబ్బంది సైతం నడక దారి భక్తులను దర్శనానినికి గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు.
మే 15న సైతం చిరుత సంచారం తిరుమలలో కలకలం రేపింది. తిరుపతి నుంచి తిరుమలకు వెళ్లే ఘాట్ రోడ్డులో భక్తుల కారుకు చిరుత అడ్డుగా వచ్చింది. సీసీ కెమెరాలో ఈ దృశ్యాలు రికార్డయ్యాయి. దాంతో టీటీడీ సిబ్బంది అలర్ట్ అయ్యారు. భక్తులు జాగ్రత్తగా ఉండాలని, గుంపులుగా వెళ్లాలని సూచించారు.