Minister Naraya Swamy: సొంతపార్టీపై మంత్రి ఘాటు విమర్శలు.. ఈసారి రెడ్లను టార్గెట్ చేసిన నారాయణ స్వామి
మంత్రి నారాయణ స్వామి మరోసారి సంచలన కామెంట్స్ చేశారు. తరచూ ఆయన చేస్తున్న కామెంట్స్ కాకరేపుతుంటాయి. ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి.
రెండోసారి మంత్రి పదవి సాధించుకున్న నారాయణ స్వామి మరోసారి నోరు జారారు. నారాయణ స్వామి తరచూ మాటలు తడబడుతూ వార్తల్లో నిలుస్తున్నారు. ప్రతిపక్షాలను విమర్శించబోయి సొంత పార్టి నేతలనే ఊహించని స్ధాయిలో మాట్లాడారు.
గంగాధర నెల్లూరులోని రెండు రెడ్డి వర్గాలు దళితులపై అజమాయిషి చూపేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయని సీఎం సామజిక వర్గంపై విమర్శలు చేశారు డెప్యూటీ సీఎం నారాయణ స్వామి. గ్రామాల్లో వైసీపీలోని రెడ్లు రెండు వర్గాలుగా ఏర్పడినప్పుడి.. తమ అజమాయిషీ చూపించుకోవడానికి దళితవాడలపై పడుతున్నారని నోరు జారారు ఉపముఖ్యమంత్రి కె.నారాయణస్వామి.
గురువారం చిత్తూరు జిల్లా గంగాధరనెల్లూరు ఎంపీడీవో కార్యాలయం ఆవరణలో డ్వాక్రా మహిళలకు చెక్కులు పంపిణీ చేసి వాలంటీర్లకు సన్మానం చేశారు మంత్రి నారాయణ స్వామి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘రెడ్లు పంతానికి పోతే ఎంతైనా చేస్తారు. దాని వల్ల మధ్యలో దళితులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెడ్లు వర్గపోరుకు స్వస్తి పలకాలి’ అని అభిప్రాయపడ్డారు.
ఇలా పదే పదే మాటలు తడబడుతూ సొంత పార్టీ నాయకులనే ఇరుకున పెట్టడం పరిపాటిగా మరిపోయిందాయనకు. గతంలో ఓసారి తిరుమలకు వచ్చిన మంత్రి నారాయణ స్వామి పవన్ కళ్యాణ్, చంద్రబాబుపై ఘాటుగా విమర్శలు చేయాలని అనుకుని, ఏకంగా తక పార్టీ అధినేత వైఎస్.జగన్మోహన్ రెడ్డిపైనే విమర్శలు చేశారు.
ఎవరిపై విమర్శలు చేస్తున్నామో అని కూడా తెలియకుండా ఏదో ఫ్లోలో ఫాలో అయిపోతున్న నారాయణ స్వామిని నిలువరించేందుకు పక్కనే ఉన్న వ్యక్తి విఫలయత్నం చేశారు. అయినా మంత్రి ఆగలేదు. తిరుమలకు వచ్చిన ప్రతిసారి కొండపై రాజకీయాలు మాట్లాడబోను అంటూనే ప్రతిపక్షాలపై రాజకీయ వ్యాఖ్యలు, వివాదాస్పద వ్యాఖ్యలు నారాయణ స్వామి చేస్తూనే ఉంటారు..
అదే క్రమంలో సొంత పార్టీ నేతలను పొగిడేస్తూ ప్రతిపక్షాలను తిట్టాలనుకున్నప్పుడల్లా తన పార్టీ నేతలపైనే ఠక్కున తిట్ల దండకం అందుకుంటారు. ఇలాంటి సంఘటనలు గతంలో కూడా చేసి అభాసుపాలయ్యారాయన. తానేం మాట్లాడుతున్నారో కూడా తెలియకుండా మాట్లాడేస్తుంటారు.
ఈసారి నారాయణ స్వామి చేసిన కామెంట్స్ తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఇలాంటి కామెంట్స్ పార్టీకి నష్టమని చెబుతున్నారు పార్టీ నేతలు. ఆయన తెలిసి చేసినా తెలియ చేసినా సమస్యలు మాత్రం వస్తున్నాయని.. గతంలో కూడా ఇలాంటి కామెంట్స్ నాలుక కొరుక్కున్నారని అంటున్నారు.
మొన్నటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఇలాంటి కామెంట్స్ చేశారు. ఓ నేతను ఉద్దేశించి చేసిన విమర్శ తీవ్ర దుమారం రేపింది. ప్రతిపక్షం టీడీపీ తీవ్ర ఆక్షేపణ చేసింది.