Rains Breaking News Live: రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
వాయుగుండం పుదుచ్చేరి - చెన్నై మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది.
LIVE
Background
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో దక్షిణ రాయలసీమ వరదల్లో మునుగుతున్న సంగతి తెలిసిందే. ఈ వాయుగుండం తాజాగా పుదుచ్చేరి - చెన్నై మధ్య తీరం దాటింది. ఈ ప్రభావంతో ఉత్తర తమిళనాడు, చిత్తూరు, కడప జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ కేంద్రం ప్రకటించింది. నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
మరోవైపు, తీర ప్రాంత ప్రజలు, మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వాయుగుండం ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమల్లో చాలాచోట్ల తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు, ఒకటి రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, ఉత్తర కోస్తాలో ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వానలు పడతాయని అధికారులు అంచనా వేశారు.
వాయుగుండం ఈ ఉదయం 3 గంటల నుంచి 4 గంటల మధ్య పుదుచ్చేరి, చెన్నై మధ్య తీరం దాటిందని భారత వాతావరణ విభాగం ప్రకటించింది. అయితే మరో 24 గంటలపాటు దక్షిణ కోస్తాలో వర్షాలు కురిసే అవకాశముందని హెచ్చరించింది.
నెల్లూరు, చిత్తూరు, కడపపై ప్రతాపం..
వారం రోజుల క్రితం తొలి వాయుగుండం చిత్తూరు, నెల్లూరు జిల్లాలపై ప్రతాపం చూపించగా.. రెండో వాయుగుండం ప్రభావంతో కడప జిల్లాలో కూడా భారీ వర్షాలు పడ్డాయి. చిత్తూరు జిల్లాలో జలవిలయం సృష్టించింది. ఇక నెల్లూరులో ఇప్పటికే చెరువులు నిండిపోయి ఉండటంతో.. కలుజులు దాటి పారి.. రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
పాఠశాలలకు సెలవు..
మరోవైపు వాయుగుండం ప్రభావంతో ఈరోజు నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం అధికారికంగా సెలవు ప్రకటించింది. ఇప్పటికే ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
మరో 24గంటలసేపు వర్షాలు..
వాయుగుండం తీరం దాటినా.. దాని ప్రభావంతో అనంతపురం జిల్లాలో ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశముంది. ప్రస్తుతం తీరం దాటిన వాయుగుండం అనంతపురం, బెంగళూరు ఉపరితలాలపై కేంద్రీకృతం అయి ఉంది. దీని ప్రభావంతో 24గంటల్లోగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు అధికారులు.
Also Read: Google Pay Voice Feature: వాయిస్‌తో డబ్బులు ట్రాన్స్‌ఫర్.. ఇక డిజిటల్ చెల్లింపులు మరింత ఈజీ!
Also Read: Corona Cases:- స్వల్పంగా పెరిగిన కరోనా కేసులు.. కొత్తగా 11,919 మందికి వైరస్
Also Read: మోహన్ బాబు ఇంట్లో విషాదం.. పునీత్ భార్య ఎమోషనల్ పోస్ట్..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
రేపు వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ ఏరియల్ సర్వే
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ శనివారం ఏరియల్ సర్వే నిర్వహించనున్నారు. కడప, చిత్తూరు, నెల్లూరు సహా వర్ష ప్రభావిత ప్రాంతాలను ఆయన ఏరియల్ సర్వేలో పరిశీలిస్తారు. గన్నవరం విమానాశ్రయం నుంచి నేరుగా కడప చేరుకుని అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా వరద ప్రభావిత ప్రాంతాల్లో పరిశీలిస్తారు.
రాజంపేట వరదల్లో 12 మంది మృతి.. గల్లంతైన వారి కోసం గాలింపు
కడప జిల్లా రాజంపేట బస్సులు వరదలో చిక్కుకున్న ఘటనలో 12 మంది చనిపోయారు. 12 మంది మృతదేహాలు వెలికి తీసినట్లు సహాయ సిబ్బంది పేర్కొన్నారు. గండ్లూరులో 7, రాయవరంలో 3, మందపల్లిలో 2 మృతదేహాలు లభ్యమయ్యాయి. శుక్రవారం ఉదయం నందలూరు వద్ద మూడు ఆర్టీసీ బస్సులు వరదలో చిక్కుకున్నాయి. బస్సుల్లో చిక్కుకున్న పలువురిని అగ్నిమాపక సిబ్బంది రక్షించారు.
సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్.. వరదలపై ఆరా
ఏపీ సీఎం జగన్ కు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలోని వరద పరిస్థితులపై ఆరా తీశారు. సహాయక చర్యలను ప్రధాని అడిగి తెలుసుకున్నారు. పూర్తి సహకారమందిస్తామని సీఎం జగన్ కు ప్రధాని మోదీ హామీ ఇచ్చారు.
ప్రమాదం అంచున నెల్లూరు.. ఇళ్లలోకి చేరిన నీరు
నెల్లూరు నగరంలో లోతట్టు ప్రాంతాల్లోకి వరదనీరు వచ్చి చేరింది. సోమశిల ప్రాజెక్ట్ నుంచి 5 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల చేయడంతో పెన్నాకు వరద పోటెత్తింది. పెన్నా పరివాహక ప్రదేశాల్లోని లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. నెల్లూరు నగరంలోని పొర్లుకట్ట, సంతపేట ప్రాంతంలో ఇళ్లలోకి నీరు చేరుకుంది. ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ప్రతి సారీ వరదలు వచ్చినప్పుడు వనాయకులు వచ్చి ఎంతోకొంత నష్టపరిహారం చేతిలో పెట్టి వెళ్లిపోతారని, శాశ్వత పరిష్కారం చూపడంలేదని వాపోతున్నారు స్థానికులు. ఏబీపీ దేశంతో తమ కష్టాలు చెప్పుకున్నారు అక్కడి ప్రజలు.
రాజంపేట నియోజకవర్గంలో 50 మంది మృతి..! : ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్
తుపాన్ ప్రభావంతో సమస్యల్లో ఉన్న రాజంపేట నియోజకవర్గంలోని ప్రజలకు అండగా ఉంటానని కడప జిల్లా రాజంపేట ఎమ్మెల్యే మేడ మల్లికార్జున్ రెడ్డి అన్నారు. రాజంపేట మండలం గుండ్లురు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో చాలా మంది మృత్యువాత పడ్డారన్నారు. పుల్లూరు మందపల్లి జలదిగ్బంధంలో ఉన్నాయన్నారు. వరద కష్టాలపై సీఎం దృష్టికి తీసుకెళ్తామన్నారు. ప్రజలకు సహాయం చేయడానికి హెలికాప్టర్ తీసుకొచ్చామన్నారు. మందపల్లి, పులపుత్తూరు గ్రామాలలో దాదాపు 50 మంది మృతి చెందినట్లు తెలుస్తోందన్నారు. ఐదువేల ఆహారపదార్థాలు సిద్ధం చేశామని వరద బాధితులకు అందిస్తా్మన్నారు.