CM Jagan Tour: మే 5న తిరుపతి జిల్లాలో సీఎం జగన్ పర్యటన- ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి రోజా
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఐదున తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. చిన్నారులకు సంబంధించిన ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. ప్రజలను ఉద్దేశించి బహిరంగ సభలో పాల్గోనున్నారు.
జిల్లాల పునర్విభజన తర్వాత తొలిసారిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుపతి జిల్లాలో పర్యటించనున్నారు. ఐదో తేదీన చేపట్టే ఈ టూర్‌లో టీటీడీ ఆధ్వర్యంలో నిర్మించనున్న చిన్న పిల్లల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి శంకుస్థాపన చేస్తారు. తర్వాత ఇప్పటికే పూర్తైన మరికొన్ని కట్టడాలను సీఎం ప్రారంభించనున్నారు.
చిన్నారులకు ఆధునిక వైద్యం అందించాలన్న ఉద్దేశంతో టీటీడీ చిల్డ్రన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని తలపెట్టింది. దీన్ని 240 కోట్ల రూపాయలతో నిర్మించనుంది. దీనికి ఐదో తేదీని సీఎం జగన్ శంకుస్థాపన చేస్తారు. అనంతరం టాటా ట్రస్టు నిర్మించిన శ్రీవెంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ క్యాన్సర్ అండ్ రీసెర్చి ఆసుపత్రి, బర్డ్‌లలో స్మైల్ ట్రైన్ వార్డు, శ్రీనివాస సేతును సీఎం ప్రారంభిస్తారు. శ్రీనివాస సేతు తొలి విడత పూర్తైంది. దీన్నే ప్రారంభించనున్నారాయన.
తిరుపతి జిల్లాకు తొలిసారిగా వస్తున్న సీఎంకు ఘనస్వాగతం పలికేందుకు జిల్లా నేతలు రెడీ అవుతున్నారు. పర్యటన, సభకు సంబంధించిన ఏర్పాట్లను పర్యాటక మంత్రి ఆర్కే రోజా పరిశీలించారు. తిరుపతిలోని తారకరామ స్టేడియంలో సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించి కొన్ని సూచనలు చేశారు.
గత ప్రభుత్వం హాయాంలో ఫీజ్ రీయింబర్స్‌మెంట్ చెల్లించకుండా నిర్లక్ష్యం చేశారని, సీఎం జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత విద్య, వైద్యం ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారని రోజా మీడియాకు వివరించారు. రూ. 1800 కోట్లు ఫీజ్ రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెట్టి చంద్రబాబు వెళ్ళిపోయారని, సీఎం జగన్ చెల్లించమే కాకుండా, ప్రతి మూడు నెలలకు ఒకసారి ఠంచన్‌గా రియింబర్స్ చేస్తున్నారని కొనియాడారు. గతంలో నారకాసుర ఆంధ్రప్రదేశ్‌గా అనిపించింది కాబట్టే చంద్రబాబును దించేసిన ప్రజలు జగన్మోహన్ రెడ్డినీ అధికారం కట్టబెట్టారని వివరించారు. మహిళలపై దాడులు నేషనల్ క్రైమ్ రికార్డ్స్‌లో మూడు శాతం తగ్గిందన్నారు. కొంత మంది ఉన్మాదుల వల్ల జరిగే ఘటనలకు కఠిన శిక్ష విధిస్తున్నారని చెప్పారు. మహిళా రక్షణ పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి కనిపిస్తోందని గుర్తు చేశారు.
బాదుడే బాదుడు అంటున్న చంద్రబాబు ఆనాడు వ్యాట్, విద్యుత్ ఛార్జీలు పెంచలేదా అని రోజా ప్రశ్నించారు. ఆర్టీసిని ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు చూస్తే సీఎం జగన్మోహన్ రెడ్డి ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేశారన్నారు. కరోనా కష్ట కాలంలో సంక్షేమ పథకాలను వైసీపి ప్రభుత్వం అందించిందన్నారు మంత్రి ఆర్.కే.రోజా