Tirumala Plastic Ban : శ్రీవారి భక్తులకు అలెర్ట్, జూన్ 1 నుంచి తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం
Tirumala Plastic Ban : శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక ప్రకటన చేసింది. జూన్ 1 నుంచి తిరుమల కొండపై ప్లాస్టిక్ సంపూర్ణ నిషేధం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది.
Tirumala Plastic Ban : శ్రీవారి భక్తులకు టీటీడీ కీలక సూచన చేసింది. జూన్ 1 నుంచి తిరుమలలో ప్లాస్టిక్ నిషేధం అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు తిరుమల వెళ్లే భక్తులకు టీటీడీ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జూన్ 1 నుంచి తిరుమల కొండపైకి ఎలాంటి ప్లాస్టిక్ వస్తువులను అనుమతించమని స్పష్టం చేసింది. తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తున్నట్లు టీటీడీ పేర్కొంది. ఈ నిషేధం రేపటి(జూన్ 1)నుంచి అమల్లోకి రానున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని భక్తులు, దుకాణదారులు గమినించి సహకరించాలని టీటీడీ కోరింది. తిరుమల కొండపై ప్లాస్టిక్‌ను పూర్తిగా నిషేధిస్తూ, అమలుకు నిఘాను మరింత పటిష్టం చేయనున్నట్లు తెలిపింది. అలిపిరి టోల్ గేట్ వద్దే ప్లాస్టిక్‌ను గుర్తించేలా సెన్సార్‌లు, విస్తృతంగా తనిఖీలు చేపడతామని టీటీడీ ప్రకటనలో వెల్లడించింది. తిరుమల కొండ మీద వ్యాపారం చేస్తున్న వారు కూడా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయాలను చూసుకోవాలని సూచించింది. షాపులు, హోటళ్ల నిర్వాహకులు ప్లాస్టిక్ కవర్స్ వాడితే సీజ్ చేస్తామని టీటీడీ తెలిపింది. తిరుమలలో షాంపుల వాడకంపై కూడా టీటీడీ నిషేధం విధించింది. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపింది. ఎవరైన ప్లాస్టిక్ వస్తువులు వినియోగించినట్లు తెలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ తెలిపింది.
ప్రధాన దేవాలయాల్లో నిషేధం
తిరుమల తరహాలోనే రాష్ట్రంలోని దేవాలయాల్లో ప్లాస్టిక్ వస్తువులను నిషేధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్లాస్టిక్ వాటర్ బాటిళ్లతో పాటు ప్లాస్టిక్ కవర్లలో పూజా సామాగ్రిని ఆలయాల్లోకి అనుమతించమని పేర్కొంది. ఆలయానికి అనుబంధంగా ఉండే షాపుల్లో ప్లాస్టిక్ కవర్లు, ప్లాస్టిక్ వాటర్ బాటిళ్ల అమ్మకాలు నిషేధిస్తామని తెలిపింది. ఆలయాల్లో ప్రసాదాల పంపిణీలోనూ చిన్నచిన్న ప్లాస్టిక్ కవర్లు వినియోగాన్ని నిషేధించాలని అధికారుల నిర్ణయించారు. ముందుగా జూలై 1 నుంచి 6 (ఏ) కేటగిరీగా ప్రకారం ప్రధాన ఆలయాలన్నింటిలో ప్లాస్టిక్ ను నిషేధిస్తారు. ఆయా ఆలయాలు, మఠాలు, సత్రాలలో ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించనున్నారు.
జులై 1 నుంచి నిషేధం
సంవత్సరానికి రూ.25 లక్షలు, ఆ పైన ఆదాయం ఉండే దేవాలయాలను దేవదాయ శాఖ 6(ఏ) కేటగిరీ కింద వర్గీకరించింది. దేవదాయ శాఖ పరిధిలో రాష్ట్రంలో మొత్తం 24,699 ఆలయాలు, మఠాలు, సత్రాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 174 ఆలయాలు, 28 సత్రాలు, మఠాలు 6 (ఏ) కేటగిరీ కిందకు రానున్నాయి. వీటిల్లో జులై 1 నుంచి ప్లాస్టిక్ వస్తువులను పూర్తిగా నిషేధించేందుకు దేవదాయ శాఖ అధికారులు తగిన చర్యలు చేపడుతున్నారు. దేవదాయ శాఖ ఇప్పటికే ఆయా ఆలయాలు, సత్రాల ఈవోలకు ఆదేశాలు జారీ చేసింది.