(Source: ECI/ABP News/ABP Majha)
Minister Mallareddy : పోలవరం పూర్తి చేసే సత్తా కేసీఆర్ కు మాత్రమే ఉంది, ఏపీలో 170 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ- మంత్రి మల్లారెడ్డి
Minister Mallareddy : ఏపీలో 170 స్థానాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తెలిపారు. త్వరలో వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారన్నారు.
Minister Mallareddy : దేశంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం మొదలైందని తెలంగాణ మంత్రి మల్లారెడ్డి అన్నారు. కేంద్రం నిధులు మంజూరు చేసినా చేయకపోయినా పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసే దమ్ము, ధైర్యం కేవలం ఒక్క కేసీఆర్ కే ఉందని మంత్రి మల్లారెడ్డి అన్నారు. ఆంధ్రాలో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకున్న ఆయన, అలిపిరి కాలినడక మార్గం గుండా తిరుమలకు చేరుకున్నారు. సోమవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా మల్లారెడ్డి కుటుంబ సమేతంగా స్వామి వారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకోనున్నారు. అలిపిరి నడక మార్గం గుండా తిరుమలకు చేరుకున్న మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. దేశంలో ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభంజనం మొదలైందని చెప్పారు. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజలంతా ఆలోచనలో పడ్డారన్నారు. సీఎం కేసీఆర్ కొద్ది మందితో టీఆర్ఎస్ పార్టీ పెట్టి ఇరవై సంవత్సరాల్లో చరిత్ర సృష్టించారని తెలిపారు. టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన కేసీఆర్ 2024 ఎన్నికల్లో దేశ వ్యాప్తంగా పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్లు తెలియజేశారు.
త్వరలో బహిరంగ సభలు
రాజకీయ నాయకులు, విశ్లేషకులు ఆలోచనలో పడ్డారని మంత్రి మల్లారెడ్డి అన్నారు. తెలంగాణ రాష్ట్రం అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలు దేశంలో కూడా అమలు చేయాలనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ బీఆర్ఎస్ గా మార్చారని చెప్పారు. ఇక బీఆర్ఎస్ పార్టీకి ఆంధ్ర, కర్ణాటక, మహారాష్ట్రల్లో మంచి ఆదరణ వస్తోందని, త్వరలో వివిధ రాష్ట్రాల్లో బహిరంగ సభలు పెట్టేందుకు కేసీఆర్ సిద్ధం అవుతున్నారన్నారు. ఏపీ, తెలంగాణ రెండూ ఒకేసారి విడిపోయాయని, ఏపీని కూడా తెలంగాణ లాగా అభివృద్ధి చేయాలని ప్రజలు కోరుకుంటున్నారని, ఏపీకి చెందిన ముప్పై శాతం ప్రజలు హైదరాబాద్ లోనే ఉన్నారన్నారు. తెలంగాణలో ఉండే ఏపీ ప్రజలు అంతా తెలంగాణ అభివృద్ధిని చూస్తూనే ఉన్నారన్నారు.
ఏపీలో 170 స్థానాల్లో పోటీ
ఇప్పటి వరకూ పోలవరం ప్రాజెక్టు పూర్తి కాలేదని, కేంద్రం పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తానని హామీ ఇచ్చి తొమ్మిది ఏళ్లు గడుస్తుందని మంత్రి మల్లారెడ్డి విమర్శించారు. విభజనలో రకరకాల హామీలు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం, స్పెషల్ స్టేటస్ మాటను మరిచిపోయిందని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీ ఏపీలో వస్తే, విభజనలో ఇచ్చిన హామీలు కేసీఆర్ రాకతోనే పూర్తి అవుతుందన్నారు. కేవలం మూడేళ్ల కాలంలో కాళేశ్వరం ప్రాజెక్టును పూర్తి చేశారని, కేంద్రం నిధులు ఇచ్చినా, ఇవ్వక పోయినా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసే దమ్ము, ధైర్యం కేవలం కేసీఆర్ కే ఉందన్నారు. రాబోవు ఎన్నికల్లో ఏపీలో 170 సీట్లలో అభ్యర్థులను నిలబెడుతామన్నారు. ప్రజల ఆదరణ వస్తుందని భావిస్తున్నామని, ఆంధ్రలో బీఆర్ఎస్ పార్టీ రావాలని కోరుకున్నా అందుకే కాలినడకన తిరుమలకు వచ్చి మొక్కులు చెల్లించుకున్నట్లు తెలంగాణ మంత్రి మల్లారెడ్డి తెలియజేశారు.
బీఆర్ఎస్ లోకి ఏపీ నేతలు
బీఆర్ఎస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా మాజీ ఐఏఎస్ తోట చంద్రశేఖర్ ను నియమించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. జనవరి 2న మధ్యాహ్నం 12 నుంచి 4 గంటల మధ్యలో తెలంగాణ భవన్ లో ఏపీ నుంచి నేతలు, మాజీ అధికారులు బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. సీఎం కేసీఆర్ సమక్షంలో తోట చంద్రశేఖర్ బీఆర్ఎస్ పార్టీలో చేరునుండగా.. కండువా కప్పి బీఆర్ఎస్ లోకి ఆహ్వానం పలకనున్నారు. 2019లో గుంటూరు పశ్చిమ నుంచి జనసేన అభ్యర్థిగా పోటీ చేసిన చంద్రశేఖర్ ఓటమిచెందారు. జనసేన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న చంద్రశేఖర్, తెలంగాణ సీఎం కేసీఆర్ పాలనను గమనించి బీఆర్ఎస్ లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్లు సమాచారం.