Tirumala Temple: ముగిసిన గ్రహణం - శుద్ధి అనంతరం తెరుచుకున్న శ్రీవారి ఆలయం
Tirumala Temple: పాక్షిక చంద్రగ్రహణం అనంతరం తిరుమల శ్రీవారి ఆలయం సహా, రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల తలుపులు తెరుచుకోనున్నాయి. ఆలయ శుద్ధి అనంతరం ప్రత్యేక పూజలు చేసి భక్తులను దర్శనాలకు అనుమతిస్తున్నారు.
Tirumala Temple: కలియుగ వైకుంఠం తిరుమల శ్రీవారి ఆలయ తలుపులు తెరుచుకున్నాయి. పాక్షిక చంద్రగ్రహణం కారణంగా శనివారం రాత్రి 7:05 గంటలకు ఆలయాన్ని మూసేయగా, ఆదివారం తెల్లవారుజామున 3:15 గంటలకు అర్చకు లు, అధికారులు స్వామి వారి ఆలయ తలుపులు తెరిచారు. ఆదివారం తెల్లవారుజామున 01:05 గంటల నుంచి 2:22 గంటల మధ్య పాక్షిక చంద్రగ్రహణం పూర్తైంది. గ్రహణ కాలంలో కిరణాలు సోకడం కారణంగా చెడు ఫలితాలు ఉంటాయని ఆలయాలు మూసేస్తారు. అనంతరం, దేవదేవుని ఆలయాన్ని తెరిచి పుణ్యాహవచనం చేసి ఆలయ శుద్ధి నిర్వహించారు. అనంతరం సుప్రభాతం, అర్చన, తోమాల సేవలు చేశారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శన భాగ్యం కల్పించారు. ప్రస్తుతం 15 కంపార్ట్ మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. శనివారం 47 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా, హుండీ ద్వారా రూ.3.03 కోట్ల ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు.
అనుబంధ ఆలయాలు కూడా
ఇక, పాక్షిక చంద్రగ్రహణం కారణంగా మూతపడ్డ టీటీడీ అనుబంధ ఆలయాలు సైతం తెరుచుకున్నాయి. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాన్ని ఆదివారం తెల్లవారుజామున 4:30 గంటలకు తెరిచి శుద్ధి అనంతరం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిచ్చారు. అలాగే గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండ రామ స్వామి వారి ఆలయం, శ్రీనివాస మంగాపురంలోని శ్రీ కల్యాణ వెంకటేశ్వర స్వామి వారి ఆలయం, తిరుపతిలోని కపిలేశ్వర స్వామి ఆలయాల్లో సైతం శుద్ధి అనంతరం భక్తులను అనుమతిచ్చారు.
అలాగే, బెజవాడ దుర్గమ్మ ఆలయాన్ని ఆదివారం ఉదయం తెరిచి, శుద్ధి అనంతరం ఉదయం 9 గంటల నుంచి భక్తులకు అమ్మవారి దర్శన భాగ్యం కల్పించారు. శ్రీశైలం ఆలయం సహా రాష్ట్రంలోని ఇతర ప్రముఖ ఆలయాలన్నింటిన శుద్ధి అనంతరం తెరిచారు.
శ్రీవారి క్యాలెండర్లు వచ్చేశాయ్
ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా తిరుమల శ్రీవారి డైరీలు, క్యాలెండర్లను టీటీడీ భక్తులకు అందుబాటులో ఉంచింది. టీటీడీ ముద్రించిన 2024వ సంవత్సరం డైరీలు, క్యాలెండర్లు తిరుమల, తిరుపతిలోని అన్ని టీటీడీ పుస్తక విక్రయశాలల్లో భక్తులకు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ttdevasthanams.ap.gov.in వెబ్‌సైట్ ద్వారా 12 పేజీల క్యాలెండర్లు, డైరీలు, టేబుల్ టాప్ క్యాలెండర్లను భక్తులు కొనుగోలు చేసేందుకు అవకాశం కల్పించింది.
ధరలు ఇలా
- 12 పేజీల క్యాలెండర్ ధర రూ.130
-
డీలక్స్ డైరీ ధర రూ.150, చిన్న డైరీ ధర రూ.120
-
టేబుల్ టాప్ క్యాలెండర్ ధర రూ.75
-
6 పేజీల క్యాలెండర్ రూ.450గా టీటీడీ నిర్ధారించింది.
-
శ్రీ వేంకటేశ్వర స్వామి పెద్ద క్యాలెండర్ రూ.20, శ్రీవారు, శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్ రూ.15.
-
శ్రీ పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్ రూ.20, తెలుగు పంచాంగం క్యాలెండర్ ధర రూ.30గా నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
తిరుపతి, తిరుమలలోనే కాకుండా బయటి ప్రాంతాల్లో కూడా శ్రీవారి డైరీలు, క్యాలెండర్ల అమ్మకాలు చేపడుతోంది టీటీడీ. చెన్నైలోని శ్రీ వెంకటేశ్వర స్వామి, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయాలు, హైదరాబాద్, బెంగుళూరు, విజయవాడ, వైజాగ్‌లోని శ్రీవారి ఆలయాలు, ముంబయి, న్యూఢిల్లీ, వేలూరు, కాంచీపురంలోని సమాచార కేంద్రాలు, నెల్లూరు, రాజమండ్రి, కాకినాడ, కర్నూలులోని టీటీడీ కల్యాణ మండపాల్లోనూ డైరీలు, క్యాలెండర్లు అందుబాటులో ఉంచినట్లు అధికారులు తెలిపారు.
Also Read: బలహీనంగా ఈశాన్య రుతుపవనాల తాకిడి, నేడు అక్కడక్కడ వర్షాలు!