Tirumala : శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్, ఈ నెల 9న ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల
Tirumala : జనవరి, ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టోకెన్లను 9వ తేదీన టీటీడీ విడుదల చేయనుంది.
Tirumala : శ్రీవారి భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్ చెప్పింది. ప్రతి నెల మాదిరిగానే పది రోజుల ముందే మరుసటి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ టోకెన్లు టీటీడీ జారీ చేస్తూ వస్తుంది. అయితే జనవరి 2న వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా పది రోజుల పాటు భక్తులకు సంతృప్తికరంగా వైకుంఠ ద్వార దర్శనం కల్పచాలనే ఉద్దేశంతో గత ఏడాది డిసెంబర్ నెల చివరిలో జనవరి 1వ తేదీ నుంచి 11వ తారీఖు వరకూ సంబంధించిన టోకెన్లను టీటీడీ జారీ చేసింది. అయితే 12వ తేదీ నుంచి మిగిలిన రోజుల ప్రత్యేక ప్రవేశ టోకెన్లను టీటీడీ పెండింగ్ పెట్టింది. అయితే జనవరి 12వ తేదీ నుంచి 31 వరకు, ఫిబ్రవరి నెలకు సంబంధించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టోకెన్లను రోజు వారి ఇరవై వేల చొప్పున ఈనెల 9వ తేదీ ఉదయం 10 గంటలకు ఆన్లైన్ లో విడుదల చేయనుంది. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తుంది.
శ్రీవారి దర్శనం టికెట్లు
కోట్లాది మంది భక్తుల ఆరాధ్యదైవమైన వేంకటేశ్వరస్వామి వారిని జన్మలో ఒక్కసారైనా దర్శించాలని భక్తులు భావిస్తూ ఉంటారు. ఆనంద నిలయంలో సాలగ్రామ శిలగా అవతరించిన శ్రీనివాసుడు భక్తుల పాలిట కొంగు బంగారమై విరాజిల్లుతున్నాడు. క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దివ్య మంగళ స్వరూపం దర్శన భాగ్యం కోసం ప్రతి నిత్యం దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమలకు చేరుకుంటారు. అయితే ఇలా చేరుకున్న భక్తులకు వివిధ మార్గాల్లో స్వామి వారి దర్శన భాగ్యం కల్పిస్తూ ఉంటుంది. అయితే వేకువజామున సుప్రభాత సేవ మొదలుకుని రాత్రి ఏకాంత సేవ వరకూ ఏడుకొండల వెంకన్న క్షణం తీరిక లేకుండా సేవలు నిర్వహిస్తారు. వేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి విచ్చేసే ధనవంతుల నుంచి సామాన్య భక్తుల వరకూ ఎటువంటి లోపం జరగకుండా టీటీడీ అధికారులు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. అయితే సామాన్య భక్తులకు త్వరితగతిన స్వామి వారి దర్శన భాగ్యం కల్పించేందుకు టైం స్లాట్ విధానం ద్వారా దర్శనం కల్పిస్తే, మరికొందరికి ఆన్లైన్ విధానం ద్వారా ప్రత్యేక ప్రవేశ దర్శనం, ఆర్జిత సేవ టోకెన్లు, అంగ ప్రదక్షణ టోకెన్లు, సీనియర్ సిటీజన్ టోకెన్లను ప్రతి నెల భక్తులకు అందుబాటులో ఉంచుతుంది. దీంతో ముందుస్తుగా టోకెన్లు పొందిన భక్తులు సకాలంలో స్వామి వారి దర్శనం పొందే విధానం టీటీడీ చర్యలు తీసుకుంటుంది.
వైకుంఠ ద్వార దర్శనాలు
తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనం కొనసాగుతుంది. ప్రతి రోజు ఒక్కో రకమైన ప్రసాదాలను తయారు చేసి నివేదిస్తుంటారు. గురువారం రోజున 47,781 మంది స్వామి వారి దర్శించుకున్నారు. ఇక స్వామి వారికి 15,695 మంది తలనీలాలు సమర్పించగా, 2.10 కోట్ల రూపాయలు భక్తులు హుండీ ద్వారా కానుకలుగా సమర్పించారు. తిరుమల పుణ్యక్షేత్రంలో వైకుంఠ ద్వార దర్శనాలు కొనసాగుతున్నాయి. ఐదో రోజు వైకుంఠ ద్వార దర్శనంను టీటీడీ భక్తులకు సంతృప్తికరంగా కల్పిస్తుంది. టోకెన్లు కలిగిన భక్తులు మాత్రమే స్వామి వారి దర్శనంకు రావాలని టీటీడీ ప్రకటించడంతో టోకెన్లు పొందినవారు మాత్రమే తిరుమల యాత్రకు వెళ్తున్నారు. దీంతో భక్తులు త్వరితగతిన స్వామి వారి దర్శన భాగ్యం పొందుతున్నారు.