Tirumala Devotees Rush : తిరుమలలో భారీగా భక్తుల రద్దీ, దర్శనానికి రెండు రోజుల సమయం, బ్రేక్ దర్శనాలు రద్దు
Tirumala Devotees Rush : తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిపోయింది. దీంతో టీటీడీ వీకెండ్ బ్రేక్ దర్శనాలు, ఆర్జిత సేవలను రద్దు చేసింది. కొండపై రెండు రోజుల పాటు రద్దీ కొనసాగనున్నట్లు టీటీడీ తెలిపింది.
Tirumala Devotees Rush : వేసవి సెలవులు, వారంతరాలు కావడంతో భక్తులు వేంకటేశ్వరుడి దర్శనార్ధం క్యూ కడుతున్నారు. దీంతో కొండపై ఊహించని రీతిలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొదలుకొని, క్యూలైన్స్ పూర్తిగా భక్తులతో నిండి పోయింది. విశేష సంఖ్యలో వచ్చిన భక్తులతో సప్తగిరులు గోవింద నామస్మరణలతో మారుమోగుతున్నాయి. ఇక వేంకటేశ్వరుడి దర్శనార్ధం నిత్యం వేలాది సంఖ్యలో భక్తులు వివిధ రాష్ట్రాల నుంచి తిరుమలకు చేరుకుంటారు. ఇలా చేరుకున్న భక్తులు క్షణకాలం పాటు జరిగే స్వామి వారి దర్శనం కోసం గంటలు, రోజులు తరబడి వేచి ఉండి స్వామి వారి ఆశీస్సులు పొందుతుంటారు. కోవిడ్ పూర్తి స్థాయిలో అదుపులోకి రావడంతో టీటీడీ సామాన్య భక్తులకు పెద్ద పీఠ వేస్తూ టికెట్లు లేకుండానే భక్తులను కొండకు అనుమతిస్తుంది. ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా భక్తుల రద్దీ కొనసాగుతుంది. అయితే ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో తిరుమల యాత్రకు విచ్చేసిన భక్తులతో సప్తగిరులు నిండిపోయింది.
పూర్తిగా నిండిపోయిన క్యూ కాంప్లెక్స్
వైకుంఠం క్యూ కాంప్లెక్స్-1,2 లోని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండి పోవడంతో సర్వదర్శనం క్యూలైన్ లేపాక్షి సర్కిల్ దాటుకుని షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా రటంభగ్గీచ్చా బస్టాండు వరకూ చేరింది. వేసవి సెలవులు, వారంతరాలు కావడంతో రెండు రోజుల పాటు రద్దీ కొనసాగే అవకాశం కనిపిస్తోంది. కరోనా సమయంలో స్వామి వారిని దర్శించుకోలేని సామాన్య భక్తులతో గత కొద్ది రోజులుగా ఏడుకొండలు నిండిపోయింది. ఎటు చూసిన భక్త జనమే దర్శనమిస్తున్న పరిస్థితి నెలకొంది. భక్తుల రద్దీ పెరగడంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్, క్యూలైన్స్ వద్ద అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. అంతేకాకుండా భక్తుల అనూహ్య రద్దీ నేపధ్యంలో టీటీడీ ఈవో ఏవీ.ధర్మారెడ్డి నేరుగా ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, నారాయణగిరి ఉద్యాన వనంలో క్యూలైన్స్ అధికారులతో కలిసి పరిశీలించి భక్తులకు అందుతున్న సౌఖర్యాలను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సలహాలు, సూచనలతో పాటుగా వారి సమస్యలను తెలుసుకుని పరిష్కరిస్తున్నారు.
రెండు రోజుల పాటు రద్దీ
ఇక స్వామి వారి దర్శనం కోసం క్యూలైన్స్ వేచి ఉన్న సామాన్య భక్తుల కోసం అన్నప్రసాదం, తాగునీరు, పాలు వంటివి నిరంతరాయంగా టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. రెండు రోజుల పాటు భక్తుల రద్దీ ఏడుకొండలపై కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. ఈ క్రమంలో సామాన్య భక్తులకు అవసరం అయ్యే ఏర్పాట్లపై అధికారులు నిమగ్నం అయ్యారు. భక్తుల సంఖ్య పెరగడంతో రద్దీ ప్రదేశాలైన అన్నదాన సత్రం, లడ్డూ వితరణ కేంద్రం, అతిథి గృహాలు, వసతి భవనాలు, పీఏసీ-1,2,3,4,5 వద్ద పోలీసులు భద్రత ఏర్పాట్లు కట్టిదిట్టం చేశారు.
బ్రేక్ దర్శనాలు రద్దు
ఒక్కసారిగా తిరుమలలో భక్తులు రద్దీ అన్యూహంగా పెరిగింది. దీంతో క్యూలైన్స్ లో గంటల తరబడి భక్తులు వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. క్యూలైన్స్ ను పరిశీలించిన టీటీడీ ఈవో ధర్మారెడ్డి, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి సెక్టార్ కి ప్రత్యేకంగా అధికారిని నియమించారు. ప్రస్తుతం క్యూలైనులో చేరుకుంటున్న భక్తులకు దర్శనానికి రెండు రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. కావున భక్తులు ఒపికతో వేచి ఉండి స్వామి వారి దర్శించుకోవాలని ఈవో కోరుతున్నారు. క్యూ లైనులో ఉన్న భక్తులకు నిరంతరాయంగా ఆహార సౌకర్యం కల్పిస్తున్నారు. రేపు రాత్రికి గానీ, ఎల్లుండి ఉదయానికి భక్తుల తాకిడి తగ్గే అవకాశం ఉందని అధికారులు అంచనాకు వచ్చారు. సామాన్య భక్తులకు ప్రాధాన్యత ఇచ్చేలా వికేండ్ లో సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు రద్దు చేసినట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి ప్రకటించారు. అంతే కాకుండా భక్తుల కోసం వారపు ఆర్జిత సేవలను సైతం రద్దు చేయాలని ఈవో ధర్మారెడ్డి నిర్ణయం తీసుకున్నారు.