Nimmakayala Chinarajappa : సీఎం జగన్ పై అసంతృప్తితో వైసీపీ ఎమ్మెల్యేలు, ఇవాళ నలుగురు రేపు మరికొంత మంది- మాజీ మంత్రి చిన్నరాజప్ప
Nimmakayala Chinarajappa : ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి ఏపీ ప్రభుత్వం దిగజారిందని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప ఆరోపించారు.
Nimmakayala Chinarajappa : ఏపీలో చంద్రబాబు పాలన రావాల్సిన అవసరం ఉందని మాజీ మంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప అన్నారు. ఆదివారం ఉదయం వీఐపీ విరామ సమయంలో తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సామాన్య భక్తులకు త్వరితగతిన శ్రీవారి దర్శన భాగ్యం కల్పించే బాధ్యత టీటీడీ పాలకమండలి, ఏపీ ప్రభుత్వంపై ఉందని చిన్నరాజప్ప అన్నారు. అన్ని ఉచితం అంటున్న ప్రభుత్వం టీటీడీలో మాత్రం చాలా దారుణంగా రేట్లు పెంచుతున్నారన్నారు. శ్రీవాణి టికెట్ 10 వేలు పెట్టారని, సామాన్యులకు అందుబాటులో ఉండేలా ధరలు నిర్ణయించాలని ఆయన కోరారు. శ్రీశైలం దేవస్థానంలో సైతం రేట్లు అధికంగా పెంచారని, చంద్రబాబు నాయుడు హయాంలో సామాన్య భక్తులు అధికంగా వచ్చేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. భోజనం, వసతులు కల్పించాలని అన్ని దేవస్థానాలకు ఆదేశించారని చెప్పిన ఆయన, వసతి గదుల సమస్యలపై టీటీడీ దృష్టి సారించాలని, ప్రభుత్వానికి సీజీఎఫ్ ద్వారా ఫండింగ్ ఇవ్వకుండా శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయాలను టీటీడీ అభివృద్ధి చేయాలని కోరారు.
జనసేన, టీడీపీ కలిసి పోటీ చేస్తే బాగుంటుంది
ఇక ఎమ్మెల్సీ ఎన్నికలతోనే ప్రజలు టీడీపీ వైపు ఉన్నారని స్పష్టం అయ్యిందని మాజీ మంత్రి చిన్నరాజప్ప అన్నారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో వైఫల్యం చెందిందని, సంక్షేమం అరకొరగా ఉందని, అభివృద్ధి అసలు లేదని విమర్శించారు. చంద్రబాబు పాలనా రాష్ట్రానికి అవసరమన్నారు. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేని పరిస్థితికి సీఎం జగన్ ప్రభుత్వం దిగజారిందన్నారు. నిరుద్యోగులు సైతం టీడీపీ వైపే ఉన్నారని, అన్ని వర్గాల ప్రజలు చంద్రబాబు వైపే చూస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. పొత్తు అనేది అధిష్టానం నిర్ణయమని చెప్పిన ఆయన, జనసేన టీడీపీతో కలసి పోటీ చేస్తే బాగుంటుందన్నారు. ఎమ్మెల్యేలే జగన్ చూసి పారిపోతున్నారని, ఇక 175 స్థానాలు ఎక్కడ వస్తాయని ఆయన ఎద్దేవా చేశారు. డబ్బులు పెట్టి ఎమ్మెల్యేలను కొనే పరిస్థితిలో మేము లేమని, మా నలుగురు ఎమేల్యేలను వైసీపీ కొనుగోలు చేసిందని ఆరోపించారు. జగన్ వల్ల ఇబ్బంది పడటం వల్లే వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీకి వచ్చారని, త్వరలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని నిమ్మకాయల చినరాజప్ప అన్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి
"రోజుకు 75 వేల నుంచి 80 వేల మంది భక్తులు శ్రీవారిని దర్శించుకుంటారు. ఎన్ని ఏర్పాట్లు చేసినా లోపాలయితే ఉంటున్నాయి. అన్ని ఉచితం అంటున్న వైసీపీ ప్రభుత్వం భగవంతుడి దగ్గర మాత్రమే అన్నింటి రేట్లు పెంచుతోంది. టికెట్లు రేట్లు బాగా పెంచేశారు. టీటీడీలో వసతి సదుపాయాలు కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రజలు ఎవరి పక్షాన ఉందో తేలిపోయింది. వైసీపీ ప్రభుత్వంలో అన్ని వర్గాలపై దాడులు జరుగుతున్నాయి. పరిశ్రమలకు ప్రోత్సాహకాలు లేక ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నాయి. సీఎం జగన్ పై ఎమ్మెల్యేలు అసంతృప్తితో ఉన్నారు. ఎమ్మెల్యేలను డబ్బులు పెట్టి కొనాల్సిన అవసరం మాకు లేదు. ఇవాళ నలుగురు వచ్చారు రేపు ఇంకా చాలా మంది వస్తారు. " - నిమ్మకాయల చినరాజప్ప,మాజీ మంత్రి