TTD EO Dharma Reddy : శ్రీవారి భక్తులకు అలెర్ట్- తిరుపతిలో టైం స్లాట్ టోకెన్ల జారీ, గదుల కేటాయింపు!
TTD EO Dharma Reddy : తిరుమలలోని వసతి గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతికి తరలిస్తున్నట్లు టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
![TTD EO Dharma Reddy : శ్రీవారి భక్తులకు అలెర్ట్- తిరుపతిలో టైం స్లాట్ టోకెన్ల జారీ, గదుల కేటాయింపు! Tirumala Dial EO Dharma Reddy says time slot tokens allocation in tirupati DNN TTD EO Dharma Reddy : శ్రీవారి భక్తులకు అలెర్ట్- తిరుపతిలో టైం స్లాట్ టోకెన్ల జారీ, గదుల కేటాయింపు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/10/09/b7c4bdada0bd865852c0ada52b2cdf8a1665309049737235_original.jpeg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
TTD EO Dharma Reddy : తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను త్వరలో తిరుపతికి తరలిస్తామని టీటీడీ ఈవో ఏవీ ధర్మారెడ్డి స్పష్టం చేశారు. ఆదివారం ఉదయం తిరుమల అన్నమయ్య భవనంలో డయల్ యువర్ ఈవో కార్యక్రమంలో టీటీడీ ఈవో పాల్గోని భక్తుల ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. అనంతరం టీటీడీ ఈవో ధర్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ లో 21.12 లక్షల మంది భక్తులు స్వామి వారి దర్శించుకోగా, రూ.122.19 కోట్లు హుండీ ద్వారా భక్తులు స్వామి వారికి కానుకలు సమర్పించారని తెలిపారు. 98.74 లక్షల లడ్డూలను విక్రయించామని, 44.71 లక్షలు మంది అన్నదానం స్వీకరించగా, 9.02 లక్షల మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించారని తెలిపారు. గరుడ సేవ రోజున దాదాపు మూడు లక్షల మంది భక్తులకు పైగా వాహనసేవ దర్శనభాగ్యం కల్పించామన్నారు. హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఏడు రాష్ట్రాల నుంచి వచ్చిన 91 కళాబృందాల్లో 1906 మంది కళాకారులు వాహన సేవలతో పాటు తిరుమల, తిరుపతిలో ప్రదర్శించిన కళాకృతులు విశేషంగా అకట్టుకున్నాయని ఆయన తెలియజేశారు.
వీఐపీ బ్రేక్ దర్శన సమయాలు మార్పు
రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి 147 బస్సుల ద్వారా 6,997 మంది వెనుకబడిన పేద వర్గాల వారిని ఉచితంగా తిరుమలకు తీసుకొచ్చి మూలవిరాట్ దర్శనం కల్పించామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. తిరుమలలో ఉన్న గదుల కేటాయింపు వ్యవస్థను తిరుపతిలో చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామని తెలియజేశారు. తిరుమలలో గదులు దొరకని భక్తులు తిరుపతిలోనే వసతి పొందే అవకాశం ఉంటుందన్నారు. త్వరలో ప్రయోగాత్మకంగా ఈ విధానాన్ని మొదలుపెడతామని ప్రకటించారు. శ్రీవారి దర్శనార్థం కంపార్ట్‌మెంట్లలో రాత్రి వేళ వేచి ఉండే భక్తులకు ఉదయం త్వరగా దర్శనం కల్పించేందుకు వీలుగా ఉదయం ఉన్న వీఐపీ బ్రేక్ దర్శన సమయాన్ని ఉదయం 10 గంటలకు మార్పు చేసి ప్రయోగాత్మకంగా అమలు చేస్తామన్నారు. పెరటాసి మాసం మూడో శనివారంతో పాటు వరుస సెలవులు రావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగిందని ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలకు వచ్చే భక్తుల దర్శనానికి దాదాపు 48 గంటల సమయం పడుతోందన్నారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
అక్టోబర్ 11 నుంచి హైదరాబాద్ లో శ్రీవారి వైభవోత్సవాలు
తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో సేవలందించే శ్రీవారి సేవకులు ఆయా మార్గాలను తెలుసుకునేందుకు వీలుగా రూపొందించిన క్యూఆర్ కోడ్ విధానం విజయవంతమైందని ఈవో ధర్మారెడ్డి తెలిపారు. భక్తుల కోసం త్వరలో తిరుమలలోని పలు ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్ విధానం ఏర్పాటు చేస్తామన్నారు. తిరుమలలో శ్రీ వేంకటేశ్వర స్వామి వారికి జరిగే నిత్య, వారసేవలు, ఉత్సవాలను ఇతర ప్రాంతాల్లోని భక్తులు దర్శించేందుకు వీలుగా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. అక్టోబరు 11 నుంచి 15వ తేదీ వరకు హైదరాబాద్ ఎన్‌టీఆర్ స్టేడియంలో శ్రీవారి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని చెప్పారు. అక్టోబరు 11న వసంతోత్సవం, 12న సహస్ర కలశాభిషేకం, 13న తిరుప్పావడ, 14న నిజపాద దర్శనం, 15న సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు శ్రీనివాస కల్యాణం జరగనుందన్నారు. డిసెంబర్లో ప్రకాశం జిల్లా ఒంగోలు, జనవరిలో ఢిల్లీలో వైభవోత్సవాలు నిర్వహిస్తామని వివరించారు. కార్తీక మాసంలో విశాఖపట్నం, కర్నూలు జిల్లా యాగంటిలో కార్తీక దీపోత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. ఉత్తరాయణంలో చెన్నైలోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, జమ్మూలోని శ్రీవారి ఆలయాలకు మహాసంప్రోక్షణ చేపడుతున్నట్లు తెలిపారు. అహ్మదాబాద్ నగరంలో శ్రీవారి ఆలయ నిర్మాణానికి గుజరాత్ ప్రభుత్వం 5 ఎకరాల స్థలం ఇచ్చిందని తెలిపారు. త్వరలో భూమిపూజ చేస్తామని, అక్టోబరు నెలలో ఏజన్సీ ప్రాంతాలైన అనకాపల్లి, అరకు, రంపచోడవరం తదితర ప్రాంతాల్లో శ్రీనివాస కల్యాణాలు నిర్వహిస్తామని ఈవో ఏవీ.ధర్మారెడ్డి తెలియజేశారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)