Chittor News : పూతలపట్టులో ఫ్లెక్సీల చిచ్చు - పోటాపోటీగా దిష్టిబొమ్మల దహనాలు !
పూతలపట్టులో వైసీపీ బంద్ సందర్భంగా ఉద్రిక్తత ఏర్పడింది. దెబ్బకు దెబ్బ తీస్తామని టీడీపీ నేతలు హెచ్చరించారు.
Chittor News : చంద్రబాబు పర్యటన సందర్భంగా పుంగనూరులో ఏర్పడిన ఉద్రిక్తతలతో చిత్తూరులో వైసీపీ నేతలు బంద్ పాటించారు. ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గంలో టీడీపీ ఫ్లెక్సీలను వైసీపీ కార్యకర్తలు చించేయడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పూతలపట్టు నియోజకవర్గంలోని మండల్లాలో టిడిపి, వైసీపి శ్రేణులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. పూతలపట్టుల్లో వైసీపి శ్రేణులు బ్యానర్లు చించి వేసి చంద్రబాబు దిష్టి బొమ్మను దహనం చేశారు.. దీంతో ఆగ్రహించిన టిడిపి శ్రేణులు జగన్ దిష్టి బొమ్మను చెప్పులతో కొట్టి, చెప్పుల మాల వేసి దహనం చేశారు.
రౌడీ మూకల సాయంతో ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణ
ఈ సందర్భంగా పూతలపట్టు నియోజకవర్గం టిడిపి ఇంఛార్జ్ డాక్టర్ కే.మురళిమోహన్ వైసీపీ నాయకులపై మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో విధ్వంసం సృష్టిస్తూ, జనాలను భయభ్రాంతులకు గురి చేయడంతో పాటుగా, టిడిపి సానుభూతిపరులను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆయన మండిపడ్డారు.. పూతలపట్టు నియోజకవర్గం లో టిడిపి సానుభూతిపరులపై వైసిపి నాయకులు చేస్తున్న దురాగతాలను ఎండగట్టేందుకే టిడిపి శ్రేణులు రోడ్డు పైకి రావడం జరిగిందన్నారు. అసలు చిత్తూరు జిల్లాలో వైసిపి నాయకులు ఇచ్చిన బంద్ కు అర్థమే లేదంటూ ఆయన వ్యాఖ్యానించారు.. టిడిపి నాయకులపై, పోలీసులపై దాడి చేసి తిరిగి టిడిపి నాయకుల పైనే వైసిపి నాయకులు కేసులు పెట్టారంటూ ఆయన ఆరోపించారు.
ఎమ్మెల్యే బాబుపై టీడీపీ నేత మురళీ మోహన్ తీవ్ర విమర్శలు
పూతలపట్టు నియోజకవర్గంలో ఓ చిల్లర గాడు చిల్లర చేష్టలు చేశాడని, కావాలనే స్థానిక ఎమ్మెల్యే శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నాడని, ప్రశాంతంగా ఉన్న పూతలపట్టును అరాచకంగా మారుస్తున్నారని మండిపడ్డారు. పూతలపట్టులో దెబ్బకు దెబ్బ భయపెట్టి అణిచివేస్తామంటే అది కేవలం వైసీపీ నాయకుల భ్రమే అని హెచ్చరించారు.. టిడిపి బ్యానర్లు చించి వేయడం మగతనమా అని ఆయన ప్రశ్నించారు.. స్థానిక ఎమ్మెల్యే ఎంఎస్ బాబుకు అసలు బంద్ ఎందుకు చేస్తున్నామో తెలియకుండా తాగి ఊగి ఊరు పై పడి అరాచకాలు సృష్టిస్తున్నారని పూతలపట్టు నియోజకవర్గం టిడిపి ఇన్చార్జ్ డాక్టర్ మురళీమోహన్ ఆరోపించారు.
టీడీపీ ఫ్లెక్సీలను చించేయడంతో వివాదం ప్రారంభం
పుంగనూరులో ఉద్రిక్త పరిస్థితుల తర్వాత చంద్రబాబునాయుడు పూతలపట్టులోనే బహిరంగసభ నిర్వహించారు. ఉదయమే వైసీపీ బంద్ సందర్భంగా ఈ పర్యటన కోసం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించేయడంతో వివాదం ఏర్పడింది. వైసీపీ నాయకులు ఉదయమే రోడ్లపైకి వచ్చి దుకాణలను మూసి వేయించే ప్రయత్నం చేశారు.