Amaravati Supreme Court : అమరావతి పిటిషన్లపై తదుపరి విచారణ జూలైలో - హైకోర్టు తీర్పుపై స్టేకు సుప్రీం నిరాకరణ !
అమరావతి రాజధాని కేసులు తదుపరి విచారణ జూలైలో చేపడతామని సుప్రీంకోర్టు తెలిపింది. హైకోర్టు తీర్పుపై స్టే ఇచ్చేందుకు ధర్మాసనం నిరాకరించింది.
Amaravati Supreme Court : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసులపై తదుపరి విచారణను సుప్రీంకోర్టు జూలై 11వ తేదీకి వాయిదా వేసింది. అమరావతిపై హైకోర్టు తీర్పుపై స్టే విధించాలంటూ సుప్రీంలో ఏపీ ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసింది. అయితే హైకోర్టు తీర్పును యధాతధంగా అమలు చేసేలా ఏపీ ప్రభుత్వానికి ఆదేశాలివ్వాలంటూ సుప్రీంను అమరావతి రైతులు ఆశ్రయించారు. ఇంతకు ముందే కేంద్రం దాఖలు చేసిన అమరావతి విభజన చట్టం ప్రకారమే ఏర్పడిందంటూ అఫిడవిట్ దాఖలు చేసింది కేంద్ర ప్రభుత్వం. మూడు రాజధానుల గురించి తమకు తెలియదని కేంద్రం సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని విచారణ సందర్భంగా ధర్మాసనాన్ని ఏపీ ప్రభుత్వం తరపు న్యాయవాదులు కోరారు. ధర్మాసనం నిరాకరించింది. విచారణను జూలైకు వాయిదావేసింది.
అంతకు ముందు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణకు వస్తుందా రాదా అన్న సందిగ్ధత నెలకొంది. సుప్రీం కోర్టులో కేసుల విచారణ జాబితా వరుస మారడంతో అమరావతి కేసుపై విచారణ ఆలస్యమైంది. మొదటి 5 కేసుల విచారణ తర్వాత 12వ నెంబర్ నుంచి 20 నెంబర్ కేసు వరకు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 7వ నెంబర్ కేసు నుంచి 11వ నెంబర్ కేసు విచారణ జరుగుతుంది. ఆ తర్వాత 21 నుంచి 39, 41వ నెంబర్ కేసులను కోర్టు విచారిస్తుంది. 10వ నెంబర్ కేసుగా అమరావతి రాజధాని కేసు ఉండటంతో విచారణకు రాదేమోనని 8వ నెంబర్ కేసుపై విచారణ జరుగుతున్న సమయంలో అమరావతి కేసును ప్రస్తావించేందుకు ఏపీ ప్రభుత్వ లాయర్లు ప్రయత్నించారు.
అమరావతి పిటీషన్‌ను వెంటనే విచారణకు తీసుకోవాలని ఏపీ తరపు సీనియర్ న్యాయవాదులు నఫ్డే, నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. ఈ సందర్బంగా లాయర్లపై సుప్రీంకోర్టు ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఒక కేసు సగం విచారణలో ఉండగా... మరో కేసు ఎలా విచారించాలి అని న్యాయమూర్తి జస్టిస్ కెఎం జోసెఫ్ ప్రశ్నించారు. సుప్రీంకోర్టు నిబంధనల ప్రకారం ఒక కేసు విచారణ పూర్తి కాకుండా... మరో కేసు విచారించడం తగదని అన్నారు. న్యాయమూర్తి కె ఎం జోసెఫ్ ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఏపీ లాయర్లు మిన్నకుండిపోయారు. మధ్యాహ్నం తర్వాత కేసు విచారణకు వచ్చింది.
అమరావతిపై తదుపరి చట్టాలు చేయడానికి వీల్లేదని హైకోర్టు గతంలో తీర్పు ఇచ్చి రిట్ ఆఫ్ మాండమస్ ప్రకటించింది. అయితే చట్టాలు చేయడానికి వీల్లేదని ప్రకటించడం .. తమ అధికారాల్లో జోక్యం చేసుకోవడమేనని ఏపీ ప్రభుత్వం వాదిస్తోంది. అయితే హైకోర్టు తీర్పు వచ్చిన వెంటనే సుప్రీంకోర్టును ఆశ్రయించలేదు.ఆరు నెలల ఆలస్యంగా సుప్రీంకోర్టులో పిటిషన్లు వేసింది. వేగంగా విచారణ చేయాలని పదే పదే ఏపీ ప్రభుత్వ లాయర్లు సుప్రంకోర్టును ఆశ్రయిస్తున్నారు. అయితే విచారణ అంత కంటే ఎక్కువగా ఆలస్యమవుతోంది. మరోసారి జూలైకు వాయిదా పడటంతో ఏపీ ప్రభుత్వానికి నిరాశ ఎదురయింది. తీర్పుపై స్టే వస్తే రాజధానిని విశాఖ మార్చాలని సీఎం జగన్ అనుకున్నారు.