YS Viveka Case : వివేకా హత్య కేసుపై సుప్రీంకోర్టు కీలక నిర్ణయం! ఇక విచారణ ఎక్కడ అంటే ?
వివేకా హత్య కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఏ రాష్ట్రంలో విచారణ చేయాలో శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయనుంది.
YS Viveka Case : వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ కీలక ములుపు తిరిగింది. ఇక నుంచి కడప కేంద్రంగా కానీ..ఏపీలో కానీ ఈ కేసు విచారణ జరిగే అవకాశాలు లేవు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు, వివేకా హత్య కేసు నిందితులు కుమ్మక్కయ్యారన్న వైఎస్ సునీత, సీబీఐ తరపు వాదనలతో సుప్రీంకోర్టు ఏకీభవించింది. ఈ కేసు విచారణను ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు అంగీకరించింది. ఈ కేసును మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని పిటిషన్ దాఖలు చేసిన కుమార్తె సునీత రెడ్డి.. జస్టిస్ ఎం.ఆర్ షా,జస్టిస్ ఎం.ఎం. సుందరేష్ తో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. కేసు విచారణను ఏ రాష్టానికి బదిలీ చేయాలని కోరుకుంటున్నారని పిటిషనర్లను ధర్మాసనం ప్రశ్నించింది.
కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయడానికి తమకు అభ్యంతరం లేదని సుప్రింకోర్టులో 200కు పైగా పేజీల అఫిడవిట్ ను సీబీఐ దాఖలు చేసింది. విచారణను వేరే రాష్ట్రానికి ఎందుకు బదిలీ చేయాలనే బలమైన కారణాలను కూడా కోర్టుకు సీబీఐ సమర్పించింది. ఇరుపక్షాల న్యాయవాదుల వాదనలను విన్న సుప్రీంకోర్టు... ఏపీ నుంచి ఇతర రాష్ట్రానికి బదిలీ చేసేందుకు ఓకే చెప్పింది.
హైదరాబాదుకు కేసును బదిలీ చేయాలా? అనే అంశాన్ని సుప్రీంకోర్టు ప్రస్తావించగా... ఏపీకి దగ్గరగా హైదరాబాద్ ఉందని... అందువల్ల విచారణను ప్రభావితం చేసే అవకాశం ఉందని సీబీఐ తరపు న్యాయవాదులు తెలిపారు. సాక్షులను బెదిరించే అవకాశం ఉందని చెప్పారు. కర్ణాటక సహా ఏ రాష్ట్రమైనా అభ్యంతరం లేదని తెలిపారు.
విచారణను ఢిల్లీకి బదిలీ చేయాలా? అనే ప్రస్తావన కూడా వాదనల సందర్భంగా వచ్చింది. కేసు విచారణను ఎక్కడకు బదిలీ చేయాలనే ఉత్తర్వులను శుక్రవారం నాడు తమ తీర్పులో వెలువరిస్తామని ధర్మాసనం తెలిపింది.వివేకానందరెడ్డి హత్యపై 2021 ఆగస్ట్ 30న దస్తగిరి స్టేట్‌మెంట్ ఇచ్చారు. దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌ను మిగతా నిందితుల లాయర్లకు కోర్టు ఇచ్చింది. కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో దస్తగిరి బడా నేతల పేర్లు ప్రస్తావించారు. సీఆర్‌పీసీ 164(1) సెక్షన్ కింద ప్రొద్దుటూరు కోర్టులో స్టేట్‌మెంట్ రికార్డు చేశారు. హత్యలో నలుగురు పాల్గొన్నట్టు కన్ఫెషన్ స్టేట్‌మెంట్‌లో ఉంది. ఎర్ర గంగిరెడ్డి , సునీల్ యాదవ్, గుజ్జుల ఉమాశంకర్‌రెడ్డితో కలిసి వివేకాను హత్య చేసినట్టు దస్తగిరి కన్ఫెషన్ స్టేట్‌మెంట్ ఇచ్చారు. వివేకా హత్యకు ఎర్ర గంగిరెడ్డి కుట్రపన్నినట్లు దస్తగిరి పేర్కొన్నారు.
2019 అసెంబ్లీ ఎన్నికలకు ముందు వైఎస్ వివేకా హత్య జరిగింది. ఆ సమయంలో టీడీపీ అధికారంలో ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు ఈ హత్యపై విచారణకు సిట్ ఏర్పాటు చేశారు. 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ సర్కార్ కూడా సిట్ దర్యాప్తును ఏర్పాటు చేసింది. అయితే విచారణలో ఎలాంటి పురోగతి కనిపించలేదు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులను తేల్చాలని కోరుతూ వివేకానందరెడ్డి కూతురు సునీతా రెడ్డి మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ బీటెక్ రవీంద్ర హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో వాస్తవాలు వెలుగు చూడాలంటే సీబీఐ విచారణ అవసరమని వారు ఆ పిటిషన్లలో కోరారు. దీంతో ఏపీ హైకోర్టు వివేకానందరెడ్డి హత్య కేసు విచారణను సీబీఐకి అప్పగించింది. కానీ ప్రభుత్వం సహకరించకపోవడంతో విచారణ ముందుకు సాగలేదు. ఇప్పుడీ కేసు విచారణ ఇతర రాష్ట్రాలకు చేరింది.