Andhra Elections : ఏపీలో ఎన్నికలకు షెడ్యూల్ విడుదల - పోలింగ్ ఎప్పుడంటే ?
ఏపీ పంచాయతీల్లోని ఉపఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించారు. సర్పంచ్‌లు, వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతాయి.
Andhra Elections : ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ను విడుదల చేసింది.. ఈనెల 19న పోలింగ్ ను నిర్వహించటంతో పాటుగా అదే రోజున కౌంటింగ్ నిర్వహించి, లెక్కింపు పూర్తి కాగానే ఫలితాలు కూడ వెల్లడిస్తారు. ఆంధ్రప్రదేశ్ లోని 1.033 గ్రామ పంచాయతీల్లోని 66 సర్పంచ్‌లు, 1,064 వార్డు సభ్యుల సాధారణ ఖాళీలకు ఎన్నికలను నిర్వహించనున్నారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసింది. ఎన్నిక అయిన ప్రజా ప్రతినిధులు మరణించటం, రాజకీయ కారణాలతో రాజీనామాలు చేయటంతో ఈ ఖాళీలు ఏర్పడ్డాయని, ఎన్నికల సంఘం వెల్లడించింది.
ఎన్నికల షెడ్యూల్ ప్రకారం ఆగస్టు 19న పోలింగ్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని తెలిపారు. రిటర్నింగ్ అధికారి ఆగస్టు ఎనిమిది న ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేస్తారని ఆమె తెలిపారు. అలాగే 8వ తేదీ నుంచి ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామని ఆమె తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు చివరి రోజు ఆగస్టు 10 సాయంత్రం 5 గంటల వరకు ఉంటుంది. నామినేషన్ల పరిశీలన ఆగస్టు 11వ తేదీ ఉదయం 8 గంటల నుంచి నిర్వహింస్తారు. నామినేషన్ల తిరస్కరణ, వ్యతిరేకంగా అప్పీళ్లను ఆగస్టు 12న అప్పీలేట్ అథారిటీ ముందు దాఖలు చేయవచ్చు. అప్పీళ్లను పరిష్కరించేందుకు ఆగస్టు 13న అప్పీలేట్ అథారిటీ నిర్ణయం తీసుకుంటారు. నామినేషన్లు ఆగస్ట్ 14 మద్యాహ్నం మూడు గంటల వరకు విత్ డ్రా చేసుకోవచ్చు . పోటీ చేసే అభ్యర్థుల తుది జాబితా ను అధికారులు ప్రకటిస్తారు.
ఆగస్టు 19వ తేదీ ఉదయం ఎడు గంటల నుండి మధ్యాహ్నం ఓంటి గంట వరకు, పోలింగ్ ఉంటుంది. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు నిర్వహించి, పూర్తయిన వెంటనే ఫలితాలు వెల్లడిస్తారు. కృష్ణా జిల్లాలో 7 మంది సర్పంచ్‌లు, 55 మంది వార్డు సభ్యులను ఈ ఎన్నికల ద్వార ఎన్నుకోనున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఉమ్మడి కృష్ణా జిల్లాలో (కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో కొంత భాగం) ఏడు గ్రామ సర్పంచ్‌లు, 55 వార్డు సభ్యులకు ఆగస్టు 19న ఎన్నికలు నిర్వహించనున్నారు. ఇందుకు గాను సంబంధిత ఎన్నికల అధికారులు ఆగస్టు 8వ తేదీన వేర్వేరుగా నోటిఫికేషన్‌లు జారీ చేస్తారు. అదే రోజు నామినేషన్ల దాఖలు ప్రారంభమవుతుంది.
ఆదివారం నుంచి అంటే నిన్నటి నుండే, అన్ని గ్రామ పంచాయతీల్లో మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమల్లోకి వచ్చింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ఎన్టీఆర్ జిల్లాలో ముగ్గురు సర్పంచ్‌లు, 12 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. వీరుళ్లపాడు, దాచవరం, వత్సవాయిలోని పెదమోదుగపల్లి, జగ్గయ్యపేట మండలం మల్కాపురం సర్పంచ్‌లకు ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే కృష్ణా జిల్లా గూడూరు మండలం కోకనారాయణపాలెం, పెడన మండలం కొంగచర్లలో ఎన్నికలు నిర్వహించనున్నారు. అలాగే 31 మంది వార్డు సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలం అడవినెక్కలం, ముదినేపల్లి మండలం వణుడూరులో సర్పంచ్ ఎన్నిక జరగనుంది. పన్నెండు మంది వార్డు సభ్యులను కూడా ఎన్నుకోనున్నారు.
వైఎస్ఆర్ జిల్లాలోని కొండాపురం మండలం కె.సుగుమంచిపల్లి గ్రామపంచాయతీలోని సర్పంచ్, మొత్తం 14 వార్డు సభ్యులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం, ఫలితాలు వెలువడిన వెంటనే ఆగస్టు 19న ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించనున్నారు. ఆయా గ్రామ పంచాయతీల్లో నమోదైన ఓటర్లు ఎన్నికల్లో పాల్గొనాలని ఎన్నికల సంఘం అధికారులు పిలుపునిచ్చారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243కె మరియు ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ చట్టం, 1994లోని సెక్షన్ 13, 14, 200 మరియు 201 కింద అందించిన అధికారాల అమలులో ఎన్నికలు నిర్వహించనున్నారు. ఆగస్టు 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయడంతో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నిబంధనల ప్రకారం సంబంధిత గ్రామ పంచాయతి మొత్తం ప్రాంతానికి కోడ్ అమలు అవుతుంది.