(Source: ECI/ABP News/ABP Majha)
Pawan No Break To Moives : తీరిక లేని పవన్ సినీ షెడ్యూల్స్ - వారాహిపై యాత్రకు సమయం ఉంటుందా ? ఎన్నికల ఏడాదిలోనూ పార్ట్ టైమ్ పాలిటిక్సేనా ?
జనసేన అధినేత వరుసగా సినిమాలు అంగీకరిస్తూ వెళ్తున్నారు. మరి ఏపీలోరాజకీయం ఎలా చేస్తారు ?
Pawan No Break To Moives : జనసేన అధినేత పవన్ కల్యాణ్ రాజకీయ ఆకాంక్షలు ఎక్కువగా పెట్టుకున్నారు. ఏదో ఓ పార్టీలో చేరి ఉంటే ఆయన రెగ్యూలర్ గా సినిమాలు చేసుకున్నా పెద్దగా ఎఫెక్ట్ పడేది కాదు. కానీ ఆయన సొంత పార్టీ పెట్టుకున్నారు. ఇప్పుడు పార్టీ పనుల్ని ఎక్కువగా నాదెండ్ల మనోహర్‌కే వదిలి పెట్టారు. తాను సినీ షెడ్యూల్స్‌లో బిజీగా ఉంటున్నారు. వచ్చే ఏడాది కూడా ఆయన తీరిక లేకుండా సినిమాలు చేయబోతున్నారని తెలుస్తోంది. వరుసగా మూడు సినిమాలు పట్టాలెక్కబోతున్నాయి. మరి ఎన్నికల ఏడాదిలో ఆయన రాజకీయంపై ఎంత సమయం వెచ్చించగలరని జనసైనికులు టెన్షన్‌కు గురవుతున్నారు.
వచ్చే ఏడాది పవన్ కల్యాణ్ మూడు సినిమాలు
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కొత్త సినిమాల ప్రకటనలు ఒకదాని తర్వాత ఒకటి వస్తున్నాయి. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న హరిహర వీరమల్లు కంప్లీట్ అవడానికి జనవరి వరకూ పడుతుంది.. ఆ తర్వాత వెంటనే మరో రెండు సినిమాల షూటింగ్‌లో పాల్గొంటారని ఆయా సినిమాల రూపకర్తలు ప్రకటించారు. సుజిత్ డైరక్షన్‌లో ఓ సినిమాను కొత్తగా ఎనౌన్స్ చేయగా.. గతంలోనే ప్రకటించిన హరీష్ శంకర్ దర్శకత్వంలోని సినిమా కూడా వచ్చే వారం నుంచే ప్రారంభమవుతుందని.. హరీష్ శంకరే ప్రకటించారు. జనవరి నుంచి వినోదయ సీతం అనే తమిళ సినిమా రీమేక్‌లోనూ పవన్ నటిస్తారు. అంటే మూడు సినిమాల షూటింగ్‌లలో పాల్గొనాల్సిఉంది. ఎలా లేదన్నా ఒక్క సినిమా షూటింగ్‌కు కనీసం నాలుగు నెలలు పడుతుంది. దీంతో వచ్చే ఏడాది మొత్తం పవన్ బిజీగా ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.
ఏపీలో ఇప్పటికే ఎన్నికల వేడి !
నిజానికి ఏపీలో ఎన్నికల వేడి పెరిగిపోయింది. రాజకీయ పార్టీలన్నీ పూర్తి స్థాయిలో ప్రజల్లో ఉన్నాయి. పార్టీల అధినేతలు మరో మాటకు తావు లేకుండా రాజకీయాలు చేస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ కూడా.. జనవరి నుంచి బస్సు యాత్రకు ప్లాన్ చేసుకున్నారు. వారాహి బస్సు కూడా రెడీ అయింది. కానీ ఆయన షెడ్యూల్ మాత్రం బిజీగా ఉంది. ఓ సారి యాత్ర ప్రారంభిస్తే నిరాటంకంగా చేస్తారా లేకపోతే.. గ్యాప్‌లు ఇస్తూ మధ్యలోచేస్తారా అన్నదానిపై ఇప్పటికే డౌట్స్ ప్రారంభమయ్యాయి. ఇప్పటి వరకూ యాత్ర ఎప్పటి నుండి ప్రారంభమవుతుందన్న దానిపై క్లారిటీ లేదు. కానీ పవన్ మాత్రం రాజకీయ యాత్ర చేయాలనే పట్టుదలతో ఉన్నారు.కానీ షూటింగ్ గ్యాప్‌లో పర్యటనలు చేస్తే ప్రజల్లో సీరియస్ నెస్ తగ్గుతుంది.
ముందస్తు ఎన్నికలు వస్తే మొత్తం ప్లాన్ రివర్స్ !
షెడ్యూల్ ప్రకారం అయితే వచ్చే ఏడాది ఎన్నికలు లేవు. 2024లో ఏప్రిల్ , మేలో ఎన్నికలు ఉంటాయి.కానీ ఏపీ అధికార పార్టీ ముందస్తు ప్రణాళికలు వేస్తోందని ఎక్కువ మంది నమ్ముతున్నారు. అందుకే చివరి ఏడాది అయినా పూర్తి స్థాయిలో పార్టీ కోసం పవన్ కల్యాణ్ సమయం వెచ్చిస్తారని జనసైనికులు భావిస్తున్నారు కానీ అలాంటి చాన్స్ లేదని తాడా పరిణామాలతో స్పష్టమవుతోందని నిరాశపడుతున్నారు. పవన్ కల్యాణ్ .. పార్టీని నడపడానికి.. లేకపోతే ఆర్థికపరమైన అంశాల కారణంగా సినిమాలు వదులుకోవడానికి సిద్ధంగా లేరు. ాయన ప్యాకేజీ స్టార్ అని.. మరొకటని వైసీపీ నేతలు ఎంత వెటకారం చేసినా.. ఆయన పరిస్థితి ఆయనకు తెలుసు కాబట్టి.. పార్టీని నడపడానికైనా తాను సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. ఎన్నికల ఏడాదిలోనూ ఇలా పవన్ సినిమాలతో బిజీగా ఉంటే ఆ ఎఫెక్ట్ పార్టీపై పడే ప్రమాదం ఉంది. దీన్ని పవన్ కల్యాణ్ ఎందుకు అంచనా వేయలేకపోతున్నారని జనసైనికులు టెన్షన్ పడుతున్నారు.