G.O No 1 Highcourt : జీవో నెంబర్ వన్‌పై మరిన్ని పిటిషన్లు - మంగళవారం కూడా హైకోర్టులో విచారణ !
జీ.వో నెంబర్ వన్ పై విచారణ మంగళవారానికి వాయిదా వేసింది హైకోర్టు. ఈ జీవో చట్ట విరుద్ధమంటూ మరికొన్న పిటిషన్లు దాఖల్యయాయి.
G.O No 1 Highcourt : జీవో నెంబర్-1పై హైకోర్టులో విచారణ మంగళవారానికి వాయిదా పడింది. జీవో నెంబర్-1పై మరికొన్ని పిటిషన్లు దాఖలయ్యాయి. బీజేపీ నేత కన్నా లక్ష్మినారాయణ కూడా ఇంప్లీడ్ పిటిషన్ దాఖు చేశారు. దీంతో పిటిషన్లపై మంగళవారం వాదనలు వినాలని సీజే బెంచ్ నిర్ణయించింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్భి రామకృష్ణ తరపున లాయర్ రాజు రామచంద్రన్ వాదనలు విన్పించారు. ఉదయం విచారణలో ప్రభుత్వ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టు ఇచ్చిన సస్పెన్షన్ ను ఎత్తివేయాలని అడ్వకేట్ జనరల్ కోరారు. ఈ విషయమై మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కూడా అడ్వకేట్ జనరల్ ఏపీ హైకోర్టును కోరారు.
రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం కల్గినప్పుడు తప్పనిసరిగా న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ తరపు న్యాయవాది రాజు రామచంద్రన్ హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. జీవో నెంబర్ 1 రాజ్యాంగ విరుద్దంగా ఉందని ఆయన వాదించారు. సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ ప్రకారంగా ఆమోదయోగ్యమైన ఆంక్షలు విధించవచ్చని ఆయన హైకోర్టు ముందు వాదనలు విన్పించారు. ఈ జీవో ప్రకారంగా రోడ్లపై ర్యాలీలు నిర్వహించకుండా నిషేధం విధించడం సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. రహదారులు ప్రజల అభిప్రాయాలను తెలిపేందుకు సహజ సిద్దమైన వేదికలని సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పులను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. వాదనల తర్వాత మధ్యాహ్నానికి విచారణ వాయిదా వేశారు. ఆ తర్వాత వాదనలు కొనసాగాయి. మరికొంత మంది పిటిషనర్లు వాదనలు వినిపించాల్సి ఉండటంతో మంగళవారానికి వాయిదా వేశారు.
జీవో నెంబర్ 1 ని సవాల్ చేస్తూ సీపీఐ ఏపీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఈ నెల 12వ తేదీన ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన ఏపీ హైకోర్టు వెకేషన్ బెంచ్ ఈ జీవోను సస్పెండ్ చేసింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఈ నెల 17వ తేదీన స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ఈ పిటిషన్ పై తాము జోక్యం చేసుకోలేమని తెలిపింది. స్టే ఎత్తివేసిందుకే సుప్రీంకోర్టు నిరాకరించింది. అంతేకాదు ఈ పిటిషన్ పై హైకోర్టు సీజే విచారణ చేయాలని కూడా ఆదేశించింది. ఆ ప్రకారం హైకోర్టు సీజే బెంచ్ విచారణ జరుపుతోంది.
ప్రతిపక్ష నేతలు పాదయాత్రలు చేయకుండా.., ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకోవడానికే ఈ జీవో తెచ్చారని విపక్ష నేతలు మండి పడుతున్నారు. అయితే ప్రభుత్వం మాత్రం.. విపక్ష నేతల సమావేశాల్లో తొక్కిసలాటలు జరుగుతున్నాయని ప్రజల ప్రాణాలు కాపాడటానికే తెచ్చామని వాదిస్తున్నారు. గతంలో హైకోర్టు ఇచ్చిన స్టే 23వ తేదీతో ముగిసింది. ఈ జీవో అంశంపై హైకోర్టు తీసుకునే నిర్ణయం కీలకం కానుంది. ఈ జీవో అమల్లో ఉంటే ఇక విపక్షాలపై పోలీసులు పూర్తి స్థాయి ఆధిపత్యం ప్రదర్శిస్తారని.. ఆంక్షలతో రోడ్డెక్కకుండా చేస్తారన్న ఆందోళన విపక్షాల్లో వ్యక్తమవుతోంది.