Thalliki Vandanam Scheme: తల్లికి వందనం డబ్బులు పడని వారికి ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్.. రూ. 325 కోట్లు విడుదల
Andhra Pradesh News | ఏపీ ప్రభుత్వం తల్లికి వందనం నగదు రాని లబ్దిదారులకు త్వరలోనే నగదు జమ చేయనుంది. ఫస్ట్ క్లాస్, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లుల ఖాతాల్లోనూ నగదు జమ చేయనున్నారు.

Thalliki Vandanam Scheme | అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న Thalliki Vandanam పథకానికి సంబంధించి మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే తొలి విడతలో లక్షల మంది తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం నగదు జమ అయినా, కొందరికి సాంకేతిక కారణాల వల్ల డబ్బులు అందలేదు. అలాంటి అర్హులైన లబ్ధిదారులను తిరిగి గుర్తించడంతో పాటు ఒకటో తరగతి, ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల తల్లులకు సైతం నగదు జమ చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించింది.
₹325 కోట్లు మంజూరు
తల్లికి వందనం పథకానికి సంబంధించి తాజాగా ఏపీ ప్రభుత్వం రూ.325 కోట్లను విడుదల చేయాలని నిర్ణయించింది. ఈ నిధులు అర్హులైన తల్లులు ఖాతాల్లో జమ చేయనున్నారు. ఈ మేరకు సంబంధిత శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. తల్లికి వందనం పథకం కోసం ఏపీ ప్రభుత్వం జూన్ నెలలో రూ.10,091 కోట్లు ఖర్చు చేసినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. ఇందులో రూ.1,346 కోట్లు పాఠశాలల అభివృద్ధికి కేటాయిస్తామని పేర్కొన్నారు. ఒక్కో విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం విద్యార్థుల తల్లులు, ఇతర సంరక్షకుల బ్యాంక్ ఖాతాల్లో రూ.13 వేలు జమ చేసింది. రూ.2 వేలను స్కూల్ డెవలప్‌మెంట్ కోసం వినియోగిస్తామని మార్గదర్శకాలలో తెలిపారు. ఇటీవల నగదు రాని లబ్ధిదారుల దరఖాస్తులను వార్డు, గ్రామ సచివాలయాల ద్వారా పరిశీలించి తుది జాబితా సిద్ధం చేశారు.
కొత్త విద్యార్థులకూ ప్రయోజనం
ఈ ఏడాది కొత్తగా స్కూల్‌లో చేరిన విద్యార్థులు కూడా తల్లికి వందనం పథకంలో భాగమయ్యారు. తొలి విడతలో 67.27 లక్షల మంది లబ్ధి పొందగా, రెండో విడతలో ఐదున్నర లక్షల 1వ తరగతి విద్యార్థులు, ఇంటర్ ఫస్టియర్‌లో చేరిన 4.7 లక్షల విద్యార్థులకు ఏపీ ప్రభుత్వం నిధులు జమ చేయనుంది.
ఈ వారం నుంచే ఖాతాల్లో డబ్బులు
ప్రస్తుతం అర్హుల తుది జాబితా సిద్ధం చేస్తోంది సర్కార్. ఈ వారం నుంచే లబ్ధిదారుల ఖాతాల్లో తల్లికి వందనం డబ్బులు ఒక్కో విద్యార్థికి రూ.13 వేలు చొప్పున తల్లుల ఖాతాల్లో జమకానున్నాయి. ఇంతవరకు డబ్బులు అందని అర్హులకూ ఈ విడతలో నిధులు అందే అవకాశం ఉంది.
అర్హుల జాబితాలో పేరు చెక్ చేసుకోండి..
అధికారిక వెబ్‌సైట్ https://gsws-nbm.ap.gov.in/ లో అర్హుల జాబితాలో మీ పేరు ఉందో, లేదో తెలుసుకోవచ్చు. వెబ్ సైట్‌లో Application Status Check పై క్లిక్ చేసిన తరువాత మీరు తల్లికి వందనం సెలక్ట్ చేసుకోవాలి. అనంతరం మీ ఆధార్ నెంబర్, క్యాప్చాను ఎంటర్ చేయాలి. గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీ మొబైల్ నంబర్‌కు ఓటీపీ (OTP) వస్తుంది. ఆ ఓటీపీని నమోదు చేసి సబ్మిట్ మీద క్లిక్ చేస్తే తల్లికి వందనం పథకం అర్హుల జాబితాలో మీ వివరాలు స్క్రీన్‌పై కనిపిస్తాయి.
విద్యా ప్రోత్సాహానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. Thalliki Vandanam పథకం ద్వారా సీఎం చంద్రబాబు ప్రభుత్వం విద్యను ప్రోత్సహిస్తూ, ప్రతి విద్యార్థి కుటుంబానికి ఆర్థిక సహాయం చేస్తూ వారిని చదువుకు దూరం కావొద్దనే లక్ష్యంతో ముందడుగు వేస్తోంది.






















