Andhra Metros: విశాఖ, విజయవాడ మెట్రోలకు ముందడుగు - శుక్రవారమే టెండర్లు!
Metro Rail: విశాఖ విజయవాడ మెట్రోలకు శుక్రవారం టెండర్లు పిలువనున్నారు. మొత్తం రూ.21,616 కోట్లతో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తారు.

Visakhapatnam Vijayawada Metro Tenders: విజయవాడ, విశాఖల్లో మెట్రోలకు టెండర్లు పిలిచేందుకు ప్రభుత్వం రెడీ అయింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల 50:50 భాగస్వామ్యంతో మెట్రో ప్రాజెక్టుల నిర్మాణాలను చేపట్టనున్నారు. విశాఖ మెట్రోకు రాష్ట్ర ప్రభుత్వ వాటాగా రూ.4,101 కోట్లు , విజయవాడ మెట్రోకు సీఆర్డీఏ నుంచి రూ. 3,497 కోట్లు ఇస్తారు. విశాఖ మెట్రోకు వీఎంఆర్డీఏ, విజయవాడ కు సీఆర్డీఏ నుంచి నిధులు కేటాయిస్తారు. మొత్తం రూ.21,616 కోట్లతో విశాఖ, విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టులకు టెండర్లు పిలుస్తారు. ఇందులో రూ.10,118 కోట్లతో విజయవాడ మెట్రో రైలు, రూ.11,498 కోట్లతో విశాఖ మెట్రో రైలుకు టెండర్లు పిలిచేందుకు సన్నాహాలు పూర్తి చేశారు.
విజయవాడ మెట్రో రైలు పొడవు మొత్తం 66.15 కిలోమీటర్లు, ఇందులో ఫేజ్-1 38.40 కిలోమీటర్లు, రెండు కారిడార్లుగా నిర్మిస్తున్నారు. గన్నవరం నుంచి పండిత్ నెహ్రూ బస్ స్టేషన్ (PNBS) వరకు 25.95 కి.మీ. ఓ కారిడార్, PNBS నుంచి పెనమలూరు వరకు 12.45 కి.మీ. రెండో కారిడార్ గా నిర్మిస్తారు. ఫేజ్-1లో మొత్తం 34 స్టేషన్లు, అన్నీ ఎలివేటెడ్‌గా ఉంటాయి 91 ఎకరాల భూమి అవసరం, దీని ఖర్చు రూ.1,152 కోట్లుగా అంచనా వేస్తున్నారు. విజయవాడలో 66 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మెట్రో రైలు నిర్మాణం జరుగుతుంది.
విశాఖపట్నం మెట్రో రైలు పొడవు* మొత్తం 76.90 కిలోమీటర్లు. ఫేజ్-1 46.23 కిలోమీటర్లు. మొత్తం మూడు కారిడార్లు ఉంటుంది. స్టీల్ ప్లాంట్ జంక్షన్ నుంచి కొమ్మాది జంక్షన్ వరకు 34.40 కి.మీ., 29 స్టేషన్లు మొదటి కారిడార్, గురుద్వారా నుంచి ఓల్డ్ పోస్ట్ ఆఫీస్ వరకు .08 కి.మీ., 6 స్టేషన్లు రెండో కారిడార్. తాటిచెట్లపాలెం నుంచి చిన్న వాల్తేర్ వరకు 6.75 కి.మీ., 7 స్టేషన్లు మూడో కారిడార్ గా ఉటుంది. 99.75 ఎకరాల భూమి అవసరం, దీని ఖర్చు రూ.882 కోట్లుగా అంచనా వేశారు. విశాఖపట్నంలో 76.90 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ మెట్రో రైలు నిర్మాణం జరుగుతుంది.
ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం మరియు 2017 మెట్రో పాలసీ ప్రకారం కేంద్రం నుంచి గణనీయమైన నిధులు అందుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు భావిస్తున్నారు. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (JICA), KfW, ఫ్రెంచ్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ (AFD), ఆసియన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ (AIIB) వంటి సంస్థల నుంచి నిధుల కోసం ఆంధ్రప్రదేశ్ మెట్రో రైలు కార్పొరేషన్ (APMRC) బోర్డు ప్రయత్నాలుచేస్తోంది. విజయవాడ , విశాఖపట్నం మెట్రో ప్రాజెక్టులు ఇంజనీరింగ్, ప్రొక్యూర్‌మెంట్, కన్స్ట్రక్షన్ (EPC) మోడల్‌లో అమలు చేస్తారు.
విశాఖపట్నం మెట్రో స్టేషన్లు అత్యాధునిక డిజైన్‌లతో, NFPA 130 ఫైర్ సేఫ్టీ నిబంధనలకు అనుగుణంగా నిర్మిస్తారు. స్టేషన్లలో ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లు, CCTV కెమెరాలు, X-రే బ్యాగేజ్ స్కానర్లు, ఫైర్ సేఫ్టీ సిస్టమ్‌లు, పబ్లిక్ డిస్‌ప్లే, అనౌన్స్‌మెంట్ సిస్టమ్‌లు ఉంటాయి. విశాఖపట్నం మెట్రో ప్రారంభం నాటికి రోజుకు 5-6 లక్షల మంది ప్రయాణికులను తీసుకెళ్లగలదు, మరియు 2054 నాటికి 20 లక్షలకు పైగా ప్రయాణికులను సేవించగల సామర్థ్యం ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మెట్రో ప్రాజెక్టులు విజయవాడ , విశాఖపట్నం నగరాలను ఆధునిక పట్టణ రవాణా కేంద్రాలుగా మారుస్తాయి.





















