Breaking News: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల తేదీ ఖరారు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 9న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
అన్ని పథకాల కింద ముఖ్యమంత్రి డబ్బు ఇస్తున్నారు కానీ, తాగేందుకు డబ్బు ఇవ్వడం లేదని ఏపీ కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం అన్నారు. ఈ తాగేవాడిని మనం మార్చలేమన్న ఆయన.. తన దురదృష్టం ఏమిటంటే తన నియోజకవర్గం కర్ణాటక సరిహద్దులో ఉందని తెలిపాలు. అర కిలోమీటరు దూరంలో ఉన్న అక్కడి నుంచి మద్యం తెచ్చుకుని తాగుతున్నారన్నారు. మద్యం ఏరులై పారుతోంది అంటే తానేం చేయాలని ప్రశ్నించారు. బుధవారం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను కలిశారు.
ట్యాక్స్ పేయర్స్‌కు గుడ్ న్యూస్
ట్యాక్స్ పేయర్స్‌కు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. ఆదాయ పన్ను రిటర్నుల దాఖలుకు గడువును పెంచింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు (సీబీడీటీ) పన్ను చెల్లింపుదారులకు కీలక ప్రకటన చేసింది. 2021-22 మదింపు సంవత్సరానికి ఆదాయపు పన్ను రిటర్ను దాఖలు చేసేందుకు గడువును పొడిగించింది. ఐటీఆర్ దాఖలు చేయడానికి డిసెంబర్ 31వ తేదీ వరకు అవకాశం కల్పిస్తున్నట్టు సీబీడీటీ గురువారం ప్రకటించింది.
హైదరాబాద్ చేరుకున్న సీఎం కేసీఆర్
ఢిల్లీ పర్యటన ముగించుకుని ఇవాళ హైదరాబాద్‌కు చేరుకున్న ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావుకు బేగంపేట విమానాశ్రయంలో రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ స్వాగతం పలికారు. సీఎం కేసీఆర్ దాదాపు 10 రోజులుగా ఢిల్లీలో ఉన్న సంగతి తెలిసిందే. పార్టీ ఆఫీసు భవన శంకుస్థాపనకు వెళ్లిన సీఎం.. ప్రధాని మోదీ సహా పలువురు కేంద్ర మంత్రులను కలిశారు.
తెలంగాణలో కొత్తగా 315 పాజిటివ్ కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గత 24 గంటల్లో 75,199 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 315 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 6,60,786కి చేరింది. నిన్న కరోనాతో ఇద్దరు మృతి చెందగా.. మొత్తం మృతుల సంఖ్య 3,891కి చేరింది. కరోనాబారి నుంచి బుధవారం 340 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 5,470 యాక్టివ్ కేసులు ఉన్నట్లుగా బులెటిన్‌లో పేర్కొన్నారు.
22 నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు
తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 22 నుంచి వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి ఉత్తర్వు విడుదల చేశారు. అసెంబ్లీ సమావేశాల కంటే ముందు తెలంగాణ మంత్రివర్గం భేటీ కానుంది. 10 రోజులపాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై ఒకటి లేదా రెండు రోజుల్లో గవర్నర్ తమిళసైను ముఖ్యమంత్రి కేసీఆర్ కలవనున్నారు. అసెంబ్లీ సమావేశాలు, తాజా రాజకీయ పరిస్థితులపై గవర్నర్‌తో కేసీఆర్ చర్చించనున్నారు.
కృష్ణా బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ
కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు (కేఆర్ఎంబీ) తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ రాసింది. బోర్డు ఛైర్మన్‌కు నీటిపారుదల శాఖ ఈఎన్‌సీ మురళీధర్ లేఖ రాశారు. పోతిరెడ్డిపాడు, శ్రీశైలం కుడి కాలువ ద్వారా ఏపీకి వెళ్తున్న నీటి విషయంలో ఆయన లేఖ రాశారు. శ్రీశైలంలో 880 అడుగుల పైన నీటి నిల్వ ఉన్నప్పుడు ఏపీ 34 టీఎంసీలే తీసుకోవాలని లేఖలో ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ 34 టీఎంసీలకు మించి నీరు తీసుకోకుండా చూడాలని ఈఎన్‌సీ కోరింది. ఏపీ చేపట్టిన అన్ని ప్రాజెక్టులను గెజిట్‌లో చేర్చాలని ఈఎన్‌సీ లేఖలో పేర్కొంది. ప్రాజెక్టుల పనులను గెజిట్ రెండో షెడ్యూల్‌లో చేర్చాలని కోరింది.