News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Breaking News 26 September: రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా సెప్టెంబరు 26న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

FOLLOW US: 
భారత్ బంద్‌కు మద్దతు తెలపడం లేదు.. తెలంగాణ జనసేన క్లారిటీ

భారత్ బంద్‌కు మద్దతివ్వడం లేదని జనసేన తెలంగాణ నాయకులు స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇంఛార్జ్ శంకర్ గౌడ్, రాష్ట్ర నేత రామ్ తళ్లూరి సూచనల మేరకు జనసేన పార్టీ రేపు జరగనున్న భారత్ బంద్‌కు మద్దతు తెలపడం లేదు. పోడు రైతుల భూముల గురించి జనసేన పార్టీ పోరాటం చేస్తుందని గమనించాలని జనసేన నేతలు కోరారు. ఈ మేరకు ట్వీట్ ద్వారా భారత్ బంద్‌కు మద్దతు లేదని పేర్కొన్నారు.

రేపు పాఠశాలలకు సెలవు ప్రకటించిన ప్రభుత్వం

భారత్ బంద్ కారణంగా రేపు పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ అధికారులకు మంత్రి సురేశ్‌ ఆదేశాలు జారీ చేసింది. రేపటి సెలవుకు ప్రత్యామ్నాయంగా మరోరోజు స్కూల్ ఉంటుదని తెలిపింది. భారత్‌బంద్‌కు మద్దతివ్వాలన్న ఉపాధ్యాయ సంఘాల సూచనతో సెలవు ఇచ్చినట్లు మంత్రి తెలిపారు. 

సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా నియామకం

ఏపీ సీఎస్ ఆదిత్యనాథ్‌ దాస్‌ను రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నెల 30వ తేదీన ఆయన ఉద్యోగ విరమణ చేయనున్నారు. అనంతరం ప్రభుత్వ ముఖ్య సలహాదారుగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. ముఖ్య సలహాదారుగా నియమితులైన ఆదిత్యనాథ్ దాస్ కు కేబినెట్ మంత్రి హోదా కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది.  

తెలంగాణలో కొత్తగా 170 కోవిడ్‌ కేసులు

తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 170 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. మొత్తం 34,200 మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా ఈ మేరకు వెల్లడైందని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటివరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 6,65,068కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో ఎవరూ కరోనాతో చనిపోలేదని వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. నిన్న ఒక్కరోజు వ్యవధిలో 259 మంది కోవిడ్ బారి నుంచి కోలుకున్నారు. దీంతో రికవరీల సంఖ్య 6,56,544కి పెరిగింది. ప్రస్తుతం రాష్ట్రంలో 4,612 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 

భార్య, అత్తపై అల్లుడు హత్యాయత్నం.. ఇద్దరికీ తీవ్ర గాయాలు

భార్య, అత్తపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన చిత్తూరు జిల్లా మదనపల్లి మండలంలోని ఆరోగ్యవరం ఐదోవ మైలు కాలనీలో చోటు చేసుకుంది. అనంతపురం జిల్లా కదిరి తాలూకా దొన్నికోటలో ఉంటున్న ఆటో డ్రైవర్ రామరాజు మదనపల్లి మండలం ఆరోగ్యవరం(శానిటోరియం) ఐదు మైళ్ళ కాలనీలో ఉంటున్న అత్త ప్రసన్నకుమారి(50), భార్య వందన(32)లతో ఆదివారం గొడవపడ్డాడు. మాట మాట పెరిగి వెంట తెచ్చుకున్న కత్తితో భార్యపై రామరాజు కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన క్షతగాత్రులను స్థానికులు 108లో జిల్లా ఆస్పత్రికి తరలించగా ప్రథమ చికిత్స అనంతరం వారిని తిరుపతికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 

ఏపీలో పవన్ పర్యటన వాయిదా

జనసేన అధినేత అమరావతి పర్యటన వాయిదా వేసుకున్నారు. 27, 28 తేదీల్లో అమరావతిలో పర్యటిస్తానని పవన్ ముందుగా ప్రకటించారు. కానీ తాజాగా ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు. 

రేపు యథాతథంగా బస్సులు: టీఎస్ఆర్టీసీ

తెలంగాణలో రేపు (సెప్టెంబర్ 27) బస్సు సర్వీసులు యథాతథంగా నడుస్తాయని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రకటించింది. కేవలం తెలంగాణ పరిధిలోనే కాకుండా ఇతర రాష్ట్రలకు వెళ్లే సర్వీసులను సైతం నిలిపివేయడం లేదని స్పష్టం చేసింది. 

ఏపీలో కొత్తగా 1184 కరోనా కేసులు, 11 మరణాలు

ఏపీలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,184 కరోనా కేసులు, 11 మరణాలు నమోదయ్యాయి. కరోనా నుంచి 1,333 మంది బాధితులు కోలుకున్నారు. ప్రస్తుతం 13,048 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. గడిచిన 24 గంటల్లో 58,545 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. కరోనాతో చిత్తూరు జిల్లాలో మరో ముగ్గురు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో ఇద్దరు చొప్పున మృతి చెందారు. 

పవన్ వ్యాఖ్యలపై మంత్రి పేర్ని నాని కౌంటర్... క్షమాపణ చెప్పాలని డిమాండ్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఏపీ మంత్రి పేర్ని నాని కౌంటర్ ఇచ్చారు. సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని పవన్ మాట్లాడుతున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి, మంత్రులపై చేసిన పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని, క్షమాపణ చెప్పాలని మంత్రి పేర్ని నాని డిమాండ్ చేశారు. ఆయన మానసిక స్థితిపై అనుమానం కలుగుతోందన్నారు. పవన్ కల్యాణ్ తన వ్యాఖ్యల ద్వారా పలుచనైపోతున్నారన్నారు. సినిమా వేదికను రాజకీయ వేదికగా మార్చారన్నారు. ఒక పార్టీ అధినేత ఇలా మాట్లాడితే క్రింది స్థాయి నాయకులు, కార్యకర్తలు ఎలా ప్రవర్తిస్తారన్నారు. పార్టీని నడపాలంటే ఓర్పు, సహనం, ఉండాలన్నారు మంత్రి నాని. బుద్ధుడు గురించి మాట్లాడే పవన్ కల్యాణ్ పదిరోజులు ధ్యాన కేంద్రంలో గడిపితే మంచిదని ఎద్దేవా చేశారు. విమర్శలు సహేతుకంగా ఉండాలి కానీ వ్యక్తిగతంగా చేస్తే ఊరుకోమని పేర్ని నాన్ని అన్నారు.   

పలాస-టెక్కలి నియోజకవర్గాల మధ్య తీరం దాటనున్న గులాబ్ తుపాను

నేటి సాయంత్రం, రాత్రి సమయానికి గులాబ్ తుపాను పలాస-టెక్కలి నియోజకవర్గాల మధ్య  తీరం దాటనుందని మంత్రి సీదిరి అప్పలరాజు తెలిపారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తరుఫున, ప్రభుత్వం తరఫున ఆ ప్రాంతాల ప్రజలను ఆయన అప్రమత్తం చేశారు. అక్కడక్కడా ఎలక్ట్రికల్ పోల్స్ పడిపోయే అవకాశం ఉందన్నారు. డిజాస్టర్ రిలీఫ్ టీమ్స్, అధికారులు అందుబాటులో ఉన్నారు. తాగునీరు సైతం ముందస్తుగా సిద్ధం చేశామని తెలిపారు. వ్యవసాయశాఖ అధికారులను అప్రమత్తం చేశామని, 60 నుంచి 70 మిల్లీ మీటర్ల వర్షాపాతం కురిసే అవకాశం ఉందన్నారు. తడిగా ఉన్న కరెంట్ స్తంబాలను తాకకూడదని ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలకు ఏమైనా సమస్య ఉంటే స్థానిక నేతలకు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్ లకు తెలపాలని సూచించారు.

యాదాద్రికి పోటెత్తిన భక్తజనం..

యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం సెలవు దినం కావడంతో స్వామి వారి ఆలయానికి భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. స్వామి వారి ధర్మ దర్శనానికి 2 గంటల సమయం, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి గంట సమయం పడుతుంది. అభివృద్ధి పనులు దృష్ట్యా కొండ పైకి వాహనాలను అనుమతించడం లేదు. 

దసరా తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణలు: సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ

దసరా తర్వాత కోర్టుల్లో ప్రత్యక్ష విచారణ ప్రారంభిస్తామని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ తెలిపారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు మహిళా న్యాయవాదుల ఆధ్వర్యంలో ఆదివారం దిల్లీలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీజేఐ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రత్యక్ష విచారణతో న్యాయమూర్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదని సీజేఐ జస్టిస్ రమణ అన్నారు. న్యాయవాదులకే కొన్ని ఇబ్బందులుంటాయన్నారు. లా కళాశాలల్లో మహిళకు రిజర్వేషన్లు కల్పించాలన్నారు. మహిళలకు సంబంధించిన న్యాయపరమైన డిమాండ్లకు మద్దతు ఉంటుందని జస్టిస్ రమణ అన్నారు. 

ఇండస్ట్రీ సమస్యలపై పవన్ కల్యాణ్ జెన్యూన్‌గా మాట్లాడారు: నాని

సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించిన రిపబ్లిక్ సినిమా ప్రీ రిలిజ్ ఈవెంట్ లో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ఏపీ ప్రభుత్వంపై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. అయితే సినీ ఇండస్ట్రీ నుంచి మెుదట ఒక్కరూ స్పందించలేదు. తాజాగా హీరో నాని రియాక్ట్ అయ్యాడు. పవన్ కళ్యాణ్ సర్‌కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య రాజకీయ విబేధాలు ఎలా ఉన్నా కూడా వాటిని పక్కన పెట్టేస్తే..ఆయన సినిమా పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యల గురించి కరెక్ట్ మాట్లాడారు. దానిపై అందరూ దృష్టి పెట్టండి.. సినిమా సభ్యుడిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారిని, సంబంధిత మంత్రులను పరిశ్రమను కాపాడమని కోరుతున్నాను అని నాని ట్వీట్ వేశాడు.

జమ్ము కశ్మీర్‌లో ఎదురు కాల్పులు, ఇద్దరు ఉగ్రవాదులు హతం

జమ్ముకశ్మీర్‌లోని బందీపోరాలో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు గుర్తుతెలియని ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని జమ్ము కశ్మీర్ పోలీసులు వెల్లడించారు. ఆ ప్రాంతంలో ఉగ్రవాదులు ఉన్నారనే సమాచారంతో భద్రతా దళాలు గాలింపు చేపట్టాయి. ఈ క్రమంలో ఉగ్రవాదులు గాలింపు బృందాలపై కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. చనిపోయిన ఉగ్రవాదులు ఏ సంస్థకు చెందినవారనే విషయం ఇంకా తెలియరాలేదని, వారి నుంచి ఆయుధాలు, మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు వెల్లడించారు. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని వెల్లడించారు. 

సీఎంలతో అమిత్ షా భేటీ ప్రారంభం

మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా అధ్యక్షతన భేటీ ప్రారంభం అయింది. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో జరగాల్సిన అభివృద్ధి సమస్యలపై సమావేశం చర్చించనున్నారు. ఈ సమావేశానికి సీఎం కేసీఆర్ హాజరు కాగా.. ఏపీ, పశ్చిమ బెంగాల్ సీఎంలు గైర్హాజరయ్యారు. అనారోగ్య కారణంతో సీఎం జగన్ సమావేశానికి దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏపీ నుంచి డీజీపీ, హోం మంత్రి సుచరిత హాజరయ్యారు. 

అలా చేసే ఎన్నికలకు వెళ్తా : మంత్రి అనిల్

2024 ఎన్నికలకు వెళ్లే ముందు నెల్లూరు నగర నియోజకవర్గానికి ఏమేం చేశానో ప్రజలకు చెప్పి మరీ ఓట్లు అడుగుతానని అన్నారు మంత్రి అనిల్ కుమార్ యాదవ్. తాను చేసిన మంచే తనకు ఆశీర్వాదం అని అన్నారాయన. నెల్లూరు నగర నియోజకవర్గంలో నవంబర్ నాటికి 550 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేపట్టబోతున్నట్టు చెప్పారు. 70 లక్షల రూపాయలతో   తిక్కన పార్క్ ఆధునీకరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. సఫాయి మిత్రలో నెల్లూరు కార్పొరేషన్ మొదటి స్థానంలో రావడం అభినందనీయమన్నారు. రానున్న రోజుల్లో కార్పొరేషన్ ను అన్ని విధాల అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వత పనులనే తాము చేపడుతున్నట్లు వెల్లడించారు. తమ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను ప్రజలకు తెలిపే 2024 ఎన్నికల్లో ముందుకు వెళ్తానన్నారు.

Background

రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో కొత్త వారికి చోటు ఉంటుందని విద్యుత్తు శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలిపారు. శనివారం ఒంగోలులో జడ్పీ అధ్యక్ష, ఉపాధ్యక్ష ఎన్నిక అనంతరం జరిగిన సభలో మాట్లాడుతూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి మంత్రివర్గాన్ని వంద శాతం మార్చాలనుకుంటున్నట్లు చెప్పారని తెలిపారు. పార్టీ విధానపరమైన నిర్ణయమైతే కచ్చితంగా మార్చాలని.. నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పినట్లు బాలినేని వెల్లడించారు.