AP Land Titling Act: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జగన్ చేసిన కుట్ర ఇదే - టీడీపీ సంచలన పోస్ట్ వైరల్
Andhra Pradesh Land Titling act: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మంట పెడుతోన్న ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ మరో సంచలన విషయాన్ని వెల్లడించింది.
TDP Post on AP Land Titling Act: అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో అధికార వైసీపీ, ప్రతిపక్షాల మధ్య ఆరోపణలు, విమర్శలకు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కేంద్రంగా మారింది. పింఛన్ వివాదం తరువాత గత కొన్ని రోజులనుంచి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఏపీ రాజకీయాల్లో దుమారం రేపుతోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌ను తాము ఎందుకు వ్యతిరేకిస్తున్నారో.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై జగన్ చేసిన కుట్ర ఇదేనంటూ తెలుగు దేశం పార్టీ ఎక్స్ లో చేసిన ఓ పోస్టుతో స్పష్టత ఇచ్చింది. చంద్రబాబును అక్రమంగా అరెస్ట్ చేసిన సమయంలోనే జగన్ కుతంత్రం అమలు చేశారని టీడీపీ ఆరోపించింది.
పాత గెజిట్‌లో ఏముంది, కొత్త గెజిట్ లో మార్పుపై టీడీపీ ట్వీట్
21 సెప్టెంబర్ 2022న విడుదల చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెజిట్ లో టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా "Any officer" అని ఉంది. అంటే ఓ ప్రభుత్వ అధికారి భూమి విషయంలో టైటిల్ రిజిస్ట్రేషన్ అధికారికా వ్యవహరించనున్నారు. కానీ 17 అక్టోబర్ 2023న ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గెజిట్ నోటిఫికేషన్ లో గతంలో ఇచ్చిన "Any officer" అనే విషయాన్ని "Any Person" గా మార్చారు. అంటే గత నోటిఫికేషన్ ప్రకారం ఓ ప్రభుత్వ అధికారి టీఆర్వో(TRO) గా వ్యవహరిస్తే, కొత్త గెజిట్ ప్రకారం ఏ వ్యక్తి అయినా టీఆర్వోగా పనిచేయవచ్చు. అంటే, టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO)గా వైసీపీ నేతలని పెట్టి, మన భూములు, ఇళ్లు లాగేసుకునేందుకు భయంకరమైన కుట్ర పన్నారని టీడీపీ ఆరోపించింది. రాష్ట్ర ప్రజలు ఎవరికీ తెలియకుండా గుట్టు చప్పుడు కాకుండా జగన్ రెడ్డి ఇలా మార్చేశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు టీడీపీ అధికారిక ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది.
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై బయట పడిన జగన్ రెడ్డి కుట్ర.
— Telugu Desam Party (@JaiTDP) May 6, 2024
చంద్రబాబు గారిని అక్రమ అరెస్ట్ చేసిన సమయంలోనే జగన్ కుతంత్రం అమలు.
సెప్టెంబర్ 2022 గెజిట్‌లో , టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్‌గా ఉన్న "Any officer" అంటే ' ప్రభుత్వ అధికారి'ని, అక్టోబర్ 2023లో గెజిట్ సవరించి, "Any Person" అంటే… pic.twitter.com/Fsm6rXfXGM
ఫ్యాన్‌కు ఓటేయవద్దని కూటమి నేతల ప్రచారం..
అయిదేళ్లు అధికారం ఇస్తే జగన్ ఏపీని సర్వనాశనం చేశారని కూటమి నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఆరోపిస్తున్నారు. ఫ్యాన్ కు మళ్లీ ఓటేస్తే ఏపీలో ప్రజల భూముల్ని సీఎం జగన్ దోచుకుంటారని, వైసీపీ నేతలే భూమల్ని రిజిస్ట్రేషన్ చేస్తారని ఆరోపించారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను తాము వ్యతిరేకించడం లేదని, కానీ ఏపీ ప్రభుత్వం ఆ చట్టంలో చేసిన మార్పుల కారణంగా వ్యతిరేకించినట్లు టీడీపీ నేతలు చెబుతున్నారు. ప్రజల భూముల్ని ఎవరైనా అధికారి రిజిస్ట్రేషన్ చేయాలి కానీ, జగన్ ప్రభుత్వం తెచ్చిన కొత్త గెజిట్ ప్రకారం.. ఏ వ్యక్తి అయినా టీఆర్వోగా వ్యవహరించి భూముల్ని సొంతం చేసుకునే వీలుందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు.
ప్రజల భూముల్ని దోచుకోవడం కాదు, హక్కు కల్పించడం: జగన్..
బ్రిటీష్ కాలంలో చేసిన చట్టాలే అమల్లో ఉన్నాయని, తాజాగా సర్వే చేసి భూముల అసలు హక్కుదారులకు భూమి ఇవ్వడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉద్దేశమని ఏపీ సీఎం జగన్, వైసీపీ నేతలు చెబుతున్నారు. కూటమి నేతలు ప్రచారం చేసినట్లుగా ప్రజల భూముల్ని దోచుకోవడం జరగదని, వాస్తవ హక్కుదారుకు భూమి వచ్చేలా చేస్తామని పలు సభలలో సీఎం జగన్ ప్రస్తావించారు.