Kodali Nani Vs TDP : కొడాలి నానిపై చర్యలు తీసుకోండి - పోలీసులకు టీడీపీ నేతల ఫిర్యాదు !
కొడాలి నానిపై చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. చంద్రబాబు, లోకేష్‌పై ఆయన అనుచితమైన భాష వాడారని మండిపడ్డారు.
Kodali Nani Vs TDP : మాజీ మంత్రి కొడాలి నాని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేష్‌లపై అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయనపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ నేతలు తాడేపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దేవినేని ఉమ,గద్దె రాంమోహన్, బుద్ధా వెంకన్న, వర్ల రామయ్య, విజయవాడ పార్లమెంట్ ఇంచార్జి నెట్టెం రఘురాం అందరూ వెళ్లి ఫిర్యాదు పత్రం అందించాలు. అలాగే నాని చేసిన వ్యాఖ్యల సీడీని కూడా అందించారు. చంద్రబాబుతో పాటు ఆయన తల్లిదండ్రులు, కుటుంబంపైనా కొడాని నాని దారుణమైన వ్యాఖ్యలు చేశారని టీడీపీ నేతలంటున్నారు. కొడాలి నాని భాష వల్ల గుడివాడ ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని.. తమది గుడివాడ అని చెప్పుకోలేని స్థితికి ప్రజలు వెళ్లారని టీడీపీ నేతలంటున్నారు.
తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ గార్ల గురించి అనుచిత వ్యాఖ్యలు చేసిన వైసీపీ బూతు నేత కొడాలి నాని పై చర్యలు తీసుకోవాలని కోరుతూ తాడేపల్లి పోలీస్ స్టేషన్ లో తెలుగుదేశం సీనియర్ నేతలు ఫిర్యాదు చేసారు.(1/2) pic.twitter.com/pHPaO4ctUC
— Telugu Desam Party (@JaiTDP) September 10, 2022
రాజకీయ విమర్శలంటే చంద్రబాబు కుటుంబంపై వ్యక్తిగత విమర్శలన్నట్లుగా కొడాలి నాని దాడి
కొడాలి నాని మంత్రిగా ఉన్నప్పటి నుండి రాజకీయ విమర్శలు అంటే చంద్రబాబును, ఆయన కుటుంబాన్ని వ్యక్తిగతంగా దూషించడమే అన్నట్లుగా మాట్లాడుతూంటారు. పలువురు నుంచి అలాంటి భాష సరి కాదని విమర్శలొచ్చినప్పటికీ తగ్గలేదు. వైఎస్‌ఆర్‌సీపీ హైకమాండ్ కూడా ఆయనను కంట్రోల్ చేయలేదు. దీంతో కొడాలి నాని ప్రెస్ మీట్లలో అసభ్యమైన భాష అసువుగా వస్తూ ఉంటుంది. ఆయన అలా మాట్లాడుతున్నారని టీడీపీ నేతలు కూడా ఆయనపై అదే విధంగా మాటల దాడి చేస్తూంటారు. ఈ క్రమంలో కుటుంబాలనూ టార్గెట్ చేసుకుంటూ ఉంటారు. ఈ అంశంపై దుమారం రేగినా నేతలు మారం లేదు.
అసభ్యకరమైన తిట్లే రాజకీయ విమర్శలుగా ఏపీలో చెలామణి
ఏపీలో నేతల తీరు వల్ల రాజకీయ విమర్శలంటే కుటుంబాలను తిట్టుకోవడమేనన్న అభిప్రాయం ఏర్పడుతోంది. సామాన్యుల నుంచి సైతం తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నప్పటికీ నేతలు తమ తీరు మార్చుకోవడం లేదు. సర్ది చెప్పాల్సిన హైకమాండ్ పెద్దలు కూడా సమర్థిస్తున్నట్లుగా ఉండటంతోనే ఇలాంటి సమస్య పెరిగిపోతోందన్న అభిప్రాయం రాజకీయ విశ్లేషకుల్లో వినిపిస్తోంది. ఒకరిని అంటే మరొకరు అదే స్థాయిలో రిప్లయ్ ఇస్తారు.. ఇలా కౌంటర్లు ఇచ్చుకోవడం వల్ల బూతుల దాడి పెరిగి పోతోందే తప్ప కంట్రోల్ కావడం లేదు. ఈ పరిస్థితిని అర్థం చేసుకుని రాజకీయ నేతలే స్వీయ నియంత్రణ పాటించాలన్న అభిప్రాయం సామాన్యుల్లో వ్యక్తమవుతోంది.
రెండు నెలల్లో సీపీఎస్ సమస్యకు పరిష్కారం - ఉద్యోగులకు మంత్రి బొత్స హామీ !