AP Farmers: కోట్ల రూపాయలు కుమ్మరిస్తే రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయి- ఏపీ సర్కార్ కు యనమల ప్రశ్న
Farmers Day in AP: రైతుల కోసం కోట్ల రూపాయలు కుమ్మరిస్తే ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయో చెప్పాలని శాసన మండలి ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు ఏపీ సర్కార్ ను డిమాండ్ చేశారు.
Farmers Day in AP: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నాలుగు సంవత్సరాల పాలనలో రైతుల కోసం కోట్ల రూపాయలు కుమ్మరిస్తే ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయో చెప్పాలని శాసన మండలి ప్రతిపక్ష నేత, తెలుగు దేశం పాలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు ఏపీ సర్కార్ ను డిమాండ్ చేశారు.
రైతు దినోత్సవంపై తెలుగుదేశం ఫైర్...
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గడిచిన నాలుగు సంవత్సరాల పాలనలో రూ 1,70,769 కోట్లు ఇస్తే రైతుల ఆత్మహత్యలు ఎందుకు పెరిగాయని శాసన మండలి ప్రతిపక్ష నేత, తెలుగు దేశం నేత యనమల రామకృష్ణుడు ప్రశ్నించారు. అప్పుల్లో ఆంధ్రప్రదేశ్ రైతులెందుకు కూరుకు పోయారో చెప్పాలన్నారు. నాలుగు లక్షల టన్నుల ఆహార ధాన్యాల ఉత్పత్తి తగ్గడం జగన్ ప్రభుత్వ వైఫల్యం కాదా అని యనమల అన్నారు. ధాన్యం ఉత్పాదకత 316 కిలోలు తగ్గడమేనా జగన్ ఘనతగా చెప్పుకుంటారా అని ఎద్దేవా చేశారు. వేరుశనగ ఉత్పాదకత 187 కిలోలు తగ్గడం ఎవరి వైఫల్యమో అందరికి తెలిసిందేనని అన్నారు. వ్యవసాయ వృద్ది సగానికి దిగజార్చారని, ఆక్వా కల్చర్ వృద్ది 3వ వంతు పతనం అయ్యిందని ఆయన వ్యాఖ్యానించారు.
ఫెయిల్యూర్ సీఎం జగన్...
భారత దేశంలోనే ఫెయిల్యూర్ సీఎం జగన్మోహన్ రెడ్డి అని యనమల రామకృష్ణుడు వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ లో అబద్దాల రేస్ నడుస్తోందని వ్యంగాస్త్రాలు సంధించారు. ముఖ్యమంత్రి జగన్, మంత్రులు, అధికారుల మధ్య పోటీ నడుస్తుందని ఆయన అన్నారు. .జగన్మోహన్ రెడ్డి ఆడే అబద్దాలకు అంతే లేదని, అంతటితో సరిపెట్టుకోకుండా, అటు మంత్రులతో చెప్పించడం, చివరికి ఉన్నతాధికారులతోనూ అబద్దాలే చెప్పించడం గర్హనీయమన్నారు.
ప్రజా ధనం దుర్వినియోగం...
మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి జయంతి పేరుతో రైతు దినోత్సవం నిర్వహిస్తూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం దారుణమని యనమల అన్నారు. జయంతి ముసుగులో సొంత పత్రికకు రెండు పేజీల యాడ్స్ ఇవ్వడం మరో అరాచకమని అన్నారు. రాష్ట్రంలో ఎన్నడూ లేనంత కష్టాల్లో రైతాగం ఉందని, పండిన పంటకు ధర లేక, అమ్మితే ఖాతాల్లో డబ్బులు పడటం లేదన్నారు. సకాలంలో మార్కెట్ సదుపాయం కల్పించం లేదని, ఇన్ పుట్ సబ్సిడీ కి దిక్కులేదన్నారు. విపత్తు సాయం లేకపోగా, పంట బీమా కూడా కనుమరుగు అయ్యిందని, డ్రిప్ సబ్సిడీ ఎగ్గొట్టారని యనమల మండిపడ్డారు. ప్రభుత్వ పరంగా రైతులను ఆదుకుంది శూన్యమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత 4ఏళ్లలో అప్పుల్లో రైతాంగం కూరుకుపోయిందని, దేశంలోనే రైతు ఆత్మహత్యల్లో 3వ స్థానం, కౌలు రైతుల ఆత్మహత్యల్లో 2వ స్థానంలో మన రాష్ట్రం ఉందన్నారు. ఒక్కో రైతు నెత్తిన రూ 2.75 లక్షల అప్పుమోపారని, అయితే రైతులను ఉద్దరించినట్లుగా ప్రకటనలు ఇచ్చుకోవటం ఏంటని ప్రశ్నించారు. యాడ్స్ కు వందల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేయటం సిగ్గుచేటని, అన్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్రకటనల్లో అన్ని అసత్యాలేనని ఆయన విమర్శించారు. రైతులను ఉద్దరించామని చెబుతున్న సర్కార్, ఆహారధాన్యాల ఉత్పత్తిలో ఎందు పతనమైందో చెప్పాలన్నారు. 2017-18 లో ఆహార ధాన్యాల ఉత్పత్తి 167లక్షల టన్నులుంటే, 2022-23నాటికి 163.32 లక్షల టన్నులకు పడిపోయిందని చెప్పారు.