(Source: ECI/ABP News/ABP Majha)
Vijay CID : ఎఫ్ఐఆర్‌లో పేరు లేకుండానే సీఐడీ నోటీసులు - హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన చింతకాయల విజయ్ !
సీఐడీ తప్పుడు కేసు పెట్టిందని టీడీపీ నేత చింతకాయల విజయ్ హైకోర్టును ఆశ్రయించారు. ఎఫ్ఐఆర్‌లో విజయ్ పేరు లేదని ఆయన తరపు లాయర్లు చెబుతున్నారు.
Vijay CID : తెలుగుదేశం పార్టీ యువనేత చింతకాయల విజయ్ .. ఏపీ సీఐడీ తనపై నమోదు చేసిన కేసును క్వాష్ చేయాలని హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. ఏపీ సీఐడీ అధికారులు తనకు ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వలేదని.. అసలు ఎఫ్ఐఆర్ కాపీలో తన పేరు లేదన్నారు. ఎఫ్ఐఆర్‌లో తన పేరు లేకపోయినా పదుల సంఖ్యలో సీఐడీ పోలీసులు తన ఇంటికి వచ్చి అలజడి రేపారన్నారు. చిన్న పిల్లల్ని బెదిరించారన్నారు. సీఐడీ అధికారులపై చర్యలు తీసుకోవాలని విజయ్ తరపు న్యాయవాదులు కోరారు. ఈ లంచ్ మోషన్ పిటిషన్ మంగళవారం హైకోర్టులో విచారణకు వచ్చే అవకాశం ఉంది.
భారతీ పే పేరుతో సీఎం జగన్ సతీమణి భారతి ఫోటో పెట్టి క్యూ ఆర్ కోడ్ తయారు చేశారని.. దాన్ని ఐ టీడీపీ నుంచే సర్క్యూలేట్ చేశారని సీఐడీ కేసు నమోదు చేసింది. ఐ టీడీపీ అధ్యక్షుడు అయిన చింతకాయల విజయ్‌కు విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని ఆయన ఇంటికి ఏపీసీఐడీ పోలీసులు వెళ్లడం రాజకీయ దుమారానికి కారణంగా అయింది. హైదరాబాద్‌లోని ఓ అపార్టుమెంట్‌లో విజయ్ కుటుంబం నివసిస్తోంది. ఏపీసీఐడీ అధికారుల బృందం ఉదయం వారింటికి వెళ్లింది. ఆ సమయంలో చింతకాయల విజయ్ ఇంట్లో లేరు. పనిమనిషులతో పాటు చిన్న పిల్లలు ఉన్నారు. అయితే వారినే సీఐడీ అధికారులు ప్రశ్నించారని.. ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించారని ఆరోపణలు వచ్చాయి. అయితే ఆరో తేదీన విచారణకు హాజరు కావాలని పని మనిషికి నోటీసులు ఇచ్చి సీఐడీ అధికారులు వెళ్లిపోయారు.
అయితే ఆరో తేదీన విజయ్ సీఐడీ విచారణకు హాజరు కాలేదు. విజయ్ తరపున వచ్చిన న్యాయవాదులు తాము తీసుకొచ్చిన లేఖను అందించే ప్రయత్నం చేసారు. అధికారులకు నేరుగా లేఖ ఇచ్చేందుకు విజయ్ తరపు న్యాయవాదులు చాలా సేవు వేచి చూసారు. కానీ, స్పందన రాలేదు. దీంతో.. తపాలా విభాగంలో ఆ లేఖ ఇచ్చి వెళ్లిపోయారు. సీఐడీ పోలీసులు విజయ్ నివాసంలో ఇచ్చిన నోటీసు చెల్లదని ఆయన తరపు న్యాయవాదులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులకు కాకుండా, పనిమనిషిలకు ఇస్తే చెల్లదని వివరించారు.ఆ నోటీసులో కేసు వివరాలు ప్రస్తావించలేదని, భయపెట్టేందుకే ఈ నోటీసులు ఇచ్చారన్నారు. జారీ చేసిన నోటీసుల పైన చింతకాయల విజయ్ సీఐడీకి రాసిన లేఖలో కీలక అంశాలను ప్రస్తావించారు. ఎఫ్ఐఆర్ కాపీ, నమోదైన క్రిమినల్ కేసుల వివరాలు చెప్పాలని విజయ్ లేఖలో కోరారు.
విజయ్ విచారణకు హాజరు కాకపోవడంతో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయాలని సీఐడీ అధికారులు గుంటూరు కోర్టును సీఐడీ అధికారులు ఆశ్రయించారు. కేసు విషయంలో నోటీసులు ఇవ్వడానికి వెళ్తే.. తమను చింతకాయ విజయ్ అనుచరులు అడ్డుకున్నారని తెలిపారు. విచారణకు హాజరు కాలేదని దర్యాప్తును అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని సీఐడీ అధికారులు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ పిటిషన్‌పై కోర్టు విచారణ జరపాల్సి ఉంది. ఈ లోపు విజయ్.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు.