Andhra News : రౌడీలకు స్వేచ్చ - రైతులపై 144 సెక్షన్ - ఏపీలో పరిస్థితులపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు !
కర్నూలులో రౌడీలకు లేని 144 సెక్షన్ అమరావతి రైతులకు ఎందుకని ప్రశ్నంచారు టీడీపీ నేత అచ్చెన్నాయుడు.
Andhra News : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇదేనా నీ పాలన అంటూ ప్రశ్నించారు. కర్నూలు లో హత్యకేసు నిందితుడికి రక్షణ వలయంగా రోడ్లపై కూర్చున్న రౌడీ మూలకు వర్తించని 144 సెక్షన్, రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వర్తింప చేస్తారా అని ప్రశ్నించారు. శాంతియుతంగా శిబిరంలో కూర్చున్న రైతులపై పోలీసుల్ని ప్రయోగిస్తారా? అని ప్రశ్నించారు. రౌడీలకు మర్యాదలు, రైతులపై మహిళలపై లాఠీలు, బూతులా? ఖాకీ దుస్తుల పరువు తీస్తున్నారని మండిపడ్డారు.
కర్నూలు లో హత్యకేసు నిందితుడికి రక్షణ వలయంగా రోడ్లపై కూర్చున్న రౌడీ మూలకు వర్తించని 144 సెక్షన్, రాష్ట్ర రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులు, శాంతియుతంగా శిబిరంలో కూర్చున్న రైతులపై ప్రయోగిస్తారా? రౌడీలకు మర్యాదలు, రైతులపై మహిళలపై లాఠీలు, బూతులా? ఖాకీ దుస్తుల పరువు తీస్తున్నారు. pic.twitter.com/bYoMJx4IQ1
— Kinjarapu Atchannaidu (@katchannaidu) May 24, 2023
కర్నూలు ఆస్పత్రి దగ్గర కొనసాగుతున్న ఉద్రిక్తత
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ చికిత్స పొందుతున్న విశ్వభారతి ఆస్పత్రి ఉన్న గాయత్రి ఎస్టేట్‌తోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో అవినాష్ రెడ్డి అనుచరులు పెద్ద ఎత్తున ఉన్నారు. ఇద్దరు మినహా సీబీఐ అధికారులంతా కర్నూలు నుంచి వెళ్లిపోయారు. మరో వైపు కర్నూలు, కడప జిల్లాల నుంచి పెద్దఎత్తున పోలీసు బలగాలను రప్పించారు. కడప నుంచి వచ్చిన అనుచరులు, వైసీపీ కార్యకర్తలు ఆస్పత్రి ఎదుట రోడ్డుపై బైఠాయించారు. పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల నుంచి వేలాదిగా వైసీపీ నాయకులు, కార్యకర్తలు కర్నూలుకు చేరుకున్నారు. కడప నగరపాలక సంస్థ కార్పొరేటర్లు, అనుచరులతో వచ్చినట్లుగా తెలుస్తోంది. వీరంతా ఎందుకైనా మంచిదని కర్నూలులోనే ఉంటున్నారు. ఆస్పత్రి ముందే దుప్పట్లు వేసుకుని కూర్చుంటున్నారు. అటు వైపు ఎవర్నీ రానివ్వడం లేదు. అయితే పోలీసులు కూడా వారిని ఏమీ అనడం లేదు.
అమరావతిలో రైతుల శిబిరంపై పోలీసుల దాడులు
మరో వైపు అమరావతిలో టెన్షన్ వాతావరణం ఏర్పడింది. తుళ్లూరు లో 48 గంటల దీక్షకు జడ శ్రావణ్ కుమార్ పిలుపు ఇచ్చారు. అయితే దీక్షకు వచ్చిన శ్రావణ్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీక్షా శిబిరం నిర్వహించ వద్దంటూ రైతులకు పోలీసులు ఆదేశించారు. తుళ్లూరు మెయిన్ బజారులో ఎవ్వరూ ఉండొద్దని.. వెళ్లిపోవాలని ఆదేశించారు. తుళ్లూరులో 144 సెక్షన్ పెడుతున్నారని.. తాము ఏం చేశామని 144 సెక్షన్ పెడుతున్నారని ప్రశ్నించారు. తాము రాజధాని కోసం భూములు ఇచ్చిన పాపానికి.. అమరావతిలో పాకిస్తాన్ బోర్డర్ కంటే అన్యాయంగా ఉందని, రాజధాని ప్రాంతంలో అంతా అరాచకంగా ఉందని మహిళా రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్ల నుంచి రైతులపై పోలీసులు దమనకాండ సాగిస్తున్నారని, ఇక్కడ తమ ప్రైవేట్ స్థలంలో శాంతియుతంగా దీక్ష చేస్తుంటే ఖాళీ చేయాలని పోలీసులు చెప్పడం ఏంటని మహిళా రైతులు మండిపడ్డారు. పోలీసులు శిబిరంలోని వారిని ఖాళీ చేయించే ప్రయత్నం చేయడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ సందర్భంగా డీఎస్పీ దుర్భాషలాడటంతో రైతులు కన్నీరు పెట్టుకున్నారు.
మరో వైపు నెటిజన్లు కూడా కర్నూలులో పరిస్థితుల్ని, అమరావతిలో పరిస్థితుల్ని బేరీజు వేసి ఇదేం పద్దతని ప్రశ్నిస్తున్నారు. రైతులు శాంతియుతంగా చేస్తున్న పోరాటంపై ఉక్కుపాదం మోపి.. మరో వైపు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేయకుండా కాపాడుతున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోకపోడవం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. మొత్తంగా ఈ అంశం సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్ గా మారింది.