TDP Janasena News : టీడీపీ - జనసేన మరో అడుగు ముందుకు - ఉమ్మడి మేనిఫెస్టో దాదాపు ఖరారు !
TDP Janasena News : టీడీపీ , జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను దాదాపుగా ఖరారు చేసుకున్నాయి. సోమవారం టీడీపీ కార్యాలయంలో రెండు పార్టీల మేనిఫెస్టో కమిటీలు సమావేశం అయ్యాయి.
TDP Janasena Combine Manifesto : టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో ( Combine Manifesto ) కమిటీ టీడీపీ ఆఫీసులో సమావేశం అయింది. కలసి పోటీ చేయబోతున్నందున ఉమ్మడి మేనిఫెస్టోను ప్రజల ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించాయి. ఇప్పటికే టీడీపీ తమ పార్టీ మహానాడులో ( Mahanadu ) మినీ మేనిఫెస్టోన ప్రకటించారు. ఆరు గ్యారంటీలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇప్పుడు జనసేన పార్టీ ( Janasena Party ) కూడా కలిసినందున ఆ పార్టీ ఆలోచనలు కూడా తీసుకుని ఉమ్మడి మేనిఫెస్టోపై దృష్టి సారించాయి. ఉమ్మడి మేనిఫెస్టో కమిటీకి సంబంధించి రెండు పార్టీల నుంచి కమిటీలను నియమించారు. ఈ కమిటీలు టీడీపీ ఆఫీసులో సమావేశం అయ్యాయి.
రెండు పార్టీల నుంచి వచ్చిన ప్రతిపాదనలపై ఈ కమిటీ చర్చించింది. టీడీపీ రాజమహేంద్రవరం వేదికగా సూపర్ సిక్స్ హామీలు ప్రకటించిన సంగతి తెలిసిందే. మహిళల కోసం మహా శక్తి, రైతుల కోసం అన్నదాత, యువత కోసం యువ గళం, బీసీలకు రక్షణ చట్టం, పూర్ టు రిచ్, ఇంటింటికీ మంచినీరు హామీలు ఇచ్చింది. జనసేన కూడా షణ్ముఖ వ్యూహంలో భాగంగా ఆరు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. రైతులు, యువత, భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవడం, ఎస్సీ-ఎస్టీ సబ్ ప్లాన్ నిధులను సద్వినియోగం చేయడం వంటి అంశాలను ముందుకు తెచ్చి తెచ్చింది.
మేనిఫెస్టో కమిటీలో సభ్యులుగా తెలుగుదేశం పార్టీ నుంచి సభ్యులుగా పొలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు, ఎమ్మెల్సీ అశోక్ బాబు, పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి ఈ ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన కమిటీలో ఉండగా....జనసేన పార్టీ నుంచి జనవాణి సమన్వయకర్త వర ప్రసాద్, రాజకీయ వ్యవహారాల కమిటీ పీఏసీ సభ్యుడు ముత్తా శశిధర్, జనసేన అధికార ప్రతినిధి శరత్ కుమార్ సభ్యులుగా ఉన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరినీ కదిలించేలా మేనిఫెస్టోను రూపొందించి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని నిర్ణయించాయి. మహిళలు, రైతులు, యువత, బీసీ, పేదలే టార్గెట్‌గా ఇరు పార్టీలు పలు ప్రతిపాదనలు తీసుకువచ్చింది. ఉమ్మడి మేనిఫెస్టో ద్వారా ప్రజలకు టీడీపీ, జనసేన కూటమిపై మరింత నమ్మకం పెరిగేలా చేయాలని భావిస్తున్నాయి. అందుకోసమే కమిటీని ఏర్పాటు చేసి ఏయే అంశాలను మేనిఫెస్టోలో చేర్చాలన్నదానిపై కూలంకశంగా చర్చించారు.
త్వరలోనే ఈ ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించి ఇరుపార్టీల నాయకులంతా ప్రజల్లోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మొత్తం 175 నియోజకవర్గాల్లో టీడీపీ-జనసేన ఆత్మీయ సమావేశాలు జరపాలని నిర్ణయించాయి. అనంతరం ఈ నెల 18 నుంచి ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారు. వీలైనంత త్వరగా ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేయాలని ఈ రెండు పార్టీలు భావిస్తున్నాయి. సోమవారం నాటి సమావేశం లో .. ఉమ్మడి హామీలపై అధినేతల వద్ద స్పష్టత తీసుకుని.. ప్రకటించే అవకాశం ఉంది.