Sankranthi Celebrations: మందడంలో ఘనంగా భోగి వేడుకలు - సంప్రదాయ దుస్తుల్లో చంద్రబాబు, పవన్ సందడి
Amaravathi News: టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ అమరావతిలోని మందడంలో ఆదివారం భోగి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పార్టీ అభిమానులు, కార్యకర్తలు వారికి ఘన స్వాగతం పలికారు.
Chandrababu Sankranthi Celebrations: రాజధాని అమరావతి (Amaravathi) పరిధిలోని మందడం (Mandadam) గ్రామంలో నిర్వహించిన భోగి వేడుకల్లో టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu), జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. అమరావతి ఐకాస, టీడీపీ - జనసేన ఆధ్వర్యంలో 'తెలుగు జాతికి స్వర్ణయుగం - సంక్రాంతి సంకల్పం' పేరుతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత చంద్రబాబు, పవన్ కల్యాణ్ లకు ఇరు పార్టీల నేతలు, అభిమానులు, కార్యకర్తలు, రాజధాని ప్రాంత రైతులు ఘన స్వాగతం పలికారు. ఇద్దరు నేతలూ సంప్రదాయబద్దంగా అడ్డ పంచె కట్టుకుని సందడి చేశారు. భోగి మంటలు వెలిగించిన అనంతరం.. ఏపీలోని వివిధ సమస్యల చిత్రపటాలు, ప్రజా వ్యతిరేక జీవోల కాపీలను మంటల్లో తగలబెట్టారు. తర్వాత టీడీపీ - జనసేన జెండా గుర్తులతో సహా మహిళలు వేసిన ముగ్గులను పరిశీలించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఇరువురూ మాట్లాడారు. వైసీపీ అరాచక పాలనకు రోజులు దగ్గర పడ్డాయని.. రాబోయేవి మంచి రోజులని చంద్రబాబు అన్నారు. అమరావతి రైతుల సంకల్పం నెరవేరుతుందని.. బంగారు రాజదానిని నిర్మించుకుందామని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు.
మందడంలోని భోగి సంకల్పం
— Telugu Desam Party (@JaiTDP) January 14, 2024
(కీడు తొలగాలి-ఏపీ వెలగాలి)
కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు గారు, పవన్ కల్యాణ్ గారు..#భోగిసంకల్పం #BhogiSankalpam #KeeduTholagaliAPVelagali #RaaKadaliraa pic.twitter.com/1RRXWQFubN
సంక్రాంతి శుభాకాంక్షలు
తెలుగు ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగతో అందరి ఇళ్లల్లోనూ సంక్షేమం నిండాలని.. అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని ఆకాంక్షించారు. అటు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నాారా లోకేశ్ కూడా ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రమంతా ప్రగతి కాంతులు ప్రసరించాలని, సంక్షేమంతో ప్రతి కుటుంబంలో సంతోషం నిండాలని ఆయన ఆకాంక్షించారు. తెలుగు జాతికి స్వర్ణయుగం తీసుకు రావడమే టీడీపీ లక్ష్యమని స్పష్టం చేశారు.
భోగి మంటలు.. ప్రగతి కాంతులు.. కష్టనష్టాలు తొలగిపోయి ఆయురారోగ్య ఆనందాలు ప్రతి ఇంటా వెల్లివిరియాలి. ప్రజలందరికీ #bhogi పండగ శుభాకాంక్షలు.
— Lokesh Nara (@naralokesh) January 14, 2024
నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాలు
అటు, టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. ఏటా సంక్రాంతి సందర్భంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు ఇక్కడ పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తోంది. నందమూరి రామకృష్ణ, నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర, వారి చిన్న కుమార్తె తేజస్విని, నారా లోకేశ్ తనయుడు దేవాన్ష్, కంఠమనేని శ్రీనివాస్, లోకేశ్వరి తదితరులు భోగి వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. వీరంతా శనివారం రాత్రే గ్రామానికి చేరుకున్నారు. వైసీపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలు అమలు చేస్తోందంటూ కొన్ని జీవోల ప్రతులను నందమూరి రామకృష్ణ, స్థానిక టీడీపీ నేతలు భోగి మంటల్లో వేశారు. అనంతరం గ్రామంలో నిర్వహించిన ముగ్గుల పోటీలను వసుంధర, తేజస్విని పరిశీలించి.. విజేతలకు బహుమతులు ప్రధానం చేశారు.