Raghu Rama: టీడీపీ - జనసేన తరఫున బరిలో నేనే పోటీ, వైసీపీ చిత్తు - నాలుగేళ్ల తర్వాత సొంత గడ్డపై రఘురామ
Narsapuram MP: టీడీపీ, జనసేన అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన నరసాపురం వచ్చారు.
Grand Welcome To Narsapuram MP: టీడీపీ (TDP), జనసేన(Janasena) అభ్యర్థిగా 2024 ఎన్నికల్లో పోటీ చేస్తానని, వైసీపీని చిత్తుగా ఓడిస్తానని ఆ పార్టీ రెబల్ ఎంపీ (YCP Rebel MP) రఘురామకృష్ణరాజు (Raghu Rama Krishna Raju) అన్నారు. సంక్రాంతి వేడుకల్లో పాల్గొనేందుకు ఆయన నరసాపురం వచ్చారు. రాజమహేంద్రవరం విమానాశ్రయంలో శనివారం ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నాలుగేళ్ల తర్వాత సొంత గడ్డమీద అడుగుపెట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. మాటల్లో చెప్పలేని అనుభూతి కలిగిందని, టీడీపీ నేతలు, జనసైనికులు చూపించిన ఆదరణను జీవితంలో మర్చిపోలేనని అన్నారు.
చంద్రబాబు, లోకేష్, పవన్‌ను జీవితంతో మర్చిపోను
తనను జైలులో పెట్టినప్పటి నుంచి చంద్రబాబు అందించిన సహకారం, లోకేశ్ ఇచ్చిన మద్దతు, పవన్ కల్యాణ్ ఇచ్చిన సహకారం జీవితంలో మర్చిపోనని రఘురామ అన్నారు. కష్టంలో ఉన్నప్పుడే మనకు మనవాళ్లెవరో, పరాయివాళ్లెవరో అర్థమవుతుందని అన్నారు. ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి సొంత జిల్లాలో అడుగు పెట్టకుండా ప్రజలకు సేవలు చేయనివ్వకుండా అడ్డంకులు సృష్టించిందన్నారు. దాదాపు నాలుగేళ్లు వనవాసం పూర్తయిందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని సవాల్ చేస్తూ వాటన్నింటిని అధిగమించి సొంత గడ్డపై అడుగు పెట్టానని తెలిపారు. ఇక్కడ ఇంత ఆదరాభిమానాలతో స్వాగతం పలకడం తన జన్మ ధన్యమనిపించిందని చెప్పారు. గతంలో జరిగిన సంఘటనలు దురదృష్టకరమని, కష్టకాలంలో కూడా రాలేకపోయానని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టు ప్రొటక్షన్‌తో వచ్చానని, పోలీసులు కూడా బాగా సహకరిస్తున్నారని చెప్పారు. రాబోయే రోజులన్నీ మంచివేనని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఘనస్వాగతం
సంక్రాంతి ఉత్సవాలకు వచ్చిన ఆయనకు శనివారం రాజమహేంద్రవరం విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది. ఆయనకు భారీ పోలీసు భద్రత కల్పించారు. వందలాది మంది వివిధ పార్టీ నేతలు, అభిమానాలు ఆయనకు పూలమాలతో స్వాగతం పలికారు. పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, అభిమానులు ఆయన కోసం తరలివచ్చారు. సింహం జిందాబాద్, సింహం నాయకత్వం వర్థిల్లాంటూ నినాదాలు చేశారు. రావులపాలెం నుంచి ర్యాలీగా వచ్చిన రఘురామరాజుకు పశ్చిమగోదావరి జిల్లా దొంగరావిపాలెం వద్ద టీడీపీ, జనసేన నాయకులు ఘన స్వాగతం పలికారు. దొంగరావిపాలెం, సిద్ధాంతం, రామన్నపాలెం, వడలి, పెనుగొండ మీదుగా రఘురామ ర్యాలీ సాగింది. జనసేన, టీడీపీ నాయకులు భారీగా మోటారు సైకిళ్లు, కార్లతో ర్యాలీగా భీమవరం బయలుదేరి వెళ్లారు.
హైకోర్టు ఉత్తర్వులతో రక్షణ
వైసీపీ అధినేత, సీఎం జగన్‌తో విభేదాల వల్ల వివిధ రకాల కేసులకు గురైన రఘురామ సుమారు నాలుగేళ్ల నుంచి ఢిల్లీలో ఉండిపోయారు. ఈ నేపథ్యంలో ఎంపీ రఘురామకృష్ణరాజు సంక్రాంతికి తన ఊరుకు వెళ్తున్నానని, ఇందుకోసం తనకు రక్షణ కల్పించాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశారు. పోలీసులు ఇప్పటికే రఘురామకృష్ణరాజుపై 11 కేసులు పెట్టారని, ఇంకా కేసులు కూడా పెట్టే అవకాశాలు ఉన్నాయని ఆయన తరఫున న్యాయవాదులు పిటిషన్‌లో తెలిపారు. గతంలో ఆయన్ను సీఐడీ అధికారులు అరెస్టు చేశారని, చిత్రహింసలకు గురి చేశారని ఆరోపించారు. ఇప్పుడు కూడా మళ్లీ మరోసారి తప్పుడు కేసు పెట్టి అరెస్టు చేసే అవకాశాలున్నాయని తెలిపారు.
రఘురామకృష్ణరాజు పిటిషన్‌కు విచారణ చేయాల్సిన అవసరం లేదని ప్రభుత్వం తరఫు న్యాయవాది తమ వాదనలు వినిపించారు. కేసు నమోదై.. ఏడు సంవత్సరాల లోపు శిక్ష పడే అవకాశం ఉన్న సెక్షన్లు ఉంటేనే 41ఏ నిబంధనలు వర్తిస్తాయని తెలిపారు. తాజాగా ఆయనపై ఎలాంటి కేసులు పెట్టలేదని చెప్పారు. అయితే ఇరువర్గాల వైపు వాదనలు విన్న హైకోర్టు 41ఏ విధానాన్ని అనుసరిస్తూ రఘురామకృష్ణరాజుకు రక్షణ కల్పించాలని, ఆర్నేష్ కుమార్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన గైడ్‌లెన్స్‌ను అనుసరించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో ఆయన సొంత నియోజకవర్గానికి వచ్చారు.