Chandrababu: టీడీపీ సభలో గందరగోళం - కింద పడబోయిన చంద్రబాబు, పట్టుకున్న భద్రతా సిబ్బంది
Andhra News: రాజమండ్రి సభలో టీడీపీ సభలో చంద్రబాబు కింద పడబోగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. రాజానగరం టికెట్ కేటాయింపుపై బొడ్డు వెంకటరమణ వర్గీయులు ఆందోళనకు దిగగా గందరగోళంతో ఈ ఘటన జరిగింది.
Security Personnel Caught Chandrababu Who About to Fell Down: టీడీపీ అధినేత చంద్రబాబుకు (Chandrababu) ప్రమాదం తప్పింది. తూ.గో జిల్లా రాజమండ్రిలోని (Rajamundry) కాతేరులో సోమవారం టీడీపీ ‘రా.. కదలిరా’ సభలో ఆయన కింద పడబోగా భద్రతా సిబ్బంది పట్టుకున్నారు. రాజానగరం (Rajanagaram) టికెట్ ను జనసేనకు కేటాయించడంపై బొడ్డు వెంకటరమణ వర్గీయులు ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో సభలో గందరగోళం నెలకొంది. స్టేజ్ పై నుంచి చంద్రబాబు దిగుతుండగా.. కార్యకర్తలు దూకుడుగా దిగడంతో ఆయన తూలి కింద పడబోయారు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది ఆయన్ను పట్టుకున్నారు. కార్యకర్తల తీరుపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సంయమనం పాటించాలని సూచించారు.
ఇదీ జరిగింది
టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవలే మండపేట, అరకు స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. అయితే, తమతో ఎలాంటి సంప్రదింపులూ చేయకుండానే ఏకపక్షంగా ఈ ప్రకటన చేశారని జనసేనాని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మండపేటలో టీడీపీ అభ్యర్థిని ప్రకటించడం బాగా లేదన్నారు. తాను రాష్ట్రాన్ని యూనిట్‌గా చూస్తానని.. దీని వల్ల కొన్నిసార్లు ఇబ్బంది కలగవచ్చని అన్నారు. పొత్తు ధర్మం ప్రకారం ఆ స్థానాలు ప్రకటించకుండా ఉండాల్సిందనే అభిప్రాయాన్ని పవన్ వ్యక్తం చేశారు. లోకేష్ సీఎం పదవి గురించి మాట్లాడిన తాను పట్టించుకోలేదన్న జనసేనాని.. చంద్రబాబు నన్ను అడగకుండా రెండు సీట్లు ప్రకటించారు కాబట్టి తాను రెండు సీట్లు ప్రకటిస్తానని అన్నారు. అందుకు అనుగుణంగానే రాజోలు, రాజానగరంలో జనసేన పోటీ ఉంటుందని స్పష్టం చేశారు.
'టీడీపీయే పోటీ చేయాలని పట్టు'
పవన్ ప్రకటనతో రాజానగరం నియోజకవర్గంలో టీడీపీ నేతలు ఆందోళన చెందారు. దీనిపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఇటీవల కలవగా.. ఆయన చంద్రబాబు సరైన నిర్ణయం తీసుకుంటారని నేతలకు సర్ది చెప్పి పంపించారు. అయితే, సోమవారం కాతేరు 'రా.. కదలిరా' సభలో దీనిపైనే గందరగోళం నెలకొంది. రాజానగరం నియోజకవర్గ టికెట్ ను జనసేనకు కేటాయించడంపై బొడ్డు వెంకటరమణ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేశారు. రాజానగరం అసెంబ్లీ స్థానంలో టీడీపీయే పోటీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై ప్రకటన చేయాలని పట్టుబట్టారు.అయితే ఈ విషయమై కార్యకర్తలకు చంద్రబాబు సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. స్టేజీపై ఉన్న కార్యకర్తలకు పార్టీ సీనియర్లు కూడా సర్ధిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే, వెంకటరమణ వర్గీయులు స్టేజీపై ఒక్కసారి తోసుకువచ్చారు. మరోవైపు, జనసేన, టీడీపీ నేతలు పోటాపోటీగా నినాదాలు చేయడంతో గందరగోళం నెలకొంది. ఈ క్రమంలోనే టీడీపీ కార్యకర్తలు ఒక్కసారిగా దూకుడుగా దిగడంతో చంద్రబాబు పట్టు తప్పి కింద పడబోయారు. భద్రతా సిబ్బంది అప్రమత్తతతో ప్రమాదం తప్పింది. అటు, కాతేరు సభకు 7 నియోజకవర్గాల నుంచి భారీగా జనం తరలివచ్చారు. టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు, మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప, రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీ మంత్రులు కేఎస్ జవహర్, పత్తిపాటి పుల్లారావు సభా ఏర్పాట్లను పర్యవేక్షించారు.
Also Read: Sharmila On Sakshi Media: సాక్షి మీడియాలో వాటా ఉంది- పుట్టిన గడ్డ నుంచి డోస్ పెంచిన షర్మిల