AP News : ఆరుద్ర కుమార్తె వైద్యానికి సీఎం జగన్ హామీ, ఎంత ఖర్చైనా భరించాలని ఆదేశాలు
AP News : కూతురు వైద్యం కోసం సీఎం జగన్ ను కలిసేందుకు ప్రయత్నించిన కాకనాడకు చెందిన ఆరుద్రతో సీఎంవో అధికారులు కలిశారు.
AP News : తాడేపల్లి సీఎం క్యాంప్ కార్యాలయం వద్ద చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన రాజులపూడి ఆరుద్రతో సీఎంవో అధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ మరోసారి భేటీ అయ్యారు. సీఎం ఆదేశాల మేరకు రాజులపూడి ఆరుద్రను సీఎం క్యాంప్ కార్యాలయంలో అధికారులు కలిశారు. వెన్నుకు సంబంధించిన సమస్యతో అనారోగ్యానికి గురైన తన కుమార్తె సాయిలక్ష్మీ చంద్రను ఆదుకోవాలంటూ రెండు రోజుల క్రితం వద్ద కాకినాడ జిల్లాకు చెందిన రాజులపూడి ఆరుద్ర సీఎం కార్యాలయాన్ని కోరింది. సీఎం కలవాలని క్యాంపు కార్యాలయం ముందు రోడ్డుపై బైఠాయించింది. సీఎం కార్యాలయం నుంచి ఎలాంటి స్పందన రాలేదని ఆవేదనతో చేయి కోసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది ఆరుద్ర. వెంటనే ఆమెను విజయవాడలోని ఆస్పత్రిలోకి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆరుద్రను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్. ఢిల్లీరావు, విజయవాడ నగర పోలీస్ కమిషనర్ కాంతిరాణా టాటా, ముఖ్యమంత్రి ప్రత్యేక కార్యదర్శి హరికృష్ణ పరామర్శించారు.
ఆరుద్ర సీఎంవో అధికారుల భరోసా
ఆరుద్రతో మాట్లాడిన అంశాలను అధికారులు సీఎం జగన్ కు అందించారు. మరోమారు ఆమెతో మాట్లాడి, సమస్యలను పరిష్కారించాలంటూ తన కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డిని సీఎం ఆదేశించారు. సీఎం ఆదేశాలతో రాజులపూడి ఆరుద్రను ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయానికి తీసుకువచ్చారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు. అనంతరం ముఖ్యమంత్రి కార్యదర్శి ధనుంజయ్‌రెడ్డి ఆరుద్రతో మాట్లాడారు. ఆరుద్ర కుమార్తె సాయిలక్ష్మీ చంద్ర వైద్యానికి అయ్యే ఖర్చును పూర్తిగా భరిస్తామని, ఆ మేరకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీచేశారని ధనుంజయ్ రెడ్డి తెలిపారు. ఎంత ఖర్చైనా భరించాలంటూ సీఎం చాలా స్పష్టంగా చెప్పారంటూ ఆరుద్రకు వివరించారు. జీవనోపాధి కల్పించేందుకు ఉద్యోగం కల్పిస్తామన్నారు. ఆరుద్ర సమక్షంలో నేరుగా కాకినాడ జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేశారు. తనకున్న స్థిరాస్థిని అమ్ముకునేందుకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని, ఎవరైనా అలాంటి పరిస్థితులను సృష్టిచేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న కానిస్టేబుళ్లపై ఇప్పటికే శాఖాపరంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. ఈ మేరకు ఆరుద్ర సమక్షంలోనే కాకినాడ ఎస్పీకి ఆదేశాలు ఇచ్చారు ధనుంజయ్ రెడ్డి. ప్రభుత్వం అన్నిరకాలుగా తోడుగా ఉంటుందని, ఎలాంటి నిరాశకు గురికావొద్దని, ధైర్యంగా ఉండాలని ఆరుద్రకు సీఎం కార్యదర్శి భరోసా ఇచ్చారు.
సీఎంకు కృతజ్ఞతలు
తనలాంటి అసహాయులకు సీఎం జగన్ అండగా నిలుస్తారనే ధైర్యం, నమ్మకం తనకు ఉన్నాయని ఆరుద్ర అన్నారు. అందుకే తాను ఇక్కడకు వచ్చానన్నారు. తన కుమార్తె వైద్యానికి పూర్తి ఖర్చులను భరిస్తాననడం సంతోషకరమని సీఎంవో అధికారులతో చెప్పారు. ఉపాధి కోసం ఉద్యోగం కల్పిస్తామనడంపైనా ఆనందం వ్యక్తంచేశారు. రెండు రోజులుగా అధికారులు ఎప్పటికప్పుడు యోగక్షేమాలు కనుక్కుంటూ, పరామర్శిస్తూ బాగోగులు చూసుకున్నారని ఆరుద్ర తెలిపారు.