Andhra Loans : ఆంధ్రప్రదేశ్ అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి కారణం ఎవరు ? తప్పు మీదంటే మీదని అధికార, విపక్షాల ఆరోపణలు !
ఆంధ్రప్రదేశ్ అప్పులపై విస్తృత చర్చ జరుగుతోంది. అసలు ఈ అప్పుల భారానికి కారణం ఎవరు?
Andhra Loans : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తున్న అప్పుల అంశం ప్రతీ సారి హైలెట్ అవుతూనే ఉంది. తాజాగా ప్రభుత్వం సమయానికి జీతాలివ్వలేకపోతూండటంతో మరోసారి హైలెట్ అయింది. ఈ క్రమంలో అప్పల్లో ఫస్ట్ ..అభివృద్ధిలో లాస్ట్ అంటూ ఏపీ ఆర్థిక పరిస్థితిపై మరోసారి అధికార, విపక్షాల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాష్ట్రం అప్పుల్లో మునిగిపోవడానికి కారణం మీరంటే మీరని ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ విమర్శలు, ఆరోపణల్లో నిజమెంత ?
జగన్‌కు అప్పురత్న బిరుదు ఇచ్చిన పవన్ కల్యాణ్
ఏపీ సిఎం జగన్ని నిన్నటివరకు సిబిఐ దత్తపుత్రడిగా అభివర్ణించిన జనసేన అధినేత ఇప్పుడు అప్పురత్నగా బిరుదు ఇచ్చారు. ఏపీ అప్పుల్లో కూరుకుపోయిందని వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విపక్షాలు గగ్గోలు పెడుతూనే ఉన్నాయి. శ్రీలంక తరహాలోనే రేపో మాపో ఏపీ కూడా దివాళా తీయడం ఖాయమని కూడా జోస్యం చెప్పాయి. అయితే ఈ ఆరోపణలు, విమర్శలను అధికారపార్టీ ఖండించింది. అంతేకాదు ఈ అప్పులకు కారణం కూడా చంద్రబాబేనని ఆరోపించింది. కొత్తరాష్ట్రానికి సిఎంగా వచ్చిన చంద్రబాబు ఆ నాడు కోట్లు ఖర్చు పెట్టి అన్నీ తాత్కాలిక భవనాలే కట్టిందని తెలిపింది. ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉన్నప్పటికీ ఓటుకు నోటు కేసుతో ఏపీకి పరుగులు పెట్టి అమరావతి వేదికగా రియల్ వ్యాపారం చేసిందని , అన్నీ తాత్కాలికంగా కట్టి ప్రజాధానాన్ని కోట్లలో వృదా చేసిందని ఆరోపిస్తోంది.
అప్పులకు కారణం చంద్రబాబు అంటున్న వైఎస్ఆర్‌సీపీ !
ఇలా అప్పుల విషయంలో ప్రతీసారి అధికార-విపక్షాల మధ్య ఈ తరహా ఆరోపణలు రావడం మాములు కావడంతో ప్రజలు కూడా పెద్దగా పట్టించుకోలేదు. అయితే 2019 తో పోలిస్తే ఇప్పుడు అప్పులు ముఖ్యంగా ఈ 9 నెలల కాలంలో ఏపీ చేసిన అప్పులే 55 కోట్లకు పైగా ఉందని తేలడంతో ఇప్పుడీ విషయాన్ని హైలెట్ చేస్తూ జనసేన కార్టూన్ రూపంలో సెటైరికల్ గా విమర్శించింది. అటు లోకేష్ కూడా అప్పులపై కామెంట్ చేయడంతో అధికారపార్టీ అలర్ట్ అయ్యింది. ఈ అప్పులన్నీ మీ నాన్న చంద్రబాబు టైమ్ లోవే జరిగిందని మంత్రి రోజా కౌంటర్ ఇచ్చారు. డిస్కంలతో సహా పలు అభివృద్ధి పనులకు ఆనాడు చంద్రబాబు వేల కోట్ల రూపాయలు చెల్లించకపెండింగ్ లో పెట్టారని అవన్నీ జగన్ హయాంలో తీర్చారని చెబుతూ లెక్కలతో సహా మరోసారి సిద్ధమయ్యారు. అంతేకాదు చర్చలకు సిద్ధమా అని విపక్షాలకు సవాల్ విసురుతున్నారు. అంతేకాదు విపక్షాల ఆరోపణలకు త్వరలో జరగనున్న అసెంబ్లీ వేదికగా ప్రజలకు వివరించాలని కూడా అధికారపార్టీ ఆలోచన చేస్తోంది.
అప్పులపై అసెంబ్లీలో ప్రకటన చేసే యోచనలో సీఎం జగన్
2019లో 2.24లక్షల కోట్లు ఉంటే ఇప్పుడు అది రూ.4.42 లక్షల కోట్లకు ఏపీ అప్పు చేరింది. ఇది కాకుండా బడ్జెటేతర అప్పు కూడా పెరిగిపోతుండటంతో విపక్షాలు ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. రానున్న ఎన్నికల్లో అప్పుల అంశం కూడా కీలకంగా మారనుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.కొత్త రాష్ట్రం అభివృద్ధికి కేంద్రం ఎంత నిధులు ఇస్తోంది..రాష్ట్రం ఎందుకు ఇన్ని లక్షల కోట్లు అప్పులు చేస్తుందన్న విషయంపై కాకుండా అధికార-విపక్షాల మధ్య చర్చ మీరంటే మీరు కారణమని తిట్టుకోవడానికే సరిపోతుండటంపై ప్రజల్లోనూ అసహనం వ్యక్తమవుతోంది.