Rains, Weather Update: నేడు కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు- ఏపీలో పలు జిల్లాల్లో వర్షాలతో అలర్ట్
నైరుతి రుతుపవనాలు నేడు కేరళలో ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. త్వరలోనే భారీ వర్షాలు పడనున్నాయి.

South West Monsoon likely to reach Kerala | అమరావతి: నైరుతి రుతుపవనాలు శనివారం (మే 24న) కేరళను తాకనున్నాయని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. ఇటీవల అంచనా ప్రకారం రుతుపవనాలు ఇదివరకే కేరళను తాకాలి. లక్షద్వీప్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోకి నైరుతి ఋతుపవనాలు ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. కేరళను తాకిన అనంతరం నైరుతి రుతుపవనాలు దాదాపు 3 రోజుల్లోనే ఏపీలోకి విస్తరించన్నాయి. ఏడాది జూన్ మొదటి వారం నుంచి విస్తారంగా వర్షాలు కురువనున్నాయి.
ఐదు రాష్ట్రాలపై అల్పపీడనం ఎఫెక్ట్
అరేబియా సముద్రంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఇది శనివారం నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉంది. దీని ప్రభావంతో గుజరాత్, గోవాలో రెండు రోజులు.. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడులో 25, 26 తేదీల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి.
ఏపీలో పిడుగులతో కూడిన మోస్తరు వర్షాలు
మరో రెండు, మూడు రోజుల్లో పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. సోమవారం నుంచి భారీ వర్షాలకు అవకాశం ఉందని, ఉద్యానవన రైతులు ముందుగానే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ కూర్మనాథ్ సూచించారు. నేడు (మే 24న) అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, తూర్పు గోదావరి, కోనసీమ, కాకినాడతో పాటు ఏలూరు జిల్లాలో పిడుగులతో కూడిన మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. అల్పపీడనం ప్రభావంతో సముద్రంలో ఏర్పడిన అలజడి కారణంగా మే 27 వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని వాతావరణశాఖ అధికారులు హెచ్చరించారు.
అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇవాళ శ్రీకాకుళం జిల్లా అరకబద్రలో 43.7మిమీ,శ్రీసత్యసాయి జిల్లా కల్లుకుంటలో 30.7మిమీ వర్షపాతం నమోదు.తిరుపతి జిల్లా గంగుడుపల్లిలో 39.8 °C గరిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు.
— Andhra Pradesh State Disaster Management Authority (@APSDMA) May 23, 2025
అనకాపల్లి, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, రాయలసీమ జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురవనున్నాయి. శుక్రవారం (మే 23న) శ్రీకాకుళం జిల్లా అరకబద్రలో 43.7మి.మీ వర్షపాతం , శ్రీసత్యసాయి జిల్లా కల్లుకుంటలో 30.7మి.మీ వర్షపాతం నమోదు అయింది. తిరుపతి జిల్లా గంగుడుపల్లిలో 39.8 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదు అయినట్లు వెల్లడించారు.






















