Chandragiri YSRCP : ఆ వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త కోసం అడవుల్లో సెర్చ్ ఆపరేషన్ ! దొరుకుతాడా ?
సొంత పార్టీ నేతలు భూమిని కబ్జా చేశారని, పనులు చేయించి బిల్లులు కూడా రానీయడం లేదని ఆరోపిస్తూ చంద్రగిరికి చెందిన ఓ వైఎస్ఆర్‌సీపీ కారకర్త సెల్పీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి అదృశ్యమయ్యారు. ఇప్పుడా కార్యకర్త కోసం పోలీసులు, అధికారులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
చిత్తూరు జిల్లా చంద్రగిరి ( Chandragiri ) నియోజకవర్గానికి చెందిన వెంకటేష్ ఆచారి ( Venkatesh Achari ) అనే వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త కనిపించకుండా పోయారు. ఆయన కోసం పనపాకం అడవుల్లో పోలీసులు, వైఎస్ఆర్‌సీపీ నేతలు ( YSRCP ) పెద్ద ఎత్తున వెదుకులాట ప్రారంభించారు. ఆయన క్షేమంగా ఉండాలని అందరూ ప్రార్థిస్తున్నారు. ఎందుకటే.. ఆయన కనిపించకుండా పోయే ముందు ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఉన్న విషయాలు తన మరణ వాంగ్మూలం కాకుండా ఉండాలంటే ఆయనను సజీవంగా వెదికి పట్టుకోవాలి మరి. ఆయన తన సెల్ఫీ వీడియోలో వెల్లడించిన వివరాలు వైఎస్ఆర్‌సీపీ నేతల్లోనే కాదు అధికారవర్గాల్లో సంచలనం రేపుతున్నాయి.
వెంకటేష్ ఆచారి పనపాకం ( Panapakam Village ) అనే గ్రామానికి చెందిన వైఎస్ఆర్‌సీపీ కార్యకర్త. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి అనుచరుడు. ఆయన గ్రామంలో తన ఇంటిపక్కన కొంత భూమి ఖాళీగా ఉంటే దాన్ని కొనుగోలు చేశారు. ఇప్పుడు ఆ భూమిని ఇతర వైసీపీ నేతలు కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంలో వెంకటేష్ ఆచారిని బెదిరిస్తున్నారు. అదే సమయంలో ప్రభుత్వం మనదే కాబట్టి ఫలానా కాంట్రాక్ట్ నువ్వే తీసుకో అంటూ గ్రామంలో అనేక పనులు చేయించారు. రూ. ఆరు లక్షలు ఖర్చు పెట్టి పనులు చేసి రోజులు .. నెలలు గడుస్తున్నా ప్రభుత్వం నుంచి బిల్లులు రావడం లేదు. ఓ వైపు సొంత పార్టీ నేతలే తన భూమిని కబ్జా చేయడం ... మరో వైపు సొంత ప్రభుత్వం కూడా చేసిన పనులకు నిధులు ఇవ్వకపోతూండటంతో తీవ్ర మానసిక వేదనకు గురయ్యారు. బిల్లులు ఇప్పిస్తామన్న నేతలు ఇప్పుడు పట్ిటంచుకోక పోవడం..అప్పుల వాళ్లు వెంటపడుతూండటంతో ఆయన ఇక ఆత్మహత్యే ( Suiside Selfie ) శరణ్యమనుకున్నారు.
ఈ విషయాలన్నీ చెబుతూ వెంకటేష్ ఆచారి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డుతున్నానంటూ సెల్ఫీ వీడియో పంపాడు. మండల, రెవెన్యూ, పోలీసులు అధికారుల కార్యాలయాల చుట్టూ ఏడాది పాటు తిరిగిన ఫలితం లేకపోవడంతో మనోవేదన గురైయ్యానని వీడియోలో చెప్పాడు. నా చావుకు కారణం అధికారులు, కొందరు స్థానిక నేతలే అంటూ సెల్ఫ్ వీడియో ( Selfi Video ) కుటుంబ సభ్యులకు, స్నేహితులకు పంపించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు బాధితుడు వెంకటేష్ కోసం పనపాకం అడవుల్లో గాలిస్తున్నారు. వెంకటేష్ ఆచారి ఎలాంటి అఘాయిత్యం చేసుకోకూడదని అధికారులు, స్థానిక వైఎస్ఆర్‌సీపీ నేతలు కోరుకుంటున్నారు.