Hindupur Loksabha : హిందూపురం ఎంపీ అభ్యర్థిపై టీడీపీలో ఉత్కంఠ - బీకే పార్థసారధికి చాన్స్ లభిస్తుందా ?
Andhra News : హిందూపురం లోక్‌సభ అభ్యర్థిగా టీడీపీలో ఉత్కంఠ కొనసాగుతోంది. సామాజిక సమీకరణాల ఆధారంగా పలువురి పేర్లతో సర్వేలు నిర్వహిస్తున్నారు.
Who is the Hindupuram Lok Sabha candidate : హిందూపురం లోక్‌సభ నియోజకవర్గ నుంచి టీడీపీఅభ్యర్థి ఎవరు అనేది గత కొంతకాలంగా గందరగోళంగా మారింది. అధికార వైసీపీ నుంచి నుంచి బోయ సామాజిక వర్గానికి చెందిన జె. శాంతను హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ప్రకటించారు. కానీ కూటమి తరపున ఏ పార్టీ పోటీ చేస్తుంది.. ఎవరు అభ్యర్థి అన్నదనిపై మాత్రం స్పష్టత రావడం లేదు.
హిందూపురంను బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం
జనసేన, బీజేపీ, తెలుగుదేశం కూటమిలో భాగంగా హిందూపురం ఎంపీ స్థానాన్ని మొదట బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం జోరుగా సాగింది. ఇందుకోసం బీజేపీ తరఫున ప్రముఖ ఆధ్యాత్మిక గురువు పరిపూర్ణానంద స్వామి, అదే విధంగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పేర్లు బలంగా వినిపించాయి. కానీ బీజేపీకి ఆరు ఎంపీ స్థానాలు కేటాయించారు. అందులో హిందూపురం పేరు ప్రచారంలోకి రాలేదు. దీంతో టీడీపీనే పోటీ చేస్తుందని భావిస్తున్నారు. సత్యసాయి జిల్లా టీడీపీ అధ్యక్షుడు బీకే పార్థసారధికి హిందూపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా అవకాశం కల్పిస్తారని జిల్లాలో జోరుగా ప్రచారం సాగింది. కానీ ఖరారు చేయలేదు.
ఎంపీ స్థానాలపై రాని ప్రకటన
హిందూపురం నుంచి బీకే పార్థసారధిని కాకుండా అనంతపురం నుంచే అభ్యర్థిగా నిలబడతారని అనుకున్నారు. అయితే తాజాగా అనంతపురం ఎంపీ స్థానం నుంచి జేపీ పవన్ రెడ్డి పేరే ప్రచారంలోకి వచ్చింది. అవకాశం కల్పిస్తే పెనుగొండ ఎమ్మెల్యే అభ్యర్థిగా లేక హిందూపురం ఎంపీ టికెట్టు కేటాయించాలని చంద్రబాబును పార్థసారధి కోరారు. ఇదే సందర్భంలో హిందూపురం లోక్ సభభ సీటుపై మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి, హిందూపురం లోని వాల్మీకి సామాజిక వర్గానికి చెందిన అంబికా లక్ష్మీనారాయణ కూడా పోటీ పడుతున్నారు. దీంతో టిడిపి అధిష్టానం హిందూపురం ఎంపీ అభ్యర్థిగా ఎంపిక కోసం తాజాగా సర్వే పేరుతో మరో కొత్త పేరును ప్రచారంలోకి వచ్చింది. దలవాయి వెంకటరమణ పేరును సూచిస్తూ సర్వే సైతం నిర్వహించారు. కొత్తగా దలవాయి వెంకటరమణ పేరు సర్వేలోకి రావడంతో అనుకొని రాజకీయా మలుపు తిరుగుతోంది.
నియోజకవర్గంలో ఐవీఆర్ఎస్ సర్వేలు
ఇదివరకు టిడిపి అధినేత నిర్వహించిన ఐ వి ఆర్ ఎస్ సర్వే సందర్భంగా వచ్చిన పేరుని ఖరారు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కదిరి,పెనుగొండ, పుట్టపర్తి, సింగనమల, మడకశిర నియోజకవర్గాల అభ్యర్థులను సర్వే ద్వారానే ఎంపిక చేశారు. ప్రస్తుతం హిందూపురం అభ్యర్థిగా మంగళవారం ఐ వి ఆర్ ఎస్ సర్వేలో భాగంగా హిందూపురం ఎంపీ అభ్యర్థిగా దలవాయి వెంకట్ రమణ పేరు బలపరిస్తే ఒకటి నొక్కండి లేదంటే రెండు నొక్కండి అంటూ సర్వే చేశారు. ఈ సర్వే ఆధారంగా బట్టి చూస్తే దలవాయి వెంకటరమణకు హిందూపురం స్థానాన్ని టిడిపి అధినేత ఖరారు చేస్తారా అన్నది జోరుగా ప్రచారం సాగుతోంది.