Sajjala On Venkatrao : వెంకట్రావును పోతే పో అనలేదు - బేరం పెంచుకునే పనిలో పవన్ - సజ్జల విమర్శలు
యార్లగడ్డ వెంకట్రావు పోతే పో అని తాను అనలేదని సజ్జల స్పష్టం చేశారు. ఒక చోట ఒకరికే అవకాశం ఇస్తామన్న యాంగిల్‌లోఅలా మాట్లాడానన్నారు.
Sajjala On Venkatrao : పార్టీ కోసం ఇంత పని చేసినా ఉంటే ఉండు..పోతే పో అని సజ్జల రామకృష్ణారెడ్డి అనడం బాధించిందని అందుకే పార్టీని వీడి పోతున్నానని యార్లగడ్డ వెంకట్రావు ప్రకటించడంపై ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పోతే పో అని ఎవ్వరు అన్నారని తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ వ్యాఖ్యానించారు. టికెట్ లేదని బహిరంగంగా చెప్పలేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం వైసీపీ లో ఆశావహులు పెరిగారని.. ఎంతమంది ఆశావహులు ఉన్న ఒక్కరికే ఇవ్వగలమన్నారు. ఏ పార్టీ అయినా ఇంతే...బలమైన పార్టీకి ఒత్తిడి ఉంటుందని చెప్పుకొచ్చారు. వైసీపీ లో కూడా ఇదే పరిస్థితి ఉందని.. ఒక్కరికే అవకాశం అనే యాంగిల్ లో తాను మాట్లాడానన్నారు. అయితే ఇలాంటి చర్చలు అంతర్గతంగా జరగాలని.. అంతే కాని బయట మాట్లాడ్డం మంచిది కాదని సూచించారు. యార్లగడ్డ విషయం లో ఇదే చెప్పానన్నారు. ఎవరి వ్యక్తిగత స్వేచ్ఛ వాళ్ళదని.. వరస మీటింగ్స్ పెట్టి ఉద్దేశాలు చెప్పడం మంచిది కాదన్నారు. ఇదంతా చూస్తుంటే ముందే నిర్ణయం తీసుకుని మాట్లాడినట్టు ఉందని అనుమానం వ్యక్తం చేశారు.
మరో వైపు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై కూడా సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. పవన్ బేరం పెంచుకోడానికి ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. వైజాగ్ కు రాజధాని వెళ్తున్నందున దుష్ప్రచారం చేస్తున్నారని.. వైజాగ్ వైఎస్ టైం లో ఇప్పుడు కూడా ప్రశాంతంగా ఉందన్నారు. వైజాగ్ లో క్రైమ్ రేట్ పెరగలేదు...తగ్గిందని గుర్తు చేశారు. వైజాగ్ కు రాజధాని రాకూడదని ప్రయత్నం చేస్తున్నారని.. ఏది చేసినా అన్ని ప్రాంతాలు అభివృద్ధి కి వైసీపీ కట్టుబడి ఉందన్నారు. టీడీపీ ఉన్నప్పుడు అసలు లా అండ్ ఆర్డర్ ఉందా... ఇది పవన్ కు తెలుసా అని సజ్జల ప్రశ్నించారు.
ఉదయం అనుచరులతో సమావేశం అయిన గన్నవరం వైసీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు తనను వైసీపీలో అవమానించారని పార్టీ కోసం ఎంత కష్టపడినా.. ఉంటే ఉండు పోతే పో అన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నానన్నారు. దీంతో సజ్జల చేసిన కామెంట్లపై వైఎస్ఆర్‌సీపీలో చర్చ జరుగుతోంది. పార్టీ కోసం కష్టపడిన నేతలను.. పార్టీని నమ్ముకున్న వారిని కాపాడుకోవాల్సిన బాధ్యత అన్ని పార్టీల నేతలకూ ఉంటుందని యార్లగడ్డ చెప్పుకొచ్చారు. అమెరికాలో ఉన్న తనను రాజకీయాల్లోకి తీసుకు వచ్చి.. క్రాస్ రోడ్స్ లో వదిలేసి వెళ్లిపోతున్నారని ఆయన అంటున్నారు.
గత ఎన్నికల్లో గన్నవరం నుంచి పోటీ చేసిన ఆయన వల్లభనేని వంశీ చేతిలో స్వల్ప తేడాతో పరాజయం పాలయ్యారు. వంశీ వైసీపీలో చేరడంతో ఆయనను వైసీపీ హైకమాండ్ పక్కన పెట్టింది. టిక్కెట్ ఇచ్చేది లేదని చెప్పడంతో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు ఆయన నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.