AP RTC Strike : సమ్మెకు ఆర్టీసీ కూడా .. విలీనం తర్వాత సమస్యలు పెరిగాయన్న ఉద్యోగ నేతలు !
ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు కూడా సమ్మెకు సిద్ధమవుతున్నాయి. పీఆర్సీ సాధన సమితికి ఆర్టీసీ యూనియన్ నేతలు మద్దతు పలికారు.
ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మెకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. పీఆర్సీ సాధన సమితి నేతలతో ఆర్టీసీ ఉద్యోగ కార్మిక సంఘాల నేతలు సమావేశం అయ్యారు. ఉద్యోగుల సమ్మెకు మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపాయి. ఆర్టీసీలోని ప్రధాన సంఘాలన్నీ ఏకతాటిపైకి వచ్చాయి. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల అనేక సమస్యలు ఎదుర్కొంటున్నామని ప్రభుత్వం స్పందించడం లేదని నేతలు చెబుతున్నారు. తమకు పీఆర్సీని ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. తమను ప్రభుత్వంలో విలీనం చేయడం సంతోషకరమేనని కానీ తమ ప్రయోజనాలను కాపాడుకోవడానికి సమ్మెకు మద్దతిస్తున్నట్లు ప్రకటించారు.
ఆర్టీసీలోని ప్రధానమైన తొమ్మది సంఘాలు పీఆర్సీ సాధన సమితికి మద్దతు ప్రకటించాయి. అయితే ఉద్యోగులతో పాటే ఆర్టీసీ ఉద్యోగులు కూడా సమ్మె చేస్తారా లేకపోతే కొంత సమయం తీసుకుంటారా అన్నది ముందు ముందు నిర్ణయించనున్నారు. నిబంధనల ప్రకారం ఆర్టీసీ కార్మికులు కూడా యాజమాన్యానికి నోటీసులు ఇచ్చిన తర్వాత సమ్మెకు వెళ్లే అవకాశం ఉంది. కార్పొరేషన్ ఉద్యోగులుగా ఉన్నప్పుడు ఉన్న సౌకర్యాలు ప్రభుత్వంలో విలీనం చేసిన తర్వాత తీసేశారని ఆర్టీసీ ఉద్యోగులు అంటున్నారు. తమకు నాలుగేళ్లకు ఓ పీఆర్సీ అమలు చేసేవారని ఇప్పుడు పూర్తిగా అన్యాయం జరుగుతోందని అంటున్నారు.
సీఎం జగన్మోహన్ రెడ్డి ఎన్నికలకు ముందు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆర్టీసీ మొత్తాన్ని విలీనం చేయడానికి చట్టపరమైన సమస్యలు అడ్డంకిగా ఉండటంతో.. ఉద్యోగుల వరకూ ప్రభుత్వంలో విలీనం చేశారు. ఇప్పుడు ఆర్టీసీ కింద ఎవరూ ఉద్యోగులు లేరు. అందూర పీటీడీ ఉద్యోగులయ్యారు. ఆర్టీసీలో డ్రైవర్, కండెక్టర్, మెకానికల్ కాటగిరీ ఉద్యోగులు కార్మికుల కిందకు వచ్చేవారు. కార్మిక చట్టల ప్రకారం పని గంటలు, ప్రయోజనాలు ఉండేవి. కానీ ఉద్యోగులుగా మారిన తర్వాత ట్రేడ్ యూనియన్ హక్కులను వర్తించడం లేదు. విలీనం కాకముందు పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను ఇవ్వాల్సి ఉందని.. వాటిని ఇవ్వలేదని అంటున్నారు. ఆర్టీసి ఉద్యోగులు ఏర్పాటు చేసుకున్న స్టాఫ్ రిటైర్‌మెంట్ బెన్‌ఫిట్ స్కీమ్ ను రద్దు చేశారు.
ప్రభుత్వం బయట పెట్టని అశుతోష్ మిశ్రా కమిటీ నివేదికలో ఆర్టీసి ఉద్యోగులకు మెరుగైన ఫిట్‌మెంట్ సిఫారసు చేసినట్లుగా చెబుతున్నారు. విలీనం వల్ల నష్టపోతున్న ప్రయోజనాలు.. పీఆర్సీ వల్ల కోల్పోతున్న ప్రయోజనాలు భర్తీ చేయాలని ఆర్టీసీ ఉద్యోగులు కోరుతున్నారు. ఆర్టీసి ఉద్యోగులకు 1.6 శాతం ఫిట్‌మెంట్ మాత్రమే సిఫార్సు చేశారు. విలీనంతో ప్రభుత్వ ఫించను వస్తుందని ఆశించిన ఆర్టీసి ఉద్యోగులకు సీపీఎస్ లేదా పీఎఫ్ పించన్ ఆప్షన్ ఇచ్చారు. వీటన్నింటినీ పరిష్కరించాలని కోరుతున్నారు.