Anil Ambani : విశాఖలో వాలిపోయిన పారిశ్రామిక దిగ్గజం అనిల్ అంబానీ - ప్రధాని మోదీ వచ్చిన మూడు రోజులకే..
Reliance Group CMD Anil Ambani : రిలయన్స్ గ్రూప్ సీఎండీ అనిల్ అంబానీ నేరుగా అచ్యుతాపురం సెజ్‌లో అడుగు పెట్టడంతో ఈ ప్రాంతం పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది.

Atchutapuram SEZ : గతేడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి వ్యాపారవేత్తలు, పారిశ్రామికవేత్తలు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అనేక జిల్లాల్లో పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. మూడు రోజుల క్రితం రాష్ట్రానికి వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ అచ్యుతపురం నాన్-సెజ్‌లో దేశంలోనే అతిపెద్ద గ్రీన్ హైడ్రోజన్ హబ్‌కు శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.1.85 లక్షల కోట్లతో మొత్తం 1200 ఎకరాల్లో దీనిని ఏర్పాటు చేయనున్నాయి. అయితే, ప్రధాని మోదీ వచ్చిన రెండు రోజుల్లోనే దేశీయ పారిశ్రామిక దిగ్గజాలలో ఒకరైన అనిల్ అంబానీ విశాఖపట్నాన్ని సందర్శించారు. అచ్యుతపురం, రాంబిల్లి మండలాల పరిధిలోని భూములను ఆయన స్వయంగా వచ్చి పరిశీలించడం గమనార్హం.
రిలయన్స్ గ్రూప్ సీఎండీ అనిల్ అంబానీ నేరుగా అచ్యుతాపురం సెజ్‌లో అడుగు పెట్టడంతో ఈప్రాంతం పేరు ఒక్కసారిగా మార్మోగిపోయింది. ప్రధాని నరేంద్ర మోదీ వచ్చిన మూడు రోజులకే ఇప్పుడు అనిల్ అంబానీ వచ్చి భూములను పరిశీలించడం ఈ ప్రాంతం భవిష్యతును కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. పరిశ్రమల రాకతో తమ మండలానికి మహర్దశ పట్టిందని అక్కడి ప్రజలు అంటున్నారు. చంద్రబాబు నాయకత్వంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం కొలువుదీరడంతో పారిశ్రామికవేత్తల చూపు రాష్ట్రంపై పడింది. దీనిలో భాగంగానే అచ్యుతాపురం, నక్కపల్లి, విశాఖ పరిధిలో పలు ప్రాజెక్టులకు ఈ ఆరునెలల్లో పునాదులు, శంకుస్థాపనలు చకచకా జరిగిపోతున్నాయి.
అచ్యుతాపురం నాన్ సెజ్‌లో గ్రీన్ హైడ్రోజన్ హబ్‌తో పాటు వెయ్యి ఎకరాల పరిధిలో బ్రాండిక్స్ అపెరల్ సిటీ ఏర్పాటు కానుండడంతో ఈ ప్రాంతంలో మహిళలకు ఉపాధి లభిస్తుందన్న భరోసా కలిగింది. ఇప్పుడు ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో నిర్మించే గ్రీన్ హైడ్రోజన్ హబ్ ద్వారా వేలాది మందికి ఉద్యోగ ఉపాధి లభించనుంది. 1500 ఎకరాల పరిధిలో సోలార్ ప్లేట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేసే అంశాన్ని రిలయన్స్ పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో మరింత మందికి ఉపాధి కలిగే అవకాశం ఏర్పడనుంది. ఇప్పటికే బాబా అణువిద్యుత్తు పరిశోధన స్థానం (బార్క్), ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఏషియన్ పెయింట్స్, సెయింట్ గోబైన్, ల్యారస్, పెస్పీ వంటి యూనిట్లతో అచ్యుతాపురం ఒక వెలుగు వెలుగుతుంది. ఇప్పుడు మరో ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టు అచ్యుతాపురంలో ఏర్పాటు కాబోతుండడం ఈ ప్రాంతం అభివృద్ధికి ఎంతో దోహదం చేస్తుంది.
నిజానికి, రిలయన్స్ సీఈఓ సెజ్‌లోని భూములను పరిశీలించడానికి వస్తున్నారని అధికారులకు సమాచారం అందింది. కానీ, అనిల్ అంబానీ స్వయంగా రావడంతో వారు షాక్ అయ్యారు. చార్టర్ విమానంలో విశాఖపట్నం చేరుకున్న రిలయన్స్ అధినేత అనిల్ అంబానీ అక్కడి నుండి రోడ్డు మార్గంలో అచ్యుతపురం వెళ్లారు. నాన్ సెజ్‌లోని భూములను పరిశీలించడానికి వచ్చిన అనిల్ అంబానీని ఎలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్‌కుమార్ కలిశారు. ఎమ్మెల్యే ఆయనను శాలువా కప్పి సత్కరించారు. తాను రిలయన్స్‌లో పనిచేశానని ఎమ్మెల్యే అనిల్ అంబానీకి వివరించారు. అనిల్ అంబానీ ఈ ప్రాంతంపై దృష్టిసారించడం ఈ ప్రాంత ముఖచిత్రాన్ని మార్చేస్తుందని పారిశ్రామికవేత్తలు చెబుతున్నారు.
Also Read: Indian Economy : 2025 లో భారత ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంటుంది - ఐఎంఎఫ్ ఆందోళన వెనుక కారణం ఏంటంటే ?





















