Konaseema Crime News: ఒకప్పుడు భర్త ఎంతలా వేధించినా కన్నీరు పెట్టుకుని కాసేపాగాక మళ్లీ కలిసిపోయేవాళ్లు. భర్త వేధింపులపై పెద్దల్లో పెట్టడం లేదా పుట్టింటికి వెళ్లిపోవడం జరిగేది. లేకుంటే విడాకుల కోసం పట్టుబట్టేవాళ్లు. వేధిస్తున్న భర్తను భూమి మీదే లేకుండా చేయాలని చూసింది ఓ భార్య. అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఇది చోటుచేసుకుంది. మద్యం సేవించి తరచూ వేధిస్తున్నాడన్న కోపంతో నిద్రిస్తున్న భర్తపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టి ఆపై బయటకు రాకుండా గడియ పెట్టిన భార్య ఉదంతం కలకలం రేపింది. బాధితుడు 80 శాతంపైగా తీవ్ర గాయాలతో ప్రస్తుతం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య కొట్టిమిట్టాడుతున్నాడు. కొత్తపేట నియోజకవర్గం గోపాలపురంలో జరిగిన ఈ ఘటన సంచలనం రేకెత్తించింది..
నేపాల్ యువతితో ప్రేమ, పెళ్లి...
ఆటో నడుపుకునే గోపాలపురానికి చెందిన మట్టా శ్రీనుతో తాడేపల్లిగూడెంకు నేపాల్ ప్రాంతం నుంచి క్యాథలిక్ మిషనరీ సంస్థలో ఉపాధి కోసం వచ్చి ఓ ప్రైవేటు స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తోన్న ఏంజిలీనా జెనీఫర్ థామస్‌తో పరిచయం ఏర్పడింది.. ఈ పరిచయం ప్రేగా మారి పన్నెండేళ్ళ క్రితం ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.. బీఈడీ చదువుకున్న ఏంజలీనా ఓ స్కూల్లో పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేది. అయితే పెళ్లి తర్వాత శ్రీను ప్రవర్తనలో మార్పు వచ్చింది. రోజూ మద్యం తాగి వచ్చి హింసించేవాడు..
ఈక్రమంలోనే కరోనా తరువాత ఉపాధి నిమిత్తం భార్య ఏంజిలీనాను గల్ఫ్ కూడా పంపించాడు.. కొన్ని నెలలకే తిరిగి ఇంటికి వచ్చేయాలని తరచూ ఫోన్లు చేయడంతో తిరిగి గోపాలపురం వచ్చేసింది. ఈక్రమంలోనే మరింత మద్యానికి బానిసైన భర్త శ్రీను భార్యను తరచూ కొట్టి వేధించేవాడని పోలీసుల విచారణలో తెలిపింది. నెల రోజుల క్రితం తాడేపల్లిగూడెం వెళ్లిపోగా మళ్లీ బ్రతిమిలాడి తీసి తెచ్చకున్నాడు. కలిసే ఉంటున్న భార్య భర్తలు తరచూ గోడవలు పడుతున్నారని స్థానికులు తెలిపారు. గతంలో రెండు సార్లు భార్య ఏంజిలీనా ఆత్మహత్యాయత్నానికి కూడా పాల్పడింది.
తెల్లవారు జామున 3 గంటల సమయంలో పెట్రోల్ పోసి..
గత కొన్ని రోజులుగా ఇద్దరి మధ్య గొడవుల తారాస్థాయికి చేరుకున్నాయని, భార్య తరచూ ఫోన్లో ఎవరితోనో మాట్లాడుతుందని గ్రహించిన శ్రీను భార్యపై మరింతగా రెచ్చిపోయాడు. వేధింపులు ఎక్కువయ్యాయి. భర్తను చంపేస్తే అన్నింటికీ పరిష్కారం లభిస్తుందని శ్రీను మర్డర్‌కు స్కెచ్ వేసింది భార్య.
గురువారం తెల్లవారు జామున 3 గంటల సమయంలో అప్పటికే తెచ్చుకుని పెట్టుకున్న పెట్రోల్ ను నిద్రిస్తున్న భర్తపై వేసి నిప్పుపెట్టింది.. బయటకు రాకుండా బయట గడి పెట్టి పక్కగదిలోకి వెళ్లిపోయింది.. దీంతో మంటల్లో చిక్కుకున్న భర్త పెట్టే ఆర్తనాదాలకు పక్కింటివాళ్లు వచ్చి గడియ తీసే సరికే అతను తీవ్రంగా కాలిపోయాడు.. దీంతో హుటాహుటీన బాధితుడ్ని కొత్తపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.. అక్కడి నుంచి రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా మెరుగైన చికిత్స కోసం కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.. అయితే శరీరం 80 శాతానికిపైగా కాలిపోగా శ్రీను పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారని కుటుంబికులు తెలిపారు.
కేసు నమోదు చేసి భార్యను అదుపులోకి..
రావులపాలెం పరిసర ప్రాంతాల్లో ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశం అయ్యింది.. ఇటీవల కాలంలో భార్యలు భర్తలను మట్టపెడుతున్న ఘటనలను విన్నామని, అయితే ఇప్పడు ఇక్కడకు కూడా ఈ పరిస్థితి వచ్చిందని చెప్పకుంటున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన రావులపాలెం పోలీసులు నిందితురాలైన భార్య ఏంజిలీనా జెనీఫర్ థామస్ ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు..