Jeelugumilli SI: జీలుగుమిల్లి ఎస్సైపై లైంగిక ఆరోపనలు, సస్పెండ్ - మహిళ సెల్ఫీ వీడియో వైరల్
West Godavari: జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా ఉన్న సమయంలో తనను శారీరకంగా వాడుకున్నారని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది.
పశ్చిమగోదావరి జిల్లా జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో గతంలో ఎస్సైగా పని చేసిన ఆనంద రెడ్డిపై లైంగిక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు. ఆయన జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌లో ఎస్సైగా ఉన్న సమయంలో తనను శారీరకంగా వాడుకున్నారని ఓ మహిళ ఆరోపిస్తోంది. ఈ మేరకు ఆమె సెల్ఫీ వీడియో కూడా విడుదల చేసింది. ఈ మహిళ కొద్ది నెలల క్రితం ఓ కేసు వ్యవహారంలో జీలుగుమిల్లి పోలీస్ స్టేషన్‌కు ఫిర్యాదు చేయడానికి వచ్చారు. ఆ సమయములో తన ఫోన్ నెంబర్ తీసుకున్నారని, పరిచయం చేసుకొని తనను లైంగిక దాడులు చేసి మోసం చేసినట్లుగా మహిళ ఆరోపిస్తోంది. ఈ మేరకు మహిళ సోషల్ మీడియాలో తనకు జరిగిన అన్యాయంపై ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
దీంతో ఎస్సై ఆనంద రెడ్డిపై జంగారెడ్డి గూడెం పోలీస్ స్టేషన్‌లో క్రిమినల్ కేసు క్రైమ్ నెంబర్ 131/22 u/s 376, 384, 506, ఎస్సీ, ఎస్టీ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్లు, చట్ట ప్రకారం ఆనంద రెడ్డిపై శాఖాపరమైన విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ తెలిపారు.