తెలుగు రాష్ట్రాల్లో రెండు రోడ్డు ప్రమాదాలు - ఐదుగురు మృతి
అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో జరిగిన ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు.
తూర్పు గోదావరి డాక్టర్ బీ ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముమ్మిడివరంలో జాతీయ రహదారిపై కారును టిప్పర్ లారీ ఢీ కొట్టింది. యానాం వైపు నుంచి అమలాపురం వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న లారీ ఢీకొట్టింది. కారులో నలుగురు ప్రయాణిస్తుండగా సంఘటన స్థలంలో ముగ్గురు మృతి చెందారు. మిగిలిన వ్యక్తిని అమలాపురం ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్టు వైద్యులు చెబుతున్నారు.
మృతుల వివరాలు..
అమలాపురం నారాయణపేటకు చెందిన దొంగ స్వామి(31), జె.కృష్ణ(35), యనమదల రాజేష్ (34). రాత్రి 11 గంటల సమయంలో యానాం నుంచి వస్తున్న టైంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మద్యం మత్తులో టిప్పర్‌ను ఢీ కొన్నట్లు ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇందులో ఒక వ్యక్తి పెళ్లి రోజు కావడంతో యానాం వెళ్లారు. అతి వేగంగా టిప్పర్‌ను ఢీ కొనడంతో కారు తునాతునకలైంది. ప్రమాదం జరిగిన అరగంటపాటు అటుగా ఎవరూ వెళ్లలేదు. కాకినాడలో పెళ్ళికి వెళ్లి తిరిగి వస్తున్న జక్కంపూడి కిరణ్ చూసి క్షతగాత్రుణ్ని ఆసుపత్రికి తరలించారు.
తెలంగాణలో రోడ్డు ప్రమాదం అన్నదమ్ములు మృతి
తెలంగాణలోని హన్మకొండ జిల్లా హసన్ పర్తి మండలంలోని అనంతసాగర్ క్రాస్ వద్ద మరో ప్రమాదం జరిగింది. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. ఇద్దరూ అన్నదుమ్ములే కావడంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది. ఒకరు రైల్వే ట్రైనీ టీసీ కాగా... ఇంకో వ్యక్తి సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.
అనంతసాగర్ క్రాస్ వద్ద తెల్లవారు జామున జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందారు. వారిలో ఒకరు పెద్దవాడు శివరాం (24) రైల్వే ట్రైనీ టికెట్ కలెక్టర్ కాగా రెండోవాడు హరికృష్ణ (23) సాప్ట్ వేర్ ఇంజినీర్. బిడ్డలను కోల్పోయిన ఆ తల్లిదండ్రుల ఆర్తనాదాలు అక్కడి వారిని కన్నీరు పెట్టించింది. విషయం తెలిసిన ఎల్కతుర్తి ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, ఎస్సై పరమేష్, హసన్‌పర్తి ఎస్సై విజయ్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించేందుకు చుట్టుపక్కల ప్రాంతాలలో ఉన్న సీసీ టీవీ పుటేజిని పరిశీలిస్తున్నారు.
కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం కందుగులకు చెందిన ఇప్పాలపల్లి మనోహర్ హోటల్ నడుపుకుంటూ పిల్లలను ప్రయోజకులుగా తీర్చిదిద్దారు. పెద్దవాడు శివరాం (24) ఇటీవలే రైల్వేలో టికెట్ కలెక్టర్ కొలువుకు ఎంపికై శిక్షణ పొందుతున్నాడు. రెండో వాడు హరికృష్ణ (23) హైదరాబాద్ లో ఓ ప్రైవేటు కంపెనీలో సాఫ్టు వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. త్వరలోనే ఇద్దరికీ పెళ్లి చేద్దామనుకున్న ఆ తల్లిదండ్రుల ఆశలు అడియాశలుగానే మిగిలాయి. కందుగుల నుంచి తెల్లవారు జామున 5 గంటలకు టూవీలర్‌పై హైదరాబాద్ బయలుదేరారు. మార్గమధ్యలో అనంతసాగర్ క్రాస్ రోడ్డు వద్ద ఉదయం ప్రమాదం జరిగింది. వీరు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వేరే వాహనం వేగంగా ఢీ కొట్టినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Also Read:మాజీ మంత్రి పేర్ని నాని రాజకీయ రిటైర్‌మెంట్- జగన్ సమక్షంలోనే ప్రకటన
Also Read: రుపతిలో విరూపాక్ష సీన్- అర్థరాత్రి పూట అగ్గిరాజేస్తున్న యువతి